- తన కులం బయటపడుతుందనే ఆత్మహత్య
- చదువులపైనా ఆసక్తితో ఉండేవాడు కాదు
- ఇతర కార్యకలాపాలపైనే ఎక్కువ దృష్టి
- హైకోర్టుకు తెలంగాణ పోలీసుల క్లోజర్ రిపోర్ట్
- బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీకి విముక్తి
హైదరాబాద్: 2016లో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల కేసును తెలంగాణ పోలీసులు మూసివేశారు. దీంతో.. అప్పట్లో సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, వైస్ చాన్స్‌లర్ అప్పారావు, ఏబీవీపీ నాయకులు, కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఈ మేరకు క్లోజర్ రిపోర్టును శుక్రవారం (2024, మే 3) తెలంగాణ హైకోర్టుకు పోలీసులు సమర్పించారు. రోహిత్ రోహిత్ షెడ్యూల్డ్ కులాలకు చెందినవాడు కాదని, తన అసలు కులం బయటపడిపోతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఊహాగానాలు వచ్చాయని పోలీసులు తమ క్లోజర్ రిపోర్టులో తెలిపారు. ఆ కుటుంబం కుల ధృవీకరణ పత్రాలు కూడా ఫోర్జరీ చేసినవని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో, లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో పోలింగ్ నిర్వహణకు పది రోజు ముందు ఈ మేరకు పోలీసులు నివేదిక సమర్పించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రోహిత్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ‘జస్టిస్ ఫర్ వేముల’ పేరుతో 2016లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. దానికి రాహుల్ మద్దతు ఇచ్చారు. ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా రోహిత్ తల్లి రాధికను కాంగ్రెస్‌లో చేరాలని రాహుల్ ఆహ్వానించారు కూడా.
వాస్తవానికి ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), ఎస్సీ, ఎస్టీలపై దాష్టీకాల నివారణ చట్టంలోని పలు సెక్షన్ల కింద ప్రాథమికంగా ఈ కేసును నమోదు చేసినప్పటికీ.. కులం చుట్టూనే తిరిగింది కానీ.. మరణానికి కారణమైన ఇతర అంశాలను ప్రస్తావించలేదు. ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పిన పరిస్థితులపై ఆన్ రికార్డ్ ఎలాంటి ఆధారాలు లేవని, ఆయన మృతికి ఎవరూ కారణం కాదని నివేదిక తేల్చేసింది.
తాను ఎస్సీ కాదని, తన తల్లి తనకోసం ఎస్సీ సర్టిఫికెట్ తెప్పించిందని రోహిత్‌కు తెలుసని రిపోర్టు పేర్కొన్నది. తన అసలు కులం బయటపడితే తాను సంపాదించుకున్న అకడమిక్ డిగ్రీలను కోల్పోయి, విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందన్న భయం ఆయనను వెంటాడిందని పేర్కొన్నది. అయితే.. తాను ఎస్సీల్లో మాల కులానికి చెందినదాన్నని రాధిక వేముల స్పష్టం చేస్తున్నారు. తన చిన్నతనంలో తనను ఓబీసీ కులానికి చెందిన వడ్డెర కుటుంబం సాదిందని చెబుతున్నారు. రోహిత్ తండ్రి మణికుమార్ వడ్డెర కులానికి చెందినవారు. అయితే.. ఆమె దళిత గుర్తింపు బయటపడటంతో రాధికను, ఆమె పిల్లలను వదిలేశారు.
అద్భుతమైన అకడమిక్ నైపుణ్యాలు ఉన్నప్పటికీ.. రాహుల్ చదువులపై కంటే రాజకీయ అంశాలపైనే ఎక్కువగా కేంద్రీకరించేవాడని నివేదికలో పేర్కొనడం గమనార్హం. తనకేమైనా ఇబ్బందులు ఉంటే నిర్దిష్టంగా లేఖ రాసేవాడని కానీ ఆయన ఆ పని చేయలేదని నివేదిక తెలిపింది. అప్పటి క్యాంపస్ పరిణామాలు రోహిత్ మరణానికి కారణం కాదని పేర్కొంది. వాస్తవానికి దళిత విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై యూనివర్సిటీ వీసీ అప్పారావుకు రోహిత్ వ్యంగ్యంగా సుదీర్ఘ ఆత్మహత్య లేఖ రాశారని విద్యార్థి నేతలు గుర్తు చేస్తున్నారు.
తన కులం మూలాలు గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమా? అని దర్యాప్తు అధికారి అడిగినప్పుడు రాధిక వేముల స్పందించలేదని క్లోజర్ రిపోర్ట్ పేర్కొన్నది.