Site icon vidhaatha

Teenmar Mallanna | ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తీన్మార్ మ‌ల్ల‌న్న‌కే ప‌ట్టం

Teenmar Mallanna | న‌ల్ల‌గొండ : వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్ కుమార్ గెలుపొందారు. ఎలిమినేష‌న్ ప్ర‌క్రియలో భాగంగా బీజేపీ అభ్య‌ర్థి గుజ్జుల ప్రేమేంద‌ర్ రెడ్డికి వ‌చ్చిన రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపు ముగిసిన అనంత‌రం.. బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డి కంటే మ‌ల్ల‌న్న 14 వేల‌కు పైగా ఓట్ల‌తో ముందంజ‌లో ఉండ‌డంతో ఆయ‌న విజ‌యం సాధించారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటాక మ‌ల్ల‌న్న‌కు ఆర్వో దాస‌రి హ‌రిచంద‌న గెలుపు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అంద‌జేశారు. గ‌తంలో నాలుగుసార్లు ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.

ఈ ఉప ఎన్నిక‌కు మే 27వ తేదీన పోలింగ్ జ‌రిగింది. జూన్ 5న ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 7వ తేదీ రాత్రి 10.30 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ముగిసింది. దాదాపు మూడు రోజుల పాటు ఓట్ల లెక్కింపు కొన‌సాగింది. మూడు రోజుల పాటు క్ష‌ణంక్ష‌ణం ఉత్కంఠ‌గా సాగిన ఈ ప్ర‌క్రియ‌లో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ వ‌ర‌కు మ‌ల్ల‌న్న‌కు రాకేశ్ రెడ్డి గ‌ట్టి పోటీనిచ్చారు. ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో రాకేశ్ రెడ్డి, మ‌ల్ల‌న్న కంటే సుమారు 4 వేల వ‌ర‌కు ఎక్కువ ఓట్లు సాధించినా.. అప్ప‌టికే మొద‌టి ప్రాధాన్యంలో మ‌ల్ల‌న్న‌కు 18 వేల పైచిలుకు ఆధిక్యం ద‌క్కింది.

Exit mobile version