విధాత, హైదరాబాద్ : జన్వాడ ఫామ్‌హౌజ్ కేసులో హైడ్రా జీవో నెంబర్ 99నిబంధనల మేరకు నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని డాక్యుమెంట్లు, సేల్ డీడ్ లు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. రాజకీయ కక్ష నేపధ్యంలో కేటీఆర్ లీజులో ఉన్న తన ఫామ్‌హౌజ్‌ను కూల్చివేస్తారని, స్టే ఇవ్వాలని ఫామ్‌హౌజ్ యాజమాని బద్వేల్ ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న కోర్టు హైడ్రా జీవో నెంబర్ 99మేరకు నడుచుకోవాలని ఆదేశించింది. అంతకుముందు వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న న్యాయాధికారాలపైన, పరిధిపైన హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. స్థల యజమానులు సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని కోర్టు పేర్కొంది. 15-20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణమంటూ కూల్చివేయడమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది.
దీనిపై ప్రభుత్వం తరుపున ఏఏజీ వాదనలు వినిపించారు. హైడ్రా స్వతంత్ర సంస్థగా ఏర్పాటైందని, జీహెచ్‌ఎంసీ, మున్సిపాల్టీలతో కలిసి ఓఆర్‌ఆర్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైందని తెలిపారు. ఫ్రభుత్వ నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. ప్రదీప్‌రెడ్డి పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. జన్వాడలో ఉన్న పాంహౌస్ జీవో 111లోకి, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందన్నారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కేవలం సర్పంచ్ సంతకంతో జీ ప్లస్ టూ అక్రమ నిర్మాణం చేపట్టారని, అయినా అధికారులు పరిశీలనకు వెళ్లారని, కూల్చివేతలకు వెళ్లలేదని ఏఏజీ కోర్టుకు వివరించారు. అయితే జన్వాడ ఫామ్‌హౌజ్ వ్యవహారంలో అన్ని డాక్యుమెంట్లు, సేల్ డీడీలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని, జీవో నెంబర్ 99మేరకే హైడ్రా నడచుకోవాలని కోర్టు ఆదేశించింది.