Site icon vidhaatha

Vizag Tour Places | విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలుసా..? అటువైపుగా వెళ్తే చూసి రండి..!

Vizag Tour Places | ఏపీలోని విశాఖపట్నం నగరానికి పర్యాటకరంగంలోనూ ఎంతో ప్రాధాన్యం ఉన్నది. శతాబ్దాలకుపైగా చరిత్ర, సంస్కృతిక చిహ్నంగా వెలుగొందుతున్నది. కుటుంబంతో కలిసి సంతోషంగా సెలవులను ఇక్కడ ఎంజాయ్‌ చేయొచ్చు. ఇక్కడికి వివిధ దేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. పచ్చని కొండలు, సముద్ర తీర అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. వైజాగ్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ఓ లుక్కేద్దాం రండి..!

జింధగడ శిఖరం గురించి తెలుసా..?

విశాఖపట్నం నుంచి 140 కిలోమీట‌ర్ల దూరంలో జింధగడ శిఖరం ఉంటుంది. ఇది సముద్రమట్టానికి ఏకంగా 1,690 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తూర్పు కనుమల్లో ఎత్తయిన పర్వత శిఖరంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. సుందరమైన అరకు లోయ అందాల‌ను పర్యాటకులు ఆస్వాదిస్తూ ముందుకు సాగొచ్చు. వైజాగ్ నుంచి మాడుగుల, పాడేరు నుంచి డుంబ్రిగుడ వరకు అరకు రోడ్డు మార్గంలో జింధగడ ఖిరానికి చేరుకోవచ్చు. క్యాంప్‌ సైట్‌కి పది కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది.

ఏఓబీ సరిహద్దుల్లో డుడుమ జలపాతాలు..

ఆంధ్ర, ఒడిశా మధ్య సరిహద్దులో డుడుమ జలపాతాలు పర్యాటకులను మరిచిపోలేని అనుభూతిని ఇస్తాయి. ప్రకృతి ప్రసాదించిన ప‌ర్యాట‌క ప్రదేశంగా దీన్ని పర్యాటకులు భావిస్తారు. విశాఖపట్నం నుంచి ఈ జలపాతానికి సుమారు 177 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వైజాగ్‌ నుంచి ఐదుగంటల సమయం పడుతుంది. ప్రయాణంలో ఎక్కడా అలసట అనేదే ఉండదు. ప్రకృతి అందాల మధ్య ప్రయాణం మధురానుభూతిని ఇస్తుంది. 2700 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

ట్రెక్కింగ్‌ ప్రియుల మనసుదోచే.. గోస్తనీ గుహలు

ట్రెక్కింగ్ ప్రియులకు గోస్తనీ గుహలు మరిచిపోలేని అనుభూతిని ఇస్తాయి. ఈ గుహలు విశాఖపట్నం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బొర్రా గుహల్లోని ఏడు గుహల స‌ముదాయంలో.. గోస్తనీ గుహలు ఒకటి. చీకటి గుహల్లో ట్రెక్కింగ్ చేయ‌డం ద్వారా గోస్తని నది ప్రవహించే అడవిలోని ముఖ‌ద్వారానికి దారి క‌నిపిస్తుంది. దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్‌ చేయవచ్చు. ఎకోహైక్స్, స్టార్‌డస్ట్ అడ్వెంచర్స్ తదితర స్థానిక ట్రెక్కింగ్ గ్రూప్స్‌ సాహస యాత్ర చేసేందుకు సహకారం అందిస్తాయి.

వన్యప్రాణుల అభయారణ్యం.. కంబాలకొండ

వైజాగ్‌ నుంచి పెద్దగా దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రకృతి ప్రసాదించిన అందాలను వీక్షించాలనుకుంటే కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యానికి వెళ్లొచ్చు. సిటీ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. 7వేల ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ అభయారణ్యంలో ఎన్నో అరుదైన వృక్షజాతులు, జంతుజాతులున్నాయి. కొండలతో కూడిన ప్రకృతి దృశ్యాలు, పచ్చని అడవులు, జంతువులతో సందడిగా ఉంటుంది. చిరుతపులి, నక్కలు, జింకలతో పాటు అరుదైన‌ జంతువులను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ట్రెక్కింగ్‌తో పాటు పక్షులను వీక్షించడం, సఫారీలను సైతం వీక్షించవచ్చు.

Exit mobile version