Site icon vidhaatha

Bandi Sanjay | నా పదవి కరీంనగర్ ప్రజల భిక్ష: బండి సంజయ్

బీజేపీతోనే కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగాను
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్

విధాత, హైదరాబాద్‌ : నాకు వచ్చిన కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన బిక్ష అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా బుధవారం కరీంనగర్ కు వచ్చారు. సొంత గడ్డను చూసి పులకరించిపోయిన ఆయన నేలతల్లిని ముద్దాడారు. అనంతరం కరీంనగర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల కష్టం, పార్టీ పెద్దల మద్దతుతో తాను నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అయ్యానన్నారు. సామాన్య కార్యకర్త నుంచి కార్పోరేటర్‌గా, ఎంపీగా, కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగానంటే ఇది కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందని, రాజకీయంగా ఇంతటి వాడిని చేసిన తెలంగాణకు, కరీంనగర్‌కు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

బీఆరెస్‌ మూర్ఖత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు తిన్న పోలీసుల లాఠీ దెబ్బలు, గృహనిర్భంధాలు, జైలు జీవితాల వల్లే తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో దాదాపు 150 రోజుల పాటు కార్యకర్తలు వారి కుటుంబాలకు దూరంగా, సొంత పనులను వదులుకుని నా అడుగులో అడుగులేసి శ్రమించారన్నారు. ఈ పదవి కార్యకర్తలకే అంకితమిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పదవులు అనుభవించడానికో, డబ్బులు. సంపాదించుకోవడానికో కాదని దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణకు, కరీంనగర్ కు నిధులు తీసుకువచ్చేందుకు వినియోగించుకుంటానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అందరూ ఎమ్మెల్యేలను, నాయకులు, కార్యకర్తలను కలుపుకుని అభివృద్ధి కోసం కృషి చేస్తానని బండి సంజయ్ చెప్పారు.

Exit mobile version