Site icon vidhaatha

Anti-Aging | పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నాడు.. 55 ఏళ్లంటే ఎవ‌రూ న‌మ్మ‌రు! ఈ జెనెటిక్స్‌ ప్రొఫెసర్‌ చెబుతున్న‌ సీక్రెట్లు ఇవే!

Anti-Aging | వయసు పైబడిపోతున్నదంటే ఒక్కొక్కరికీ గుబులు రేగుతుంది. వెంట్రుకలు నెరిసినా.. గడ్డంలో వెండి తీగలు మొలిచినా.. ముఖం మడతలు పడుతున్నా.. తెగ ఫీలైపోతుంటారు. చందమామ కథల్లో చెప్పినట్టు నిత్య యవ్వనులుగా ఉండాలని ఆశపడేవారూ ఉన్నారు. వృద్ధాప్యాన్ని అధిగమించే సూపర్ టానిక్ ఏదైనా దొరుకుతుందా? అని ప‌రిశోధ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే.. కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే వృద్ధ్యాప్యాన్ని దూరంగా ఉంచొచ్చ‌ని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో జెనెటిక్స్ విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ డేవిడ్ సింక్లెయిర్ చెబుతున్నారు. ఆయ‌న చెప్ప‌డ‌మే కాదు.. ఆచ‌ర‌ణ‌లో చూపారు కూడా. ఆయ‌ను చూస్తే నిజానికి 20, 25 ఏళ్ల కుర్రాడిలా క‌నిపిస్తారు. ఆయ‌న వ‌య‌సు 55 అంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. అసలు ఏజింగ్‌ ప్రాసెస్‌.. వయసు పెరిగే కొద్దీ వృద్ధులుగా మారడం అనేది ప్ర‌కృతి ధ‌ర్మం కాద‌ని, అదొక ‘డిసీజ్’ అని ఆయన చెబుతారు. మ‌న జీవ‌న‌శైలితోనే దానిని త‌గ్గించుకోవ‌చ్చ‌ని పేర్కొంటున్నారు. ఆ ‘డిసీజ్‌’కు ఆయన దూరంగా ఉంటూ.. తన వయసును రోజురోజుకూ తగ్గించుకుంటున్నారు. తాను వృద్ధాప్యానికి ఎలా దూరంగా ఉంటున్నదీ, జీవితాన్ని ఎలా పొడిగించుకుంటున్నదీ ఆ ‘వివాదాస్పద’ ఆరోగ్య రహస్యాలను ఆయన వివిధ మీడియాల్లో పంచుకున్నారు. తాను చెప్పే చిట్కాలను నిర్దిష్టంగా పాటిస్తే ఎవరైనా యాంటి ఏజింగ్‌ను అధిగమించవచ్చని ఆయన ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. తీసుకున్న ఆహారం నుంచి మాగ్జిమం పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవడం, జీర్ణశక్తిని అధికంగా కలిగి ఉండటం అనేవి యాంటి ఏజింగ్ ప్రాసెసింగ్‌లో కీలకమని ఆయన చెబుతున్నారు. ఒంట్లో టాక్సిక్‌లు మితిమీరి పేరుకుపోవ‌డం, పోషకాల లేమి, హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం, పొత్తికడుపులో వాపు, తగినంత నిద్ర లేకపోవడం, దాని వలన ఉదయాన లేవలేక‌పోవ‌డం, వ్యాయామం లేకపోవడం అనేవి వేగంగా ముసలోళ్లను చేయడంలో కీలక అంశాలని అయన చెప్పారు. అయితే తాను చెప్పే రహస్యాలు శాశ్వతంగా జీవించడం కోసం కాదని, మన జీవితకాలాన్ని అద్భుతంగా అనుభూతి చెందడం కోసమేనని పేర్కొన్నారు. ఇవీ ఆయన చెప్పిన రహస్యాలు!

వ్యాయామం
ఏదో ఇవాల్టికి కానిచ్చేశామనట్టు వ్యాయామం చేయడం కాదని ఆయన అంటారు. వారంలో కనీసం మూడు రోజులపాటు శక్తిమేరకు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. దీని వలన స్టామినా పెరుగుతుందని, రక్తప్రసరణ చక్కగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు.. వృద్ధాప్యాన్ని కలిగించే రసాయనాలను ఒంట్లో నుంచి వెళ్లగొడుతుందని అన్నారు.

ఇంట‌ర్మిటింగ్ ఫాస్టింగ్‌
తిండి మానేస్తే సన్నబడతామని అందరూ అనుకుంటారు. అయితే.. దాని వల్ల కొవ్వు కరగకపోగా.. శరీరంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనే యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన చెబుతున్నారు. చాలా మంది వైద్యులు ఉదయం టిఫిన్ తప్పనిసరిగా చేయకపోతే మెదడుకు ఆక్సిజన్ అందడం కష్టమవుతుందని, దాని వల్ల రోజంగా నీరసంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే.. డేవిడ్ సింక్లెయిర్ మాత్రం తాను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయనని అంటున్నారు. డేవిడ్ తనను తాను రోజులో ఆరు గంటల ఆహార విధానాన్ని (ఇంటర్మిటింగ్ ఫాస్టింగ్‌)ను పాటిస్తానని చెబుతున్నారు.

