Sitarama Project | సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్

సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గురువారం ఉదయం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రయల్ రన్ మోటార్ పంప్ హౌస్‌ని పరిశీలించారు.

  • Publish Date - June 27, 2024 / 05:00 PM IST

విధాత: సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గురువారం ఉదయం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రయల్ రన్ మోటార్ పంప్ హౌస్‌ని పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం మరియు మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందనున్నది. ఈ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్, బీఆరెస్ లు ట్విట్ చేశాయి.

కమీషన్ల కోసం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెంచారు: ట్విట్టర్ లో కాంగ్రెస్

సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 లోనే రూ. 3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, బీఆర్ఎస్ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేండ్లు ఆలస్యం చేసిందని ట్విట్టర్ లో కాంగ్రెస్ ఆరోపించింది. ప్రాజెక్టుకు అవసరం అయిన అనుమతుల్లో, భూ సేకరణలో, బాధితులకు పునరావాసం అందించడంలో నిర్లక్ష్యం చేసి, బీఆర్ఎస్ నేతలు మాత్రం అందినకాడికి దోచుకున్నారని ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

సీతారామ ప్రాజెక్ట్ కు గోదావరి జలకళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ఫలితమేనని కాంగ్రెస్ పార్టీ ట్విట్ చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక, జనవరి 7, 2024 నాడు ప్రాజెక్టు పురోగతిపై రివ్యూ నిర్వహించి, ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారని ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

కేసీఆర్ మహా సంకల్పం నెరవేరిన రోలు ఇది: కేటీఆర్

మరో స్వప్నం సాకారమైన క్షణమిది…కేసిఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజిది.. అని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్ చేశారు. గురువారం సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా “సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ” అని.. ఆనాడే ప్రకటించారు నాటి సీఎం కేసిఆర్ అని తెలిపారు. ఖమ్మం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే.. వరప్రదాయినికి ప్రాణం కేసీఆర్ పోశారని ట్విట్ చేశారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించారన్నారు. పటిష్ట ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలుచేశారని పేర్కిన్నారు.

ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలకు బంగారు బాటలు వేశారని తెలిపారు. ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదని, దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదన్నారు. కాలమైనా.. కాకపోయినా..పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో..ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయన్నారు. కేసిఆర్ కలను సాకారం చేసి ఈ “జలవిజయం”లో భాగస్వాములైన.. నీటిపారుదల అధికారులు, సిబ్బందికి అభినందనలన్నారు. కష్టపడిన ప్రతిఒక్కరికి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ…జై సీతారామ ప్రాజెక్టు అని ట్విట్ చేశారు.

గత పాలకులు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరివ్వలే: డిప్యూటీ సీఎం భట్టి

గత పాలకులు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 9వేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలన్నిటిని తెప్పించుకొని, ఆరు నెలల్లో పూర్తి చేయగలిగేవి ఏంటి, ఏడాదిలో, మూడు సంవత్సరాల కాలంలో, ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్న అన్ని ప్రాజెక్టులను గుర్తించామని తెలిపారు. వీటినని ప్రాధాన్యత క్రమం లో పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని పారిస్తామని తెలిపారు. రూ. 70 కోట్లతో వైరా ప్రాజెక్టుకు లింకు కెనాల్ ను అనుసంధానం చేస్తున్నట్టు వివరించారు.

Latest News