విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar)కు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్(Naveen Chand) లను సిట్ బృందం(SIT Investigation) తాజాగా విచారించింది. ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘనందన్, మాజీ సీఎస్‌లు సోమేష్‌కుమార్, శాంతికుమారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను మరోసారి సాక్షులుగా విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్త సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లను విచారించి.. అనుబంధ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు సిట్ సిద్దమవుతుంది. ప్రభాకర్ రావును ఎస్ఐబీ ఓఎస్డీగా ఎలా నియమించారనే అంశంపై సిట్ వారిని ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవరెవరి నెంబర్లు ప్రభాకర్ రావు ఇచ్చారనే దానిపై నవీన్ చంద్‌ను సిట్ విచారించింది.
సిట్ బృందానికి సారధ్యం వహిస్తున్న సీపీ వీసీ సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిస్థాయి చార్జిషీట్ కు ఆదేశించారు. చార్జిషీట్ వేశాక కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని నిర్ణయించారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలోఉన్నందునా అంతా జవాబుదారీగా ఉండాలని ఆయన సిట్ అధికారులను ఆదేశించారు. 11 రోజులుగా ప్రభాకర్ రావు ను కస్టోడియల్ విచారణ చేస్తున్న సిట్ …ఈ కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులతో పాటు అధికారులను కూడా విచారించే దిశగా అడుగులేస్తుంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారే అవకాశముంది. డిసెంబర్ 25తో ప్రభాకర్ రావు కస్టడీ ముగియనుంది. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. సిట్ అధికారులు కస్టోడియల్ విచారణను వేగవంతం చేశారు.
