విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వెంకటాపురం కొండలపై కొలువైన శ్రీ మత్స్యగిరి లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్లు, కరపత్రాలను స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకి ఈవో సల్వాది మోహన్ బాబు, దేవస్థానం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డిలు ఆహ్వాన పత్రికను అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కొడితాల కరుణాకర్, అర్రూర్ వెంకటేష్, రేఖల ప్రభాకర్, మైళ్ల అంజయ్య, బండి రవికుమార్, గుండు జగన్ మోహన్ రెడ్డి, ఈతాప రాములు, జక్కల కేతమ్మ, మైసోళ్ళ వెంకటేశం, కొమిరె బాలేశ్వర్, కందుల శ్రీను, అర్చకులు, సిబ్బంది, పాల్గొన్నారు.
31నుంచి 3వరకు బ్రహ్మోత్సవాలు
శ్రీ మత్స్యగిరి బ్రహ్మోత్సవాలు ఈ నెల 31నుంచి నవంబర్ 3వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 31న విశ్వక్సేన ఆరాధన, అంకరార్ఫణ, నవంబర్ 1న ద్వజారోహణం, శేషవాహన సేవ, భేరీ పూజా, దేవతాహ్వానం, 2న హనుమత్ వాహన సేవ, 3న ఉదయం 11గంటలకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, 4న సుదర్శన నారసింహ ఇష్టి, 5న చక్రతీర్ధం, గరుడ వాహన సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మత్స్యగిరి లక్ష్మినరసింహ స్వామి క్షేత్ర విశిష్టతలోకి వెళితే ఇక్కడ భారీ కొండలపైన స్వామివారు మత్స్యావతార రూపంలో కొలువై ఉన్నారు. స్వామివారికి నిదర్శనంగా గుట్టపైన పుష్కరణిలో తిరునామాలు, మీసాలతో కూడిన మహిమాన్విత చేపలు దర్శనమిస్తుంటాయి. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.