Siricilla Weaver Crafts QR Shawl : సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. శాలువాపై క్యూఆర్ కోడ్

సిరిసిల్ల నేతన్న నల్ల విజయ్ కుమార్ రూపొందించిన క్యూఆర్ కోడ్ శాలువా ప్రారంభం. స్కాన్ చేస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తుంది.

Siricilla Weaver Crafts QR Shawl

విధాత, హైదరాబాద్: సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచాన్ని అబ్బురపరిచే అద్భుత సృష్టిని ఆవిష్కరించింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న నల్ల విజయ్ కుమార్ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్’ (QR Code) శాలువా వైరల్ గా మారింది. శాలువాపై క్యూ ఆర్ కోడ్ ను ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే చ తెలంగాణ చరిత్ర, సంస్కృతి కళ్ళ ముందు కనిపించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తన నంది నగర్ నివాసంలో క్యూఆర్ కోడ్ శాలువను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

శాలువా ప్రత్యేకతలు

“పోగు బంధంతో ఫోన్ బంధం” అనే కాన్సెప్ట్‌తో ఈ శాలువాను రూపొందించారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా, కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయ వైభవాన్ని తెలిపేలా ఈ కోడ్‌ను తీర్చిదిద్దారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్ రూపొందించడం విశేషం.

నేతన్న నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ: “మా నాన్నగారు గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. గతంలో నేను రంగులు మారే చీరను, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసినప్పుడు, అప్పటి సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం నా అదృష్టం. కేసీఆర్ గారు తెలంగాణకు చేసిన అభివృద్ధిని, మన వారసత్వ సంపదను పదిమందికి తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ క్యూఆర్ కోడ్ శాలువాను రూపొందించాను. సిరిసిల్ల ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు అడ్డా అని నిరూపించడమే నా లక్ష్యం,” అని తెలిపారు.

ఈ అద్భుత ఆవిష్కరణను కేటీఆర్ గారి ద్వారా కేసీఆర్ గారికి అందించాలనే తన కోరికను విజయ్ వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్, తప్పకుండా ఈ శాలువాను కేసీఆర్ గారికి అందజేస్తానని హామీ ఇచ్చారు. నేతన్నలకు కేటీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని విజయ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Gold Silver Price Today : వెండి..బంగారం ధరలు తగ్గుముఖం
CP Sajjanar Warns Transgenders : ట్రాన్స్‌జెండర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక

Latest News