Summer Tourist Places | వేసవి టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారా..? ఈ ప్రాంతాలకు వెళ్లి చూడండి..!

  • Publish Date - April 13, 2024 / 10:00 AM IST

Summer Tourist Places | ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల ఆఖరి వారంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. ఈ క్రమంలో వేసవిలో విహారయాత్రలకు వెళ్లాలని భావిస్తుంటారు. ఎండలబారి నుంచి ఊరట పొందేందుకు చల్లటి ప్రాంతాలకు వెళ్తుంటారు. చల్లటి వాతావరణంలో.. పచ్చటి ప్రకృతి రమణీయత పర్యాటకులను పరవశింపజేస్తాయి. పచ్చని పచ్చిక బయళ్లతో నిండిన హిల్‌స్టేషన్స్‌, అడ్వెంచర్స్‌ ట్రెక్కింగ్‌, జలపాతాలు ఇలా ఎన్నో ఉత్సాహం, మధురానుభూతిని పంచే ఎన్నో పర్యాటక ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయి. ఏప్రిల్‌లో ఎవరైనా సమ్మర్‌ వెకేషన్‌ కోసం ప్లాన్‌ చేస్తుంటే ఈ ఐదు ప్రదేశాలు మీకు ఈ వేసవిలో ఎంతో మధురానుభూతిని పంచుతాయి. ఆ పర్యాటక ప్రాంతాలేంటో తెలుసుకుందాం రండి..!

ఊటీ


ఊటీ దక్షిణ భారతంలో సుప్రసిద్ధి హిల్‌స్టేషన్. దీన్నీ ‘క్వీన్ ఆఫ్ ది హిల్స్’గా పిలుస్తుంటారు. నీలగిరి పర్వత శ్రేణులు, పచ్చదనంతో నిండిన హిల్‌స్టేషన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఊటీలో చూడదగిన ప్రదేశాల్లో నీలగిరి పర్వత ప్రాంతాల నుంచి రైలు ప్రయాణం తవినితీరా చూడాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అలాగే బొటానికల్ గార్డెన్, పైకార సరస్సు, దొడ్డబెట్ట శిఖరం, ఏకోరాక్‌, రోజ్‌గార్డెన్‌, డాల్ఫిన్స్‌ నోస్‌ తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇక ఏప్రిల్‌లో ఊటీలో సగటు ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల వరకు ఉంటుంది.

కొడైకెనాల్

దక్షిణ భారతంలో ఉన్న మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌. దీన్ని ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ హీల్స్‌’గా పిలుస్తారు. ఇక్కడి పచ్చదనం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. కొండలు, లోయలతో ప్రకృతి రమణీయత ప్రకృతి ప్రేమికులను మనసులను దోచేస్తుంది. ఈ ప్రాంతం హనీమూన్‌ వెళ్లే జంటలకు ఎంతో అనుభూతిని ఇస్తుంది. వేసవిలో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చల్లని గాలులను ఆస్వాదించడం కోసం నలుమూల నుంచి పర్యాటకులు తరలివస్తారు. ఏప్రిల్‌లో ఇక్కడ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కొడైకెనాల్‌లోని ప్రధాన సందర్శనా స్థలాలలో గ్రీన్ వ్యాలీ వ్యూపాయింట్, బేర్ షోలా జలపాతం, కోకర్స్ వాక్ ఉన్నాయి.

గ్యాంగ్‌టక్‌

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌. ఇది అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ భిన్న సంస్కృతులుంటాయి. ఇక్కడి వాతావరణం, నగరంలోని కాస్మోపాలిటన్ సంస్కృతి గ్యాంగ్‌టక్‌ను మంచి వేసవి పర్యాటక కేంద్రంగా మార్చేశాయి. వేసవిలో గ్యాంగ్‌టక్‌ ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ నుంచి 22 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ప్రపంచంలోని మూడవ ఎత్తైన పర్వత శిఖరం కాంచన్‌జంగా పర్వతం వీక్షించవచ్చు. గాంగ్‌టక్ సహజ సౌందర్యంతో సమృద్ధిగా ఉంటుంది. సోమ్‌గో సరస్సు, బాన్ ఝక్రి జలపాతం, తాషి వ్యూపాయింట్ మరిన్ని అనేక సహజ పర్యాటక ప్రాంతాలు మరిచిపోలేని అనుభూతిని పంచుతాయి. ఇక్కడ సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఎంచే మొనాస్టరీ, గణేశ్‌ టోక్, దో డ్రుల్ చోర్టెన్ రుమ్‌టెక్ మొనాస్టరీ ఉన్నాయి. ఈశాన్య భారతదేశంలో వైట్ వాటర్ రాఫ్టింగ్ కోసం తీస్తా నది ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటి.

కశ్మీర్


భూతల స్వర్గంగా పేరుగాంచిన కశ్మీర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సీజన్‌లో అయినా లోయ అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, సాహసోపేతమైన వినోదానికి సాక్షీభూతంగా నిలుస్తాయి. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శ్రేణుల నుంచి నిర్మలమైన లోయల వరకు పర్యాటకులకు మరపురాని అనుభూతులను కశ్మీర్‌ అందిస్తుంది. ఏప్రిల్‌లో ఇక్కడ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కొద్దిగా తేమ ఉండి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. కశ్మీర్‌లోని గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, పహల్‌గాం ఆకర్షణీయ ప్రాంతాలు.

చిరపుంజి

వేసవిలో ఈశాన్య ప్రాంతంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో చిరపుంజి ఒకటి. ఇక్కడ ఏడాదిలో అత్యధికంగా వార్షిక వర్షపాతం పొందుతుంది. ఆకాశమంతా భారీ మేఘాలతో నిండి ఉంటుంది. హిల్‌స్టేషన్‌లో మేఘాలు తానినట్లుగా ఉంటాయి. ఉప ఉష్ణమండల అడవులు, విభిన్న జంతుజాలం, జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. వర్షాలను ఇష్టపడితే తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. లివింగ్ రూట్ బ్రిడ్జ్, మావ్స్మై గుహ, సెవెన్ సిస్టర్స్ ఫాల్స్‌ను సందర్శింవచ్చు.

Latest News