Congress Warangal East | వరంగల్ కాంగ్రెస్‌ ‘తూర్పులో మార్పు’ రాజకీయం!

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తూర్పు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ ప్రతినిధి అయూబ్‌ను నియమించడంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా అయూబ్‌కు మంత్రి మద్ధతునందించకపోవడంతో జిల్లాలోని మిగిలిన వర్ధన్నపేట, నర్సంపేటతోపాటు, తూర్పులోని కొండా వ్యతిరేక వర్గమంతా కలిసి కట్టుగా సాగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Congress Warangal East | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్వంతపార్టీ కాంగ్రెస్‌లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు ఉన్న సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. దీంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఒంటరైన మంత్రి కొండా సురేఖ దంపతులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సైతం ఒంటరిగా మారుతున్నారనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన ఈ మార్పు ప్రభావం వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తూర్పులో పార్టీ లేదా ప్రభుత్వ కార్యక్రమాలుగానీ తాము చెప్పినట్లే సాగాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం తాము గీసిన గీత దాటాద్దొంటూ ‘పట్టు’ బిగించేందుకు ప్రయత్నించిన కొండా దంపతులకు తమ అనుచరుల నుంచే వ్యతిరేకత ప్రారంభమైందన్న చర్చలు నడుస్తున్నాయి. ఈ వ్యతిరేకత నుంచే పార్టీలో సమీకరణలు మారుతున్నాయని జిల్లా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొన్నటి వరకు కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సురేఖ వ్యతిరేక వర్గానికి చెందిన ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు నిర్వహించారు. కొండా దంపతులకు, స్వర్ణకు మధ్య ఉప్పూనిప్పుగానే సాగింది. ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షుల నియాకమంతో వరంగల్ తూర్పునకు చెందిన మైనార్టీ నాయకుడు అయూబ్ కు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ పార్టీ అందరినీ ఆశ్చర్చపరిచింది. అయూబ్‌కు వర్గ ముద్రలు లేకపోవడంతో కొండా దంపతులు నూతన అధ్యక్షుడితో సఖ్యతతో వ్యవహరిస్తారని అంతా భావించారు. అయూబ్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి సోనియా జన్మదినోత్సవం పార్టీ అంతాకలిపి జరిపితే కొండా వర్గం నాయకులు దీనికి దూరంగా ఉన్నారు. ఆ వర్గం వేరే కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పులో తమ విజయానికి కారణమైన మైనార్టీలకు ప్రతినిధిగా ఉన్న ఆయూబ్‌ను సైతం కొండా వర్గం పట్టించుకోకుండా అవమానించిందనే కొత్త చర్చకు దారితీసింది.

ఒంటరైన కొండా దంపతులు!

కొండా దంపతుల తీరుకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు వారికి మద్ధతు తెలియజేసిన పార్టీ నాయకులతో పాటు, కొండా వ్యతిరేక వర్గం నాయకులు, అయూబ్ అనుకూలురంతా కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి, కలిసి కట్టుగా సాగాలని నిర్ణయించడం ఇప్పుడు తూర్పులో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఒక్క సారిగా తూర్పు కాంగ్రెస్ రాజకీయాల్లో వేడిపెరిగింది. కొండ దంపతుల అనుచరుడిగా గుర్తింపు పొందిన నల్లగొండ రమేష్ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమావేశమై మంతనాలు జరపడం ఇప్పుడు అనూహ్యపరిణామంగా చెప్పవచ్చు. ఈ సమావేశానికి కొండా వ్యతిరేక వర్గ నాయకుడు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య హాజరుకావడం సీరియస్ పరిణామంగా భావిస్తున్నారు. కొండా దంపతులు ఒకవైపు తూర్పు ముఖ్య నేతలు మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కొండా వర్గం తమకు కనీస న్యాయం చేయడంలేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ పదవులతోపాటు, ఇప్పటి వరకు తూర్పునకు నామినేటెడ్ పదవులు రాని అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకులంతా నూతన అధ్యక్షుడు అయూబ్, మాజీ మంత్రి సారయ్య నాయకత్వంలో పీసీసీ పెద్దలను, సీఎం రేవంత్ ను కలిసి పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల గురించి విన్నవించాలని నిర్ణయించినట్లు సమాచారం.

జిల్లా కాంగ్రెస్ కమిటీ పై ప్రభావం

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తూర్పు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ ప్రతినిధి అయూబ్‌ను నియమించడంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా అయూబ్‌కు మంత్రి మద్ధతునందించకపోవడంతో జిల్లాలోని మిగిలిన వర్ధన్నపేట, నర్సంపేటతోపాటు, తూర్పులోని కొండా వ్యతిరేక వర్గమంతా కలిసి కట్టుగా సాగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వరంగల్ జిల్లాలో కూడా అంతా ఒక వైపు, కొండా దంపతులు ఒక వైపు అన్నట్లుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

Latest News