ముగ్గురూ.. ముగ్గురే!.. పాలమూరులో త్రిముఖ పోటీలో గెలుపెవరిదో

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ తీవ్ర మైంది.

  • Publish Date - April 26, 2024 / 03:49 PM IST

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఏడుసార్లు ప్రచారం చేసివెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
ఓటరు నాడి పట్టడం లో నిమగ్నమైన పార్టీ ల అభ్యర్థులు
గెలుపుపై ఎవ్వరి ధీమా వారిదే

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ తీవ్ర మైంది. ఎవరికి వారు తమదైన శైలి లో ప్రచారంలో దూసుకెలుతున్నారు.ప్రదానంగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, బీ ఆర్ ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నా ఇందులో కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యే లు ఉండడం.. ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ ఇతర పార్టీ లకు అవకాశం ఇవ్వవద్దనే ఉద్దెశం తో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందితే సీఎం రేవంత్ రెడ్డి పై ప్రభావం చూపుతుందని, ఇది దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే లు పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికీ ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ఏడుసార్లు పర్యటించి ప్రచారం చేశారు. కొడంగల్, మహబూబ్ నగర్ లో మూడుసార్లు,నారాయణ పేట లో ఒకసారి పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి ని అధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ను ఆదేశించారు. ముదిరాజ్ ల ను ఆకట్టుకునేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు వస్తే మంత్రి పదవి ఇస్తానని పాలమూరు నుంచే ప్రకటించారు. ఆగస్టు 15 లోగా రూ.రెండు లక్షలు రైతు రుణమాఫి చేస్తా నని ఈ గడ్డ నుంచే హామీ ఇచ్చారు.

రాష్ట్రం లో అత్యధిక స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ మరింత పట్టు సాధించేందుకు రేవంత్ రెడ్డి పాలమూరు నుంచే కొత్త హామీలు ఇస్తున్నారు. సొంత జిల్లా లో ఇమేజ్ డ్యామేజి కాకుండా పార్టీ అభ్యర్థి ని గెలిపించేందుకు పాలమూరు ప్రచారం లో వరాలు కురిపించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదివరకే న్యాయ యాత్ర చేసి ప్రజల తో మమేకమయ్యారు. పార్టీ శ్రేణులను కలుపుకుని ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఇప్పటికీ ఉప ముఖ్య మంత్రి, భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నేతలు గెలుపును ఛాలెంజ్ గా తీసుకున్నారు.

అరుణమ్మ ఒంటరి పోరాటం

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటి వరకు బీజేపీ కేంద్ర నాయకులు అరుణ కు మద్దతుగా ప్రచారం చేయలేదు. ఒక్క సారి మాత్రమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. అరుణ నామినేషన్ వేసిన సందర్బంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరై ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా క్యాడర్ తో కలిసి ఆమె ప్రచారం చేస్తూ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.అరుణమ్మ కు బీజేపీ నుంచి టికెట్ ప్రకటించిన వెంటనే పార్టీ లో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీ ని వదిలివెళ్లారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు.

పార్టీ ని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా పదవి చేపట్టారు. ఆయన తో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసిన జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. మక్తల్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చెందిన జలంధర్ రెడ్డి కూడా బీజేపీ ని వీడారు. వీరి వెంట కొంత క్యాడర్ వెళ్లినా డీకే అరుణ మాత్రం అధైర్య పడకుండా గెలుపే ధ్యేయంగా ప్రచారం చేస్తున్నారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు.

పార్టీ క్యాడర్ ను నమ్ముకున్న మన్నె శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి కి రోజు రోజు కు మద్దతు పెరుగుతోంది. పార్టీ నుంచి టికెట్ ఆలస్యం గా రావడం తో ముందుగా ప్రచారం చేసే అవకాశం రాలేదు. పార్టీ టికెట్ ప్రకటించిన తరువాత ప్రచారం లో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సన్నాహక సమావేశలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నేనున్నా అంటూ భరోసా కల్పించారు.మన్నె శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి మద్దతుగా నిలిచి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చిందనీ అంశాలతో బీ ఆర్ ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు బీ ఆర్ ఎస్ రాష్ట్ర నేతలు ప్రచారం లో పాల్గొన లేదు. శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలమూరు లో మన్నె శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా పోరుబాట కార్యక్రమం లో భాగంగా బస్సు యాత్ర నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం వరకు ఈ నియోజకవర్గం లో ఈ యాత్ర కొనసాగుతుంది.

అనంతరం నాగర్ కర్నూల్ లో కెసిఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. కెసిఆర్ బస్సు యాత్ర తో పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం లో పార్టీ కి బలం చేకూరే అవకాశం ఉంది.ఏది ఏమైనా ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ముగ్గురు హేమాహేమీల మధ్య పోటీ రసవత్తరంగా జరగబోతోంది. ఎవరికి వారు మేమే గెలుస్తామనే ధీమా లో ఉన్నారు. త్రిముఖ పోటీలో గెలుపేవరిదో కొద్ది రోజులు ఆగాల్సిందే.

Latest News