Site icon vidhaatha

Bandi Sanjay | కేంద్రాన్ని బద్నాం చేసేందుకే తీర్మానం: కేంద్ర మంత్రి బండి సంజయ్

రాష్ట్ర బడ్జెట్‌లో లక్షా 9వేల కోట్ల నిధులు కేంద్రానివే
సిగ్గు లేకుండా తీర్మానం చేస్తారా
కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు
రాష్ట్ర బడ్జెట్‌లో హామీలకు దక్కని కేటాయింపులు
వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై విమర్శలు

విధాత, హైదరాబాద్ : కేంద్రాన్ని బద్నాం చేసేందుకే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అన్యాయం జరిగిందని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీ తీర్మానంపై స్పందించిన సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో లక్షా 9 వేల కోట్ల నిధులు కేంద్రం నుండి వచ్చేవేనన్నారు. మరి తెలంగాణకు పైసా ఇవ్వలేదని సిగ్గు లేకుండా ఎట్లా తీర్మానం చేస్తారని నిలదీశారు. 6 గ్యారంటీల అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ తీర్మానం డ్రామాలాడారని మండిపడ్డారు.

గత ప్రభుత్వ మోసాలు, అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌తో కలిసి బీఆరెస్‌ డ్రామాలాడుతున్నానరని, కేంద్రంపై కొందరు మంత్రులు, నేతలు స్థాయి మరిచి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా, యువ, రైతు సంక్షేమ బడ్జెట్ అని, వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. రెండేళ్లలో కోటిమంది రైతులను సేంద్రీయ సాగుకు మళ్లించాలనే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. యూత్ ఎంప్లాయిమెంట్ స్కిల్ డెవలెప్ మెంట్‌కు1 లక్షా 48 వేల కోట్ల రూపాయలు, మహిళల అభివృద్ధికి 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు.

గ్రామీణాభివృద్ధి 2 లక్షల 66 వేల కోట్ల రూపాయలు, గ్రామాల్లో 2 కోట్ల ఇండ్లను, 25 వేల ఆవాస ప్రాంతాలకు సడక్ యోజన రోడ్లను వేయాలని నిర్ణయించిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కోటి ఇండ్ల నిర్మాణం, కోటి ఇండ్లకు సౌర విద్యుత్తు సదుపాయం మౌలిక సదుపాయాలు లక్ష కోట్ల రూపాయలు కేటాయించారని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇన్నోవేషన్, రీసెర్చ్ కోసం లక్ష కోట్ల నిధి కేటాయించారన్నారు. కోటి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, 20 లక్షల మందికి శిక్షణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రయోజనాలు

3 లక్షల కోట్ల మహిళా బడ్జెట్‌లో లక్షల మంది తెలంగాణ మహిళల ఉపాధి గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు ముద్రా రుణాలు, అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే మధ్యతరగతి కోటి ఇండ్లలో తెలంగాణ వాటా, పీఎంఏవై కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే మరో 3 కోట్ల ఇండ్లలో తెలంగాణకు లక్షల ఇండ్లు వచ్చే అవకాశముందన్నారు. కేంద్ర పన్నుల రూపేణ(ట్యాక్స్ డెవల్యూషన్) 26 వేల 216 కోట్లుగా కేటాయించగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 21వేల 075 కోట్లు కేటాయించామని, ఎఫ్ఆర్ బీఎంకు లోబడి 62 వేల కోట్ల రుణాలు, మొత్తం 2 లక్షల 91 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో నిధులు, అప్పుల రూపేణ కేంద్రం 1 లక్షా 9 వేల కోట్ల నిధులిస్తోందన్నారు.

