Kalka to Shimla | హిల్ స్టేషన్లలో రైలు ప్రయాణాలు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. దక్షిణాదిలో ఊటీ నుంచి కూనూరు రైలు ప్రయాణం అలాంటివాటిలో ఒకటి. దీనికి మించిన ప్రయాణం, అనుభూతులు కావాలంటే కాల్కా నుంచి సిమ్లా రైల్లో వెళ్లాల్సిందే. ఈ మార్గంలో విస్టాడోమ్ రైలు ప్రకృతి అందాలను ప్రేమించేవారికి వరంలాంటిదనే చెప్పొచ్చు. హిమాలయాల ఒడిలో సాగే ఈ జర్నీ.. ఆ దారి పొడవునా కనిపించే దృశ్యాలు, చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాలు అబ్బురపరుస్తాయి. బ్రిటిష్‌వాళ్లు తమ వేసవి విడిదికోసం ప్రత్యేకంగా హిల్ స్టేషన్లు డెవలప్ చేశారు. అందులో భాగంగా వారి వేసవి రాజధాని అయిన సిమ్లాకు ఈజీగా వెళ్లేందుకు ఈ మార్గాన్ని అభివృద్ధి చేశారు. దీని నిర్మాణం 1898లో మొదలు పెట్టి.. 1903లో పూర్తి చేశారు. న్యారో గేజ్ మార్గం మొత్తం 96 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మించినదేంటంటే.. సముద్ర మట్టానికి 656 మీటర్ల ఎత్తులో ఉన్న కాల్కా నుంచి.. ఏకంగా 2076 అడుగుల ఎత్తులోని సిమ్లాకు తీసుకెళ్తుంది. ఇక మార్గమధ్యంలో వచ్చే వంతెనలు, సొరంగాలు, అచ్చెరువొందించే మలుపులు ఎన్నో. మొత్తంగా ఈ ప్రయాణంలో 102 సొరంగాల్లోనుంచి 864 వంతెనలను దాటుకొని, 919 వంపులు తిరుగుతూ రైలు వెళుతుంటే ఆ మజానే వేరు. దీనిని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో 2008లో గుర్తించింది.
ఇవీ విస్టాడోమ్ ట్రైన్ స్పెషాలిటీస్
సాధారణంగా చాలా వరకూ పర్యాటక రైళ్లలో తలుపులు, సీట్ల పక్కన ఉండే కిటికీల్లో నుంచే ప్రకృతిని అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. కానీ.. విస్టాడోమ్ రైళ్లు ఇందుకు భిన్నం. పైన అద్దాలతో కూడిన పైకప్పులు ఉండటమే కాకుండా.. కిటికీలు కూడా పెద్దగా ఉండటంతో ప్రకృతి అందాలను మరింతగా వీక్షించే వెసులుబాటు లభిస్తుంది. హిమాలయాల సౌందర్యాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. రైలులోని సౌకర్యవంతమైన సీట్లు, సదుపాయాలు, లోపలి డిజైన్ ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చివేస్తాయి. కాల్కా నుంచి సిమ్లా వరకూ ప్రయాణం ఐదు నుంచి ఆరు గంటలపాటు సాగుతుంది. మార్గమధ్యంలో బరోగ్, ధరంపూర్, సోలన్, కందఘాట్ వంటి ప్రసిద్ధ స్టేషన్లు సహా 18 స్టేషన్లు తగులుతాయి. బరోగ్ వద్ద ఏకంగా 1.14 కిలోమీటర్ల పొడవైన సొరంగం ప్రయాణికుల మనసును హత్తుకుంటుంది. ఒకవైపు లోతైన లోయలు.. ఆ పక్కనే ఎత్తయిన పర్వాతాలు, ఆకాశాన్ని తాకుతున్నాయా? అనిపించేలా కనిపించే దేవదారు వృక్షాలు సమ్మోహనపరుస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏదో అర్జెంటు పని ఉన్నదన్నట్టు వేగంగా పోవడం కాకుండా.. రైలు నెమ్మదిగా కదులుతూ ఉండటంతో ప్రకృతి అందాలను చక్కగా వీక్షించవచ్చు.
గరిష్ఠంగా వెయ్యి రూపాయలు టికెట్
విస్టాడోమ్ రైల్లో ప్రయాణించాలంటే ఒకవైపు జర్నీకి 800 నుంచి 1000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. పర్యాటక సీజన్, డిమాండ్‌ను బట్టి చార్జీల్లో కొంచెం మార్పులు ఉంటాయి. టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వీలుంది. సిమ్లాలో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ, డిసెంబర్ నుంచి జనవరి వరకూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లో టికెట్లు కూడా వేగంగా అమ్మడవుతాయి. ఈ సమయంలో సిమ్లా రైలులో ప్రయాణించాలనుకునేవారు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వేసవి కాలంలో ఈ ప్రాంతం చూడటానికి అద్భుతంగా కనిపిస్తుంది. జూలై, సెప్టెంబర్ నెలల మధ్య పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఈ నెలల్లో అక్కడక్కడా కొండచరియలు విరిగిపడే అవకాశాలు లేకపోలేదు. ఇక అక్టోబర్ నుంచి మార్చ్ నెలల మధ్య వింటర్ సీజన్‌లో మంచు దుప్పటి కప్పుకొని కనిపించే పర్వతాలు మెస్మరైజ్ చేస్తాయి. సాధారణ ప్రయాణాలకు మించిన అనుభవాలను పంచే కల్కా సిమ్లా విస్టాడోమ్ రైలు ప్రయాణం.. చారిత్రక, సహజ సౌందర్యాల అనుభవాల సమ్మేళనంగా నిలుస్తుంది. సో.. హిమాలయాల అందాలను చూసేందుకు ఈ ట్రైన్ జర్నీ చేసేందుకు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు?