ధరణి లోపాల దిద్దుబాటుకు.. కొత్త ఆర్ఓఆర్ చట్టం! కేబినెట్ ముందు ముసాయిదా బిల్లు

బీఆరెస్ తీసుకు వచ్చిన, రైతులపాలిట శాపంగా మారిన ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం శస్త్ర చికిత్సకు సన్నద్ధమవుతున్నది. ధరణి లోపాలపై అధ్యయనానికి ఇప్పటికే కమిటీని వేసిన ప్రభుత్వం, ధరణిలో ఏర్పడిన భూమి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ పెట్టింది.

  • Publish Date - June 20, 2024 / 01:55 AM IST

వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదం
రెవెన్యూ కోడ్‌కు మరో ఆరు నెలలు?

విధాత: బీఆరెస్ తీసుకు వచ్చిన, రైతులపాలిట శాపంగా మారిన ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం శస్త్ర చికిత్సకు సన్నద్ధమవుతున్నది. ధరణి లోపాలపై అధ్యయనానికి ఇప్పటికే కమిటీని వేసిన ప్రభుత్వం, ధరణిలో ఏర్పడిన భూమి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ పెట్టింది. ధరణిలో తాసిల్దార్లకు, డిప్యూటీ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు తీసి వేసిన అధికారాలను కొన్నింటిని పునరుద్ధరించింది. అయినప్పటికీ అన్ని సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విషయాన్ని స్వయంగా గుర్తించిన సర్కారు ధరణి చట్టానికి పాతరేసి, దానిస్థానంలో ఆర్ఓఆర్ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా తాసిల్దార్లకు, డిప్యూటీ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు, కలెక్టర్లకు ఇలా అన్ని స్థాయిల అధికారులకు ఎగ్జిక్యూటివ్ అధికారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతులకు, భూ యజమానులకు భూమి సంబంధమైన సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా నూతన చట్టాన్ని తీసుకురానున్నారు.

ఈ మేరకు అధికారులు ఇప్పటికే ముసాయిదా బిల్లు రూపొందించినట్లు తెలిసింది. ఈ ముసాయిదా బిల్లును అధికారులు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అందజేయనున్నట్లు సమాచారం. సీఎం, మంత్రి పరిశీలించి తగిన మార్పులు, చేర్పులు చేసి ఈ నెల 21న నిర్వహించే కేబినెట్ సమావేశం ముందుకు తీసుకు వెళ్లనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముందుగా పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను రెవెన్యూ సిబ్బంది పరిష్కరించడానికి వీలుగా ఈ చట్టాన్ని తీసుకు వస్తున్నట్ల అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ను తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నది. రెవెన్యూ చట్టాలన్నీ కలిపి రూపొందించే తెలంగాణ కోడ్‌ను చట్టం రూపంలోకి తీసుకు రావడానికి కనీసం ఆరు నెలల కసరత్తు పడుతుందని నిపుణులు అంటున్నారు. యుద్ధప్రాతిపదకన కోడ్ తీసుకు వచ్చే పని మొదలు పెట్టినా శీతాకాల అసెంబ్లీ సమావేశాల నాటికి సాధ్యం అవుతుందని చెపుతున్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం భూమి చట్టాలు తెచ్చే కసరత్తు వేగంగా చేస్తోంది.

Latest News