శాంతిభద్రతలకు అద్దం పట్టిన రైతు ఆత్మహత్య, పల్లెల్లో ఏడు నెలలుగా పడకేసిన పాలన … మాజీ మంత్రి టి.హరీశ్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఖమ్మం జిల్లా రైతు ప్రభాకర్‌ తనకు అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్‌కు, తహశీల్థార్‌ ఆఫీసుకు, కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన న్యాయం లభించక ఆత్మహత్యకు పాల్పడిన తీరు ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు.

  • Publish Date - July 2, 2024 / 04:29 PM IST

విధాత : హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఖమ్మం జిల్లా రైతు ప్రభాకర్‌ తనకు అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్‌కు, తహశీల్థార్‌ ఆఫీసుకు, కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన న్యాయం లభించక ఆత్మహత్యకు పాల్పడిన తీరు ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రైతు చనిపోయాక తండ్రి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని, రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరికి ఈ ఘటన అద్దం పడుతుందని హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. రైతు ఆత్మహత్యపై వాస్తవాలు తెలిసేలా, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 6న భేటీ కానున్నట్లుగా తెలుస్తుందని, వారిద్దరి సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా చంద్రబాబు లాక్కున్న ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్టును తిరిగి తెలంగాణకు అప్పగించేలా సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసినా ఇప్పట్లో ఎన్నికల పెట్టె దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో పారిశుద్ధ్యం నిలిచిపోయింది. మ‌లేరియా, డెంగ్యూ వంటి వైర‌ల్ ఫీవ‌ర్స్‌తో ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు. బీఆరెస్‌ ప్ర‌భుత్వం హ‌యాంలో ప‌ల్లెల ప్ర‌గ‌తికి నెలకు రూ. 275 కోట్లు, ఏడాదికి రూ. 3,330 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ఈ నిధుల‌న్నింటిని పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలిపారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 87 ట్రాక్టర్లు పంచాయతీల్లో ఉంటే నేడు 12,769 ట్రాక్టర్లు ఉన్నాయన్నారు. బీఆరెస్‌ హ‌యాంలో తెలంగాణ ప‌ల్లెలు దేశానికి ఆద‌ర్శంగా నిలిచాయన్నారు. గ‌త సీఎం కేసీఆర్ ప‌ల్లె ప్ర‌గ‌తి, పట్ట‌ణ ప్ర‌గ‌తి ద్వారా ప‌ట్ట‌ణాల్లో అద్భుత‌మైన అభివృద్ధి సాధించారని, దీన్ దయాల్, సంసద్ ఆదర్శ యోజన అవార్డులు తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు.

Latest News