Telangana Municipal Election Notification Expected on January 24 or 27
- మున్సిపల్ నోటిఫికేషన్ ఈనెల 24 లేదా 27న.
- కొనసాగుతున్న ఎస్ఈసీ–కలెక్టర్ల సమీక్షలు.
- 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు సిద్ధం.
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
Municipal Elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరో అడుగు ముందుకేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నోటిఫికేషన్ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో, అధికార యంత్రాంగం నుంచి రాజకీయ పార్టీల వరకూ అందరూ వేగం పెంచారు. జిల్లాల వారీగా జరుగుతున్న సమీక్షలతో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఇప్పటికే ఫిబ్రవరిలో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించడంతో, ఎన్నికల వేడి మరింత పెరిగింది.
కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ సమావేశాలు – త్వరలో స్పష్టత
రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను దశలవారీగా పరిశీలిస్తోంది. ఎస్ఈసీ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది కేటాయింపు, భద్రతా ఏర్పాట్లు, సామగ్రి పంపిణీ వంటి అంశాలను వేగంగా సమీక్షిస్తున్నారు.
ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల అధికారులతో సమావేశాలు పూర్తయ్యాయి. మరికొన్ని జిల్లాల సమీక్షలు జనవరి 21 నుండి 23 వరకు జరుగనున్నాయి. ఈ కసరత్తు పూర్తయ్యాక నోటిఫికేషన్‌ను జనవరి 24న లేదా 27న విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే అధికారిక ప్రకటనను ఎస్ఈసీ ఇంకా వెలువరించలేదు.
రిజర్వేషన్లు ఖరారు – ఖర్చులపై కఠిన నిబంధనలు
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటించగా, ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఈసారి అభ్యర్థుల ఖర్చుల విషయంలో ఎస్ఈసీ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. కార్పొరేషన్ స్థాయి అభ్యర్థులకు రూ.10 లక్షలు, గ్రేడ్-1 మున్సిపాలిటీ అభ్యర్థులకు రూ.5 లక్షల పరిమితి నిర్ణయించారు.
నామినేషన్ దాఖలు చేసే ముందు ఎన్నికల ఖర్చు కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాల్సిన నిబంధన ఉండటంతో ప్రచార ఖర్చులు..ఫ్లెక్సీలు, పోస్టర్లు, డిజిటల్ ప్రమోషన్, వాహనాలు, భోజనాలు, ఇతరత్రా ఖర్చులు ఈ ఖాతా ద్వారానే నిర్వహించాల్సిఉంటుంది. దీంతో పారదర్శకత పెరిగి అక్రమ ఖర్చులకు తావుండదని అధికారులు భావిస్తున్నారు.
ఇకపోతే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఇంచార్జిలను నియమించగా, బీఆర్ఎస్ కూడా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తోంది. జనసేనతో పాటు తెలంగాణ జాగృతి కూడా నిజామాబాద్‌లో ప్రయోగాత్మకంగా పోటీ చేయనుందనే వార్తలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయ చర్చలు వేగం పుంజుకున్నాయి. నోటిఫికేషన్ విడుదల కాగానే అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, బలాబలాల అంచనాలతో అన్ని పార్టీలు తలమునకలుగా మునిగిపోయాయి. ఫిబ్రవరిలో జరిగే ఈ ఎన్నికలు రాష్ట్ర పట్టణ, స్థానిక సంస్థలతో పాటు, రాష్ట్ర స్థాయి రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.
