విధాత, హైదరాబాద్ :
నేటితరం కళాకారులకు చరిత్రగా మిగిలిన మిద్దె రాములు 1941లో రాజన్నసిరిసిల్ల జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. అక్షర జ్ఞానం లేకున్నా కళలవైపు ఆకర్షితుడై ఒగ్గు కథలో రాణించి.. గ్రామీణ ఒగ్గు కథకు అంతర్జాతీయు కీర్తిని ఆర్జించి పెట్టాడు. ఆశు కవిగా తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయిన మిద్దె రాములు వందలాది ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గుకథ పితామహుడిగా పేరుగడించాడు.
చిన్ననాటి నుంచే ఒగ్గు కథపై మమకారం పెంచుకొని స్వయం కృషితో ఆ ప్రక్రియను ఆకళింపు చేసుకుని ప్రదర్శనలిచ్చేవాడు. సామాన్య గీత కార్మిక కుటుంబంలో పుట్టిన మిద్దె రాములు దేశవ్యాప్తంగా ప్రదర్శనలివ్వడమేకాక విదేశాల్లో కూడా తన ప్రతిభను చాటారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన 1990లో మారిషస్ లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభలో ఆ దేశ ప్రధానిఅనురుధ్ జగన్నాథ్ ప్రశంసలు అందుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట రూపాలు భాగం కాగా.. అందులో సాంస్కృతిక ఉద్యమంగా సాగిన ధూం…ధాం… ప్రధాన భూమికను పోషించిన విషయం తెలిసిందే. ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు దోహదపడిన అనేక రూపాలను ప్రదర్శించిన ఆ వేదిక మిద్దె రాములు బోనం ప్రదర్శనకు పబ్బతి పట్టింది. ప్రముఖ కవి సినారె కూడా మిద్దె రాములును ప్రోత్సహించారు. ఆయన ప్రతిభకు కళాపురస్కార్ అవార్డు అందుకున్నారు. నేడు ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాముల వర్థంతి.
