విధాత, హైదరాబాద్: కనీస నిబంధనలు పాటించకుండా ఏర్పాటు అయిన ప్రైవేటు యూనివర్సిటీలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. అడ్డగోలుగా ఏర్పాటు అయిన ప్రైవేటు యూనివర్సిటీలపై కఠిన చర్యలకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. గత బీఆరెస్ ప్రభుత్వం 2020 సంవత్సరం మే నెలలో మూడు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. ఈ మూడు కూడా నాటి బీఆరెస్ ప్రజాప్రతినిధులవే కావడం గమనార్హం. గులాబీ పార్టీ నాయకులకు చెందిన యూనివర్సిటీలకే ఆమోదం తెలిపారంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసింది. అనురాగ్ యూనివర్సిటీ ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిదే. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీ మల్లారెడ్డిది మల్లారెడ్డి యూనివర్సిటీ కాగా, వరంగల్ కేంద్రంగా ఎస్.ఆర్ యూనివర్సిటీ ఉంది. దీని యజమాని వరదారెడ్డి కూడా గులాబీ నాయకుడే. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ నంబర్.11/2018 ప్రకారం ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు మహీంద్రా యూనివర్సిటీకు కూడా అనుమతించారు.
వీటిపై ఆనాడు ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ వంటి విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి ముందు మెరుపు నిరసనలు, ఆందోళనలు నిర్వహించాయి. నిబంధనలు పాటించకుండా ఏర్పాటవుతున్న ప్రైవేట్ యూనివర్సిటీలతో విద్యారంగం దెబ్బతింటుందని, నాణ్యత దెబ్బతింటుందని ఆరోపించారు. 2018 సంవత్సరం మార్చి నెలలో అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఆమోదం పొందిన సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వ చర్యను నిరసించింది. ప్రభుత్వ యూనివర్సిటీలను ధ్వంసం చేసేందుకు బీఆరెస్ సర్కార్ ప్రైవేటు యూనివర్సిటీలను తెస్తోందని, రిజర్వేషన్లను అమలు చేయడం లేదని, స్థానికులకు కూడా రిజర్వేషన్ కల్పించడం లేదని ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి కూడా విమర్శించారు. విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ లో ప్రభుత్వ యూనివర్సిటీలను పటిష్టం చేయకుండా, ఖాళీలను భర్తీ చేయకుండా బీఆరెస్ సర్కార్ మోసం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థల మేలు కోసమే ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ సైతం పలు వేదికల మీద విమర్శించారు.
ఈ బిల్లును బీఆరెస్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ కూడా చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో ఖాళీలు భర్తీ చేయకుండా, నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి, నాణ్యత లేదంటూ దుష్ప్రచారాలు చేస్తోందని కోదండరామ్ ఆరోపించారు.
ఎలాంటి అనుమతులు, గుర్తింపు లేకుండా గురు నానక్, శ్రీనిధి యూనివర్సిటీలు ప్రవేశాలు ఇవ్వడం అక్రమం అంటూ కొద్ది నెలల క్రితం ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ రావు అప్పటి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నివాసాన్ని ముట్టడించారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదం లేకుండా రెండు యూనివర్సిటీలకు బీఆరెస్ సర్కార్ అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి శనివారం విద్యాశాఖ అధికారులతో అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏ ఒక్క ప్రైవేటు యూనివర్సిటీలో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, రిజర్వేషన్లు రాజ్యాంగ హక్కు అని అధికారులు వివరించినట్లు సమాచారం. అధికారుల వివరణ తరువాత రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ లకు ఎలా అనుమతించారు, ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల వివరాలు, వసూలు చేస్తున్న ఫీజులు, బోధన సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరించాలని విద్యాశాఖను ఆదేశించారు. రెసిడెన్షియల్ ఏరియాలు, వివాదాస్పద భూములు, అనుమతులు లేకుండానే అడ్మిషన్లు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఎస్‌సి, ఎస్‌టి లకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వీటిని అమలు చేయడానికి అవసరమైతే చట్టం తీసుకువస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రైవేటు యూనివర్సిటీల యాజమాన్యాల్లో వణుకు మొదలైంది. సిఎం ఏం ఆదేశించారు, అంతర్గతంగా ఏం చర్చ జరిగిందంటూ అధికారులకు ఫోన్లు చేసి తెలుసుకునే ప్రయత్నం ప్రైవేటు యూనివర్సిటీ యాజమానులు మొదలెట్టారు.
అంతర్గతంగా చర్చించిన అంశాలను తెలుసుకుని కోర్టులకు వెళ్లి ప్రభుత్వ చర్యలకు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. చట్టంలో ఉన్న లొసుగులను చూపించి తప్పించుకునేందుకు యాజమానులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రైవేటు యూనివర్సిటీల ఆగడాలకు కళ్లెం పడుతుందా లేదా షరా మామూలే అన్న విధంగా ఉంటుందా అనేది మున్ముందు తెలియనుంది.
ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..
రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమైన హక్కు.. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం చాలా మంచింది. అయితే ఆయా వర్గాల విద్యార్థులు ఫీజులు చెల్లించే ఆర్థిక స్థోమత కూడా ఉండదు. ఈ మేరకు ఫీజుల నియంత్రణ ఉండాలి.
– ప్రొఫెసర్ పాపిరెడ్డి
తెలంగాణ ఉన్నత విద్యామండలి తొలి చైర్మన్
ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని పీడీఎస్‌యూ స్వాగతిస్తుంది. బీఆరెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు లోపభూయిష్టంగా, రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఎంత ఉద్యమించినా ఆనాటి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీలు నెలకొల్పారు. వాళ్లు కోట్ల రూపాయల ఫీజుల దోపిడీకి వీలుగా నాటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. విద్యార్థి బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ ఆనాడు ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకోకుండా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి విద్యను మరింతగా సరుకులా మార్చింది. పదేండ్ల బీఆరెస్ పాలనలో విద్యారంగం సర్వనాశనమైపోయింది. నేడు ఏర్పడ్డ నూతన ప్రభుత్వమైనా విద్యారంగాన్ని గాడిలో పెడుతుందని ఆశిస్తున్నాం.
మహేశ్ పండరీ
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు