Site icon vidhaatha

Google Maps | గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని.. రైల్వే ట్రాక్‌పైకి! క‌ట్ చేస్తే… ఎదురుగా గూడ్స్ రైలు!!

Google Maps | సాంకేతిక‌త‌ను వాడుకోవాలే కానీ.. మ‌రీ గుడ్డిగా కాద‌నేందుకు మ‌రో నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న‌ది ఈ ఘ‌ట‌న‌. జ‌న‌ర‌ల్‌గా తెలియ‌ని ఊళ్ల‌కు వెళ్లేట‌ప్పుడు గూగుల్ మ్యాప్స్ స‌హాయం తీసుకుంటాం. అది రైటంటే రైటు.. లెఫ్టంటే లెఫ్టు స్టీరింగ్ తిప్పుతూ ఉంటాం. ఒక్కోసారి అది అటూ ఇటూ తిప్పి.. ఎటు పోతున్నామో తెలియ‌ని ప‌రిస్థితిని కూడా క‌ల్పిస్తూ ఉంటుంది. సేమ్ టు సేమ్ సిట్యుయేష‌న్ ఒక వ్య‌క్తికి ఎదురైంది. గోర‌ఖ్‌పూర్‌లో ఒక పార్టీకి అటెండై.. తిరుగు ప్ర‌యాణంలో తాను వెళ్లాల్సిన పూర్తి అడ్ర‌స్ కాకుండా.. గోపాల్‌పూర్ అని టైప్ చేసి.. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు. గూగుల్ చెప్పింది క‌దా.. అని డ్రైవ్ చేసుకుంటూ పోయాడు.. అస‌లే మందేసి ఉన్నాడు. ఇంకేముంది.. రైల్వే ట్రాక్‌పైకి కారును ఎక్కించేశాడు. భూమిపై నూక‌లు మిగిలాయి కాబ‌ట్టేమో.. ఆ డేంజ‌ర్ నుంచి సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.

బీహార్‌లోని గోపాల్‌పూర్‌కు చెందిన వ్య‌క్తి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌లో ఒక పార్టీకి హాజ‌ర‌య్యాడు. మ‌ద్యం ప్ర‌భావంలో ఉండ‌టంతో సొంతూరే అయినా.. గోపాల్‌పూర్‌కు మ్యాప్ పెట్టుకున్నాడు. అలా డ్రైవ్ చేసుకుంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నో రిజియ‌న్‌లోని దోమిన్‌గ‌ఢ్ వ‌ద్ద కారును రైలు ప‌ట్టాల‌పైకి ఎక్కించేశాడు. ప‌ట్టాల‌ప‌క్క‌నే ఉన్న గ్రావెల్‌లో కారు ఇరుక్కుపోయింది. అస‌లే రాత్రిపూట‌. కొద్ది సేప‌టికే ఆ ట్రాక్‌పై ఒక గూడ్స్ వ‌చ్చింది. అదృష్ట‌వ‌శాత్తూ ట్రాక్‌పై కారు ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన లోకోపైల‌ట్‌.. వెంట‌నే ఎమ‌ర్జెన్సీ బ్రేక్స్ అప్ల‌యి చేశాడు. రైలు ఆ కారుకు సుమారు 5 మీట‌ర్ల దూరంలో వ‌చ్చి ఆగింది. దీంతో స‌ద‌రు డ్రైవ‌రు బాబు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. కారును డ్రైవ్ చేస్తున్న వ్య‌క్తిని ఆద‌ర్శ్‌రాయ్‌గా గుర్తించారు. అత‌డిని గోపాల్‌గంజ్ జిల్లా గోపాల్‌పూర్‌.

తాను గోర‌ఖ్‌పూర్‌లో ఒక పార్టీకి హాజ‌రై రాత్రి బాగా పొద్దుపోయిన త‌ర్వాత కారులో బ‌య‌ల్దేరాన‌ని, పూర్తి అడ్ర‌స్ బ‌దులు గోపాల్‌పూర్ అని మాత్ర‌మే గూగుల్ మ్యాప్‌లో టైప్ చేశాన‌ని పోలీసులకు తెలిపాడు. జీపీఎస్ డైరెక్ష‌న్‌లో కారు న‌డ‌ప‌డంతో అది దోమిన్‌గ‌ఢ్ రైలు ట్రాకుల‌పైకి తీసుకుపోయింద‌ని పేర్కొన్నాడు. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ పోలీసులు.. కారును ప‌ట్టాల‌పై నుంచి ప‌క్క‌కు త‌ప్పించి.. రైలు వెళ్లేందుకు మార్గం సుగ‌మం చేశారు. ఈ మొత్తం త‌తంగం పూర్త‌య్యేందుకు దాదాపు 57 నిమిషాలు ప‌ట్టింది. మ‌రో అదృష్టం ఏమిటంటే.. ఆ స‌మ‌యంలో ఆ ట్రాక్‌పై మ‌రే రైలూ రాలేదు. వ‌చ్చి ఉంటే ఎంత ఘోరం సంభ‌వించేదో! ఆద‌ర్శ్‌రాయ్ మితిమీరి మ‌ద్యం తాగి ఉన్నాడ‌ని ఆర్‌పీఎఫ్ అధికారులు ద‌ర్యాప్తులో గుర్తించారు. అక్క‌డిక‌క్క‌డే ఆయ‌న‌ను అరెస్టు చేసి క‌ట‌క‌టాల వెన‌క్కు పంపారు. కారును సీజ్ చేశాడు. ఈ కేసును రైల్వే పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version