Telangana | వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామి

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని, క్రమంగా ధాన్యం ఉత్పత్తి మరింత పెరుగుతూ పోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కోన్నారు

  • Publish Date - June 7, 2024 / 01:27 PM IST

ప్రపంచ వరి సదస్సులో మంత్రి తుమ్మల
ధాయ్‌లాండ్‌తో సమానం : మంత్రి ఉత్తమ్‌

విధాత : ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని, క్రమంగా ధాన్యం ఉత్పత్తి మరింత పెరుగుతూ పోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కోన్నారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సు(గ్లోబల్ రైస్ సమ్మిట్-2024) మంత్రి తుమ్మల ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సదస్సులో భారత్‌ సహా 30 దేశాలు పాల్గొన్నాయి. శాస్త్రవేత్తలు, రైస్‌ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతోపాటు 250 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. భారత్‌లో వరిసాగు, ఉత్పత్తి, నాణ్యత, విదేశీ ఎగుమతుల పెంపుపై ఈ సదస్సు వేదికగా చర్చించనున్నారు. టెక్నాలజీ, మార్కెటింగ్‌, ఆహార భద్రత లక్ష్యాలుగా మేధోమథనం జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఇటీవలే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నామని చెప్పారు.

రాష్ట్రంలో రైస్‌ సమ్మిట్‌ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని పేర్కొన్నారు. ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భారత్‌లో ఏటా 26 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతోందని తుమ్మల వివరించారు. ప్రపంచ బియ్యం భాండాగారంగా దేశం అవతరించిందని చెప్పారు. తెలంగాణలో 220 వరి రకాలు సాగులో ఉండగా.. తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తోందని చెప్పారు. స్థానిక, ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా రాబోయే రోజుల్లో బియ్యం ఎగుమతులు మరింతగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ వరి ఉత్పత్తి థాయ్‌లాండ్‌తో సమానం

తెలంగాణ వరి ఉత్పత్తి థాయ్‌లాండ్‌తో సమానమని మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి అన్ని రకాలుగా ప్రభుత్వం మద్దతు ఇస్తున్నదని తెలిపారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సేకరిస్తున్నదని వెల్లడించారు. తమది రైతు అనుకూల ప్రభుత్వమని చెప్పారు. వివిధ పథకాల కింద పౌషికాహారం పొర్టిఫికేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 వేల అత్యాధునిక రైస్‌ మిల్లులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో నీటిపారుదల వనరులు పెరుగుతున్నాయని, ఈ మేరకు పంటల సాగు, వరిసాగు పెరుగుతుందన్నారు. ప్రపంచ వరి సదస్సు ద్వారా ఆహార భద్రత దిశగా సానుకూల సత్ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

Latest News