Elections 2024 | పార్టీలు, నేతల్లో టెన్షన్.. టెన్షన్.. జూన్ 4వ తేదీ వరకు ఉత్కంఠ

పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఇక ఫలితాల పై నేతలు, పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడే వరకు అందరికీ ఈ టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది.

  • Publish Date - May 15, 2024 / 07:00 AM IST

ఓటరు తీర్పుపై పార్టీల ఆరా
పోలింగ్ లెక్కల్లో నేతలు నిమగ్నం
సెగ్మంట్లవారీగా అంచనాకు యత్నం
క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ

విధాత ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఇక ఫలితాల పై నేతలు, పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడే వరకు అందరికీ ఈ టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది. ఈ టెన్షన్ నుంచి తప్పించుకునేందుకు నాయకులు, అభ్యర్థులు రకరకాల యత్నాలు ప్రారంభించారు. కొందరు దేవాలయాల సందర్శన చేస్తే మరికొందరు విహారయాత్రలు, విదేశీపర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంకొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎవరికి వారు ఎన్నికల టెన్షన్ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోలింగ్‌ రోజున తమ పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, పట్టు ప్రాంతాల్లో ఓటింగు జరిగే విధంగా పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు సర్వశక్తులొడ్డారు. తమ విజయానికి అవసరమైన పనులు చేపట్టడం, పోల్ మేనేజ్ మెంట్ లో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ నాయకులు, అభ్యర్థులు తలమునకలై ఉన్నారు. పోలింగ్ ముగిసినందున ఫలితాల పై దృష్టి పెడుతున్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ వరకు ఈ ఎన్నికల ఫలితాలపై టెన్షన్ తప్పేట్లులేదు. అయినప్పటికీ ప్రాథమిక స్థాయి అంచనాల్లో అందరూ మునిగిపోయారు. ఏదో రూపంలో తమ గెలుపోటములపై లెక్కలు, ఆరా తీయడంలో పార్టీలు, అభ్యర్థులు నిమగ్నమయ్యారు. అధికారిక ఫలితాలు వచ్చే వరకు ఈ సమాచార సేకరణ సాగుతూనే ఉంటోందని అంటున్నారు. గెలుస్తామనే సమాచారం వస్తే సంతోషం, ఓడిపోతున్నామంటే బాధ తప్పదని భావిస్తున్నారు.

ప్రాథమిక అంచనాలో పార్టీలు

పోలింగ్‌ సందర్భంగానే ఓటింగ్ సరళి, ఓటరు స్పందన, తీరు ఎలా? ఉందనే సాధారణ అంచనాకు వచ్చినప్పటికీ మంగళవారం పూర్తిస్థాయిలో తమ తమ అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ తీరును అంచనావేసే పనిలో పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు, తమకు అనుకూలమైన శ్రేణులు తలమునకలయ్యారు. మంగళవారం ఉదయం నుంచి నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళి, ఏ ప్రాంతంలో ఓటరు ఏ వైపు మొగ్గు చూపారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిందా? తమ పార్టీకి అనుకూల, ప్రతికూల అంశాలను క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తమకు నమ్మకమైన వారి నుంచి తీసుకున్న సమాచారం మేరకు లెక్కలు వేస్తున్నారు.

బూత్‌ల వారీగా గణాంకాల సేకరణ

పోలింగ్ బూత్ వారీగా, ఏజెంట్ల నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు జనరల్ ట్రెండును అంచనావేసి తమ గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నారు. గత నెల రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల్లో చేపట్టిన ప్రచార ప్రభావం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెగ్మెంట్లవారీగా తమకు పోలైన ఓట్ల శాతం, ఈ ఎన్నికల్లో తమకు తమ పార్టీకి ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలతో పాటు అభ్యర్థుల ప్రభావం తదితర అంశాలన్నింటిపై లెక్కలు వేస్తున్నారు. సాధారణ వ్యక్తుల అభిప్రాయమెలా ఉన్నా క్షేత్రస్థాయి నుంచి తమ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ పై ఆధారపడి తమకు జరిగిన లాభనష్టాలను బేరీజు వేస్తున్నారు.

