- సమీక్ష సమావేశానికి మంత్రి సురేఖ గైర్హాజరీ
- సురేఖ తీరు పై రాజకీయవర్గాల్లో ఆసక్తికరచర్చ
- సమీక్షలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, సీతక్క
విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశానికి సొంత జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కాకపోవడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. అత్యంత ముఖ్యమైన అంశాలపై చర్చించిన ఈ సమావేశానికి మంత్రి హాజరుకాకపోవడంలో మతలబేమిటనే చర్చసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. కానీ, కొండా సురేఖ మాత్రం హాజరుకాలేదు. ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆరుజిల్లాల జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తరచూ కార్యక్రమాలకు సురేఖ దూరం
ఇటీవల పలు కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరవుతున్నారు. ఇతర మంత్రులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటుండగా తన శాఖకు సంబంధించిన పనులు సాగుతున్న కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. దీంతో సురేఖ తీరు మరోసారి చర్చకు అవకాశమిచ్చింది. ములుగు జిల్లాలోని మేడారంలో ఈ నెలాఖరులో జరిగే సమక్క, సారలమ్మ జాతర కోసం రూ. 300 కోట్లతో పనులు సాగుతున్నాయి. ఈ పనులను జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పొంగులేటి, జిల్లాకు చెందిన మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా ధనసరి సీతక్క, గిరిజన శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ లు పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పొంగులేటి, సీతక్కలు క్రమం తప్పకుండా మేడారంలో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ జాతర నిర్వహణలో కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ శాఖది కూడా ప్రధాన భాగస్వామ్యమే అయినప్పటికీ ఆమె జాతర పనులు, సమీక్ష, పర్యవేక్షణ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తొలుత జాతర నిర్వహణ పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటితో పొసగకపోవడం వల్ల మేడారం పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో మంత్రి సీతక్కతో కూడా పొరపొచ్చలు వచ్చాయనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత క్రమంలో పొంగులేటితో సయోధ్య కుదిరిన తర్వాత మేడారాన్ని ఒక సారి సందర్శించారు. ఆ తర్వాత మేడారం జాతరను పెద్దగా పట్టించుకోలేదు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో మాత్రం భాగస్వామ్యమవుతున్నారు. దీనికి కారణాలేంటనే చర్చ సాగుతోంది.
సమీక్ష సమావేశానికి సురేఖ డుమ్మా
ఉమ్మడి వరంగల్ జిల్లాపరిధిలోని ఆరు జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలపై చర్చించేందుకు బుధవారం హనుమకొండ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని అండర్ డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్యకు పరిష్కారం, హెల్త్ సిటీ పనుల పురోగతి, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం, మామునూరు ఎయిర్ పోర్టు పనుల వేగవంతం, మేడారం, భద్రకాళి దేవాలయం మాఢావీధులు తదితర సమస్యలపై చర్చించారు. ఈ సమస్యల్లో 90శాతం తన సొంత జిల్లా వరంగల్కు ముఖ్యంగా మంత్రి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గం కూడా ఉన్నది. ఇంత ప్రాధాన్యత ఉన్న సమావేశానికి మంత్రి రాకపోవడం పట్ల రాజకీయవర్గాలతోపాటు సొంత పార్టీ కాంగ్రెస్ లోనూ చర్చనీయాంశంగా మారింది. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొండా సురేఖ ఎన్నడూ వరంగల్ తూర్పులో అధికారిక కార్యక్రమాల్లో వరుసగా పాల్గొన్నది లేదు. తాజాగా దాదాపు వారం రోజుల పాటు తూర్పు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చర్చకు దారి తీసింది. బుధవారం కూడా సురేఖ స్వంత నియోజకవర్గంలో కూడా లేరు. హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. ఈ సమీక్షా సమావేశానికి హాజరైన ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని వరంగల్ కు వచ్చారు. జిల్లాకు చెందిన మరో మంత్రి సీతక్క సైతం తన స్వంత నియోజకవర్గంలోని మేడారంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించి హనుమకొండ సమావేశానికి హాజరయ్యారు. సురేఖ మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ అంశం పై ఇప్పుడు చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి :
రోడ్లపై పరుగులు తీసే 5స్టార్ హోటల్.. లంబోర్ఘిని డబుల్ డెకర్ మోటర్‌హోమ్.. విశేషాలివి!!
జిల్లాల పునర్వ్యవస్థీకరణ లోపాల సవరణే: కొత్త జిల్లాలు లేవు
