న్యూఢిల్లీ : బీసీ రిజర్వేషన్ల వివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు విధించిన స్టేను సమర్ధించిన సుప్రీంకోర్టు..ఈ వివాదాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది.. బీసీ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని సింఘ్వీ కోర్టుకు వివరించారు. అయితే ప్రతివాద న్యాయవాది స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లమని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొందని.. బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీం తీర్పులు స్పష్టంగా ఉన్నాయని.. కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేసిందని తమ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు పేర్కొన్నట్లుగా పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టులో తదుపరి విచారణ ఉన్నందునా వివాదాన్ని అక్కడే తేల్చుకోవాలని పేర్కొంది.