IND vs NZ 2nd ODI: Daryl Mitchell’s 131 Powers New Zealand to Series-Leveling Win
• భారత్: 284/7 – కేఎల్ రాహుల్ 112*, గిల్ 56
• న్యూజీలాండ్: 286/3 – మిచెల్ 131*, విల్ యంగ్ 87
• కివీస్ 7 వికెట్ల తేడాతో విజయం
• మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమం
• నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో
విధాత క్రీడా విభాగం | హైదరాబాద్:
భారత్, న్యూజీలాండ్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో నేడు జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1 – 1 తో సమంగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ కేఎల్ రాహుల్ అజేయ శతకంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ 47.3 ఓవర్లలోనే గమ్యాన్ని ముద్దాడింది. ఇక మూడో వన్డేలోనే సిరీస్ విజేత ఎవరో నిర్ణయించబడనుంది.
285 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ ఓపెనర్లను త్వరగానే కోల్పోయినా, విల్ యంగ్(87), గత మ్యాచ్‌లోనూ 84 పరుగులతో చెలరేగిన డరెల్ మిచెల్ అజేయ శతకంతో కదం తొక్కడంతో నిలకడగా విజయం వైపు పయనించింది. కెప్టెన్ గిల్ ఎంత ప్రయత్నించినా, ఈ ఇద్దరి జోడీని విడదీయలేకపోయాడు. అక్కడే భారత్ ఓటమికి బీజం పడింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు విలువైన 162 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యంగ్ ఔటయినా, గ్లెన్ ఫిలిప్స్(32*)తో కలిసి మిచెల్(131*)జట్టును విజయతీరాలకు చేర్చాడు. న్యూజీలాండ్ చివరికి 47.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి, 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తడబడినా, నిలబడిన బ్యాటింగ్ : రాహుల్ అజేయ శతకం
అంతకుముందు టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్ కెప్టెన్ శుభమన్ గిల్ ధాటిగా బ్యాటింగ్ ఆరంభించాడు. వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా వేగంగా ఆడే క్రమంలో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కోహ్లీ 23 పరుగులు చేసి అవుటవగా, గిల్ (56) నిలకడగా ఆడి అర్థ సెంచరీ నమోదు చేసాడు. గత మ్యాచ్‌లో ధాటిగా ఆడి ఒక్క పరుగు తేడాతో 50 చేజార్చుకున్న శ్రేయస్ అయ్యర్ 8 పరుగులకే ఇంటిముఖం పట్టాడు.
అప్పుడు వచ్చిన కేఎల్ రాహుల్, జట్టు స్కోరుకు వెన్నెముకగా నిలిచి, పోరాడే స్కోరు నిర్మించాడు. ఈ క్రమంలో జడేజా(27)తో కలిసి 73 పరుగులు, నితీశ్‌కుమార్ రెడ్డి(20)తో 57 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ రెండు భాగస్వామ్యాలే భారత్‌కు మంచి దీటైన స్కోరును అందించాయి.
రాహుల్ శతకంతో భారత్‌కు దీటైన స్కోరు – చివర్లో దాటిగా ఆడిన బ్యాటర్లు
భారత్ ఇన్నింగ్స్‌కు ప్రధాన బలం కేఎల్ రాహుల్ చేసిన అజేయ శతకం. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే శాంతంగా ఆడి పరిస్థితికి అనుగుణంగా రన్‌రేట్‌ను నియంత్రించాడు. చివరి దశల్లో రాహుల్ గేర్ మార్చి బౌండరీలు సాధిస్తూ స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. 92 బంతుల్లో 112* పరుగులతో ఇన్నింగ్స్‌ను ముగించిన రాహుల్ 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ల నుంచి వచ్చిన పరుగులు కూడా భారత స్కోరుకు సహకరించాయి. ఆఖరికి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.
కివీస్ బౌలర్లలో కొత్త కుర్రాడు క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు తీసుకోగా, మిగిలిన వారు తలా ఒకటి సాధించారు. మూడోదీ, ఆఖరుదీ అయిన సిరీస్ నిర్ణాయక మ్యాచ్ ఆదివారం 18వ తేదీన ఇండోర్‌లో జరుగనుంది.
స్కోర్లు:
భారత్: 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు, కెఎల్ రాహుల్ – 112*, గిల్ – 56. న్యూజీలాండ్ బౌలింగ్: క్రిస్టియన్ క్లార్క్ – 3 వికెట్లు
న్యూజీలాండ్: 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 285 పరుగులు, డారెల్ మిచెల్ – 130*, విల్ యంగ్ – 87. ఇండియా బౌలింగ్: సిరాజ్, ప్రసిధ్, కుల్దీప్ తలా ఒక వికెట్.
