విధాత, హైదరాబాద్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన యాత్రికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం.. ప్రమాదంలో మృతి చెందిన వారికి ₹5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ సాయాన్ని వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. మంత్రి అజారుద్దీన్, అలాగే ఎంఐఎం ఎమ్మెల్యేతో పాటు మైనార్టీ శాఖకు చెందిన అధికారితో కలిపి ప్రభుత్వం ఓ కమిటని ఏర్పాటు చేసింది. ఈ బృందం వెంటనే సౌదీ అరేబియాకు వెళ్లి, అక్కడి ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించనుంది.
సౌదీలో మరణించిన వారి మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా సౌకర్యాలు కల్పించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా, ప్రతి బాధిత కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. వారికి వీసాలు, ప్రయాణం, నివా వంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం భరించనుంది. ఈ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన చెందిన 45 మంది చనిపోయినట్లు హజ్ కమిటీ వెల్లడించింది.