కేంద్రం గత 10 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా తెలంగాణకు నిధులిచ్చింది. వాస్తవం కాదా? అని, టాక్స్ డివల్యూషన్, వివిధ కేంద్ర పథకాల అమలు కోసం 6 లక్షల 75 వేల కోట్లు ఖర్చు చేశామని బండి సంజయ్ వెల్లడించారు. వడ్లు, పత్తి సేకరణకు 1 లక్షా 60 వేల కోట్లు ఖర్చు చేశామని, కిసాన్ సమ్మాన్ కింద 35 లక్షల మంది రైతులకు 9 వేల కోట్లు జమ చేశామని, వడ్లకు కనీస మద్దతు ధర కింద గత 9 ఏళ్లలో 27 వేల కోట్లు ఖర్చు చేశామని, ఉపాధి హామీ ద్వారా 23 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

జన్ ధన్ ఖాతా 1 కోటి 13 లక్షల మందికి 3 వేల 600 కోట్లు జమ చేశామని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 1 కోటి 91 లక్షల మందికి బియ్యం పంపిణీ చేశామని, కానీ ప్రధానమంత్రి ఫొటో పెట్టకుండా కేసీఆర్ ఫోటోలే పెట్టారని గుర్తు చేశారు. 14, 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు 12 వేల 580 కోట్లు, 30 లక్షల టాయిలెట్లు, 5.5 లక్షల ఇండ్లకు కరెంట్ సౌకర్యం కల్పించామన్నారు. హైవేస్ నిర్మాణం కోసం 1 లక్షా 15 వేల కోట్లు ఇచ్చామని, గ్రామీణ సడక్ యోజన కింద 1100 కోట్లు ఖర్చుతో 4 వేల కి.మీల మేరకు రోడ్ల నిర్మించామన్నారు.

వరంగల్ లో కాకతీయ, ఆదిలాబాద్ లో రిమ్స్ మెడికల్ ఆసుపత్రుల నిర్మాణంతో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేశామని తెలిపారు. 38 లక్షల ఇండ్లకు జల్ జీవన్ కింద నల్లా కనెక్షన్లు… పీఎం స్వనిధి కింద రూ.23 వేల కోట్లు లబ్ది చేకూర్చామన్నారు, ఆయుష్మాన్ భారత్ స్కీం కింద 80 లక్షల మందికిపైగా లబ్ది.. 11 లక్షల 80 వేల మందికి గ్యాస్ కనెక్షన్లు అందించామని, ఈ ఏడాది మార్చిలో ప్రధాని ఆదిలాబాద్ పర్యటనలో 56 వేల కోట్ల రూపాయలు, సంగారెడ్డి పర్యటనలో 6 వేల 800 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ హైవేస్, రైల్వే లేన్ వంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టిన మాట వాస్తవం కాదా? అని సంజయ్ ప్రశ్నించారు.

మనోహరాబాద్, సిద్దిపేటలను కలుపుతూ కొత్త రైలు మార్గంతో సహా రైలు ప్రాజెక్టులను అంకితం చేసింది నిజం కాదా? గత అక్టోబర్ 3న ప్రధాని నిజామాబాద్ పర్యటనలో 8 వేల కోట్ల రూపాయల విలువైన వివిధ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది మర్చిపోయారా? అని ప్రశ్నించారు. అక్టోబర్ 13న ప్రధాని మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పనులకు 13 వేల 500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసింది నిజం కాదా? హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ పనుల కోసం 2 వేల 460 కోట్లు కేటాయించామని, హసన్…చర్లపల్లి ఎల్పీజీ పైప్ లైన్ గ్యాస్ ప్రాజెక్టు కోసం 2 వేల 170 కోట్లు చేశామని వెల్లడించారు.

విభజన చట్టం హమీల్లో చేసింది కనిపించడం లేదా

విభజన చట్టం హామీలపై కాంగ్రెస్, బీఆరెస్‌ చేస్తున్న ప్రచారంపై బండి సంజయ్ ధ్వజమెత్తారు. 6 వేల 323 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్దరించింది నిజం కాదా? అని, 11 వేల కోట్ల వ్యయంతో రెండు యూనిట్లు పూర్తి చేసి ఇప్పటికే 1600 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తోంది నిజం కాదా? అని ప్రశ్నించారు. మరో 3 యూనిట్ల నిర్మాణం కోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీపీ) చేసుకోవాలని కేంద్రం కోరుతున్నా నాటి బీఆరెస్‌, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రైవేటు సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేయడం సిగ్గు చేటన్నారు. రూపాయి కరెంట్ కు 6 రుపాయల ఖర్చు చేసి ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని ఆరోపించారు. 3 యూనిట్ల నిర్మాణానికి అగ్రిమెంట్లు జరిగితే కేంద్రం నుండి మరో 21 వేల కోట్ల రూపాయలు వస్తాయన్నారు.

పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పై అసెంబ్లీలో చర్చ జరిపే దమ్ముందా? అని, 1350 కోట్ల రూపాయలతో ఎయిమ్స్ ను, 500 కోట్ల వ్యయంతో రైల్వే వ్యాగన్ ఓరాలింగ్ మ్యానుఫాక్చర్ యూనిట్ ను ఏర్పాటు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 899 కోట్లతో గిరిజన వర్శిటీని ఏర్పాటు చేసింది నిజం కాదా? అని, వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసినప్పుడు సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని 10 ఏళ్లు పాలించిన కేటీఆర్ ఎందుకు ప్రతిపాదించలేదన్నారు. నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిధుల కేటాయింపుపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేటీఆర్, ఇక్కడి రాష్ట్ర మంత్రి ఇద్దరూ దోస్తులు కాబట్టే మాట్లాడటం లేదా అని నిలదీశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అసాధ్యమని, క్వాలిటీ ఐరన్ ఓర్ లేదని కాంగ్రెస్, బీఆరెస్‌ సర్కార్ లే చెప్పినయ్ కదా? అని, బీఆరెస్‌ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో కొట్లాడి రాజకీయం చేయాలనుకుంటుందా? అని నిలదీశారు.

రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై నిలదీసిన బండి సంజయ్

ఆదాయానికి, వ్యయానికి పొంతన లేకుండా రాష్ట్ర బడ్జెట్ ఉందని బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారంటీలైన మహిళలకు 2 వేల 500, నిరుద్యోగులకు 4 వేల భృతి, 4 వేల ఆసరా పెన్షన్, తులం బంగారం ఊసేక్కడ లేదని, 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులకు కేటాయింపులు లేవని, కాంగ్రెస్ 420 హామీలకు బడ్జెట్‌లో నిధులెందుకు ప్రతిపాదించలేదో చెప్పాలన్నారు. రుణమాఫీకి 35 వేల కోట్ల రూపాయల అవసరమని మీరే చెప్పారని, బడ్జెట్ లో 15 వేల కోట్లే ఎందుకు కేటాయించారన్నారు. రైతు భరోసాపై క్లారిటీ లేదని,ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము నష్టపోయిన రైతులకు న్యాయం చేయరా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 14 మంది నేతన్నలు ఆకలి మరణాలు జరిగినా పట్టించుకోరా అని, ఆటోడ్రైవర్లకు 12 వేల రూపాయల ఆర్దిక సాయం ఇస్తారా, ఇవ్వరా అని ప్రశ్నించారు. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 60 వేల ఉద్యోగాలిస్తున్నట్లు చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులనేది బోగస్ అని,నిధులే కేటాయించకుండా కోటీశ్వరులను ఎట్లా చేస్తారని, లక్ష ఎకరాల్లో పామాయిల్ చెట్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ నిధుల్లో కేంద్ర వాటా ఉందా? లేదా అని నిలదీశారు. విద్యకు 7 శాతం, ఆరోగ్య రంగానికి 4 శాతంలోపు కేటాయింపులు చేయడం సిగ్గు చేటన్నారు.

52 శాతం బీసీ జనాభా సంక్షేమానికి 3.5 శాతం (9 వేల 200 కోట్లు) నిధులే ప్రతిపాదిస్తారా? అని, దళిత సంక్షేమంలో భారీ కోత విధించి దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. గతేడాది కంటే ఈసారి ఎక్సైజ్ ద్వారా 6 వేల కోట్ల అదనపు ఆదాయంతో కేసీఆర్ కు ఇష్టమైన మద్యాన్ని ఏరులై పారించాలనుకుంటున్నారన్నారు. కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో వేల కోట్ల నిధులు మురిగిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులిస్తున్న పథకాలకు ప్రధానమంత్రి ఫొటో పెట్టి తీరాల్సిందేనని, లేనిపక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

Exit mobile version