CM Revanth Reddy : విద్యావిధానంలో సమూల మార్పులు..పేదరిక నిర్మూలన జరగాలి

సీఎం రేవంత్ రెడ్డి విద్యా విధానంలో సమూల మార్పులు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని తెలిపారు.

Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత): విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలన్నారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్నారు.

తెలంగాణ నూతన విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు, వారిలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుందని వెల్లడించారు. విద్యా శాఖ కు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుందన్నారు.

పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని, విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడంమే నా ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యమని పేర్కొన్నారు. దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలి, పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దంగా పనిచేయాలన్నారు.

స్కూల్ ఎడ్యుకేషన్‌‌లో లోపాలు ఉన్నాయి, 11 వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరానన్నారు.

1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి, విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా నేను సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కె కేశవ రావు, ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్టా రెడ్డి, ఎంఎల్సీలు కోదండరాం, శ్రీపాల్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, విద్యావేత్తలు, అన్ని యూనివర్సిటీ ల వైస్ చాన్సలర్స్ లు , సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.