మూడు పార్టీల నాయకుల ఆరా

రాష్ట్రంలో బీఆరెస్, దేశంలో బీజేపీ పదేళ్ళు అధికారంలో ఉన్నందున నెలకొన్న ప్రజావ్యతిరేకతతో పాటు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై లెక్కలుగడుతున్నారు. కాంగ్రెస్ ఓటరు తీర్పు తమ ఐదునెలల పాలనకు రెఫరెండంగా భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా మూడు పార్టీలు నువ్వానేనా అనే స్థాయి పోటీపడినప్పటికీ పోలింగ్ నాటికి పరిస్థితుల్లో మార్పు జరిగినట్లు భావిస్తున్నారు. త్రిముఖ పోటీ స్థానంలో ద్విముఖ పోటీ నెలకొనడంతో ఈ పరిణామం ఏ పార్టీకి అనుకూలంగా? ఏ పార్టీకి ప్రతికూలంగా జరిగిందనే దిశగా పరిశీలిస్తున్నారు. క్షేత్ర స్థాయి సమాచారం తెలిసి కొన్ని పార్టీల నేతల్లో సంతోషం వ్యక్తమవుతుండగా మరి కొన్ని పార్టీలు నారాజవుతున్నాయి.

బీఆరెస్ కు లాభమా? నష్టమా

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తమ పార్టీ పై ఏమైనా సానుభూతి పెరిగిందా? పరిస్థితుల్లో మార్పు జరిగిందా? అనే అంశాలతో పాటు, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పదేండ్ల తర్వాత క్షేత్రస్థాయిలో రోడ్ షాలు నిర్వహించారు. బస్సు యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లక్ష్యంగా తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఉన్న బలాబలాలనేపథ్యంలో ఏ విధమైన ప్రభావం కనబరిచిందనే అంచనాలో బీఆరెస్ నాయకుల కేటీఆర్, హరీష్ రావుతో పాటు తాము తప్పక గెలుస్తామని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఏవైన అనూహ్య పరిణామాలు జరిగాయా? అనే అంశాలపై ఆ పార్టీ నేతలు కేంద్రీకరించారు. కాంగ్రెస్, బీజీపీ కంటే తమ పార్టీకే అనుకూలంగా ఓటరు తీర్పిచ్చారని ఆ పార్టీ నేతలు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

రాముడు.. మోదీ, షాల పైనే బీజేపీ ఆశ

బీజేపీ సైతం తమ పదేండ్ల పాలన పై ప్రజా స్పందన ఏ విధంగా ఉందనే అంశాలను తెలుసుకుంటున్నారు. తమకు నమ్మకమైన వ్యక్తులు, సంస్థల ద్వారా అంతర్గతంగా నిర్వహించిన సర్వేల సాధారణ రిజల్టు పరిశీలనంలో నిమగ్నమయ్యారు. బీజేపీ తమ పదేండ్ల పాలనతో పాటు, రామాలయ నిర్మాణ ప్రభావం, మోదీ, అమిషాల ప్రచారం పై ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొన్నందున తాజా పరిస్థితుల్లో ఈ ప్రభావమెలా? ఉందనే అంశాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే చేపట్టారు. రాష్ట్ర కార్యాలయంలో ప్రాథమిక స్థాయి సమీక్ష నిర్వహించారు. డబుల్ డిజిట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంపై కాంగ్రెస్ ఆశలు

ఆరునెలల క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ఓటర్లపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ పార్టీకి అనుకూల ఫలితాలొస్తాయని భావిస్తున్నారు. డబుల్ డిజిట్ సభ్యులు గెలుస్తారనే అంచనాతో ఉన్నారు. ఒక వైపు బీజేపీ, మరో వైపు బీఆరెస్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రచారం సాగించినప్పటికీ తమకు సానుకూల ఫలితాలొచ్చాయని విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆరెస్ ఓట్లు భారీగా బీజేపీకి క్రాస్ అయినట్లు చర్చజరుగుతున్నది. దీంతో పాటు ఐదునెలల కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా రెండు పార్టీలు తీవ్రమైన దాడి చేయడం వల్ల కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందనే అభిప్రాయం మరో వైపు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో మోదీ రావాలనే అభిప్రాయంతో కూడా కొంత ఓటు బ్యాంకుకు గండిపడినట్లు చెబుతున్నందున పైకి గాంభీర్యాన్ని కనబరుస్తున్నా లోపల కాంగ్రెస్ లో సైతం ఆందోళన ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా రిజల్టు వచ్చే జూన్ 4వ తేదీ వరకు పార్టీలు, నేతలకు టెన్షన్ తప్పదని భావిస్తున్నారు.

Latest News