రెడ్ వైన్‌
రోజూ రెడ్ వైన్ తాగొద్దని సిన్‌క్లెయిర్ చెబుతున్నారు. దానికి బదులు.. రెడ్‌వైన్‌లో లభించే రెస్వెరాట్రోల్ అనే సప్లిమెంట్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అది దెబ్బతిన్న డీఎన్‌ఏను వేగంగా రిపేర్ చేయడమే కాకుండా.. వాతాన్ని బాగా తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. యోగర్ట్‌ను కూడా జోడించినట్టయితే శరీరం దాన్ని బాగా పీల్చుకుంటుందని చెబుతున్నారు.

అదనపు సప్లిమెంట్లు
వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడానికి ఆధునిక ఆహారం ఒక్క‌టే స‌రిపోద‌ని ఆయ‌న అంటున్నారు. కొన్ని ర‌కాల స‌ప్లిమెంట్ల‌ను ఆయ‌న సూచించారు.
ఎన్ఎంఎన్ : క‌ణ సంబంధ ఇంధ‌నాన్ని పెంచుతాయి.
ఫిసెటిన్ : క‌ణజాలాన్ని రిపేర్ చేస్తుంది.
బెర్బెరైన్ లేదా మెఫార్మిన్ : ర‌క్తంలో చ‌క్కెర స్థాయిని త‌గ్గిస్తుంది. బెర్బెరైన్‌ను ప‌దుల కొద్దీ మెడిక‌ల్ స్ట‌డీస్ స‌మ‌ర్థించాయి. ఈ రోజుల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన స‌ప్లిమెంట్ల‌లో ఇదొక‌టి.

పాలీఫెనాల్స్ అధికంగా లభించేవాటిని డేవిడ్ ఎక్కువగా తీసుకుంటారు. అవి శరీరంలో ఒత్తిడి తట్టుకునే శక్తిని పెంచుతాయి. సాధారణంగా టీ, పాలకూర, ద్రాక్ష, ఆలివ్ ఆయిల్‌లలో పాలిఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి సాధార‌ణ వ‌య‌సు పెరిగే వ్య‌వ‌స్థ‌ల‌ను నిరోధించి, శ‌రీరం కృశించి పోకుండా కాపాడుతాయి.

కోల్డ్ థెర‌పీ 
జీవ‌క్రియ శీతాకాలం అనే ఆస‌క్తిక‌ర అంశాన్ని ఆయ‌న డేవిడ్ ప్ర‌స్తావిస్తున్నారు. తాను శీతాకాలంలో కూడా త‌క్కువ దుస్తులే ధ‌రిస్తాన‌ని తెలిపారు. కోల్డ్ థెర‌పీగా చెప్పే దీని వ‌ల్ల లాభాలను ఆయ‌న వివ‌రించారు. కోల్డ్ థెర‌పీ ర‌క్త‌ప్ర‌స‌ర‌ణను మెరుగుప‌రుస్తుంద‌ని చెప్పారు. వాపును త‌గ్గిస్తుంద‌ని, కొవ్వును వేగంగా క‌రిగిస్తుంద‌ని తెలిపారు. చ‌లితో శ‌రీరంలోని అద‌న‌పు క్యాల‌రీలు కూడా ఖ‌ర్చ‌యిపోతాయట!

డేవిడ్ వీటిని అస్స‌లు ముట్టుకోర‌ట‌
చ‌క్కెర : శ‌రీరంలో అత్య‌ధికంగా చ‌క్కెర స్థాయిలు ఉంటే.. అవి వ‌య‌సు మీద ప‌డ‌టాన్ని వేగ‌వంతం చేస్తాయి.
బ్రెడ్ : శ‌రీరంలో గ్లూకోజ్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. త‌ద్వారా మెద‌డు అస్ప‌ష్ట‌త‌కు గుర‌వుతుంది.
ప్రాసెస్డ్ ఫుడ్స్ : అవి శ‌రీరానికి విషం లాంటివి
ఇవి మ‌న శ‌రీరాల‌ను కాలుష్య‌భ‌రితం చేసి, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి వ్యాధుల‌కు కూడా కార‌ణ‌మ‌తుంద‌ని ఆయ‌న అంటున్నారు.

హెచ్చరిక: ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ సొంతంగా ప్రయత్నించకుండా అనుభవజ్ఞులైన డాక్టర్లు, ట్రెయినర్ల సహకారం తీసుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త!!

Exit mobile version