AP CM Chandrababu Naidu | హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ: సీఎం చంద్రబాబు

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎవ్వరూ ట్యాపర్‌ చేయలేని విధంగా రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు.

Chandrababu

AP CM Chandrababu Naidu | రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. డోన్ నియోజకవర్గం కొత్తబురుజులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, కేంద్రం రూ.30 వేల కోట్లు పూర్వోదయ పథకం కింద ఇస్తుందని తెలిపారు. తాను కష్టపడేది పేదల కోసమేనని చెప్పారు. పేదలకు అండగా ఉంటానన్నారు. ఫ్రూట్ కవర్ల వల్ల పండ్లకు మంచి ధర వచ్చిందని హార్టికల్చర్ అధికారులు వెల్లడించారని తెలిపారు. పండ్లకు కవర్ల తొడుగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. 50 శాతం మామిడి పండ్లకు తొడిగే కవరుకు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. కవరు తొడిగిన పండ్లకు రూ.40 వేల దాకా వస్తున్నాయని, ఇంటర్నేషనల్ మార్కెట్లో టన్నుకు రూ.1.70 లక్షలు వస్తున్నాయని వెల్లడించారు. జిల్లాలో పండ్లకు మంచిధర వచ్చే వివిధ వెరైటీల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. జిల్లాలో భూగర్భ జలాలు పెరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీమ తాగు, సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు.

విధ్వంస పాలన చేసిన వైసీపీ

గత వైసీసీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 16,816 గ్రామాలున్నాయని, 6,860 గ్రామాల్లో సర్వే గత ప్రభుత్వంలో చేశారని చెప్పారు. రికార్డులు తారుమారు చేసి, తప్పుల తడకగా 19.93 లక్షల పుస్తకాలు ఇచ్చారని మండిపడ్డారు. వాటన్నింటినీ పక్కనపెట్టేసి మళ్లీ కొత్తగా రైతులకు పుస్తకాలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దుతూ ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇస్తోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ విధానం కూడా సులభతరం చేస్తున్నామన్నారు. ‘అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దుతున్నాం’ అని చెప్వాపారు. వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూముల పుస్తకాలపై ఫోటోలు వేసుకున్నారని దుయ్యబట్టారు. సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకుని, రూ.750 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. తాను ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయి అని, ఒకళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని సరిదిద్దడానికి 20 నెలలు పట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల సమక్షంలోనే భూ కొలతలు తీసుకుని రైతుల ఆమోదంతో భూ వివరాలతో పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయకుండా క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చామని చెప్పారు. ఎవరు రికార్డులు తారుమారు చేసినా తెలిసిపోతుందన్నారు. ఎమ్మార్వో, వీఆర్వోలు తప్పు చేసినా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుందని అన్నారు. తాము ఇచ్చిన పట్టాదార్ పుస్తకాలను ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరని చంద్రబాబు అన్నారు. రూపాయి అవినీతి లేకుండా కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు.

తప్పుడు ప్రచారాలతో ఎదురుదాడి

తిరుమల లడ్డూ కల్తీ, మద్యం అవినీతి, భూ దోపిడీ వంటి వాటిపై ప్రక్షాళన చేస్తున్నామని, వాటిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. లడ్డూ విషయంలో సీబీఐ ఇచ్చిన రిపోర్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని అపవిత్రం చేస్తే తాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వివేకానందరెడ్డిని హత్య చేసి .. తన చేతిలోనే కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన ఘనులు వాళ్లని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన అన్యాయాన్ని ఆయన సోదరి సునీత తెలుసుకున్నారని చెప్పారు. తిరుమల లడ్డుపైనా రాజకీయం చేసి, తప్పును కప్పి పుచ్చుకునేందుకు తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

ఒలంపిక్స్ లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి
Indian Rupee : యుద్దం ఎఫెక్ట్..భారీగా పడిపోయిన రూపాయి విలువ !

Latest News