Amba Prasad | అద్భుతంగా ఆడిపాడిన మహిళా ఎమ్మెల్యే.. ఈడీ విచారణకు ముందే వీడియో రిలీజ్‌..

  • Publish Date - April 10, 2024 / 08:50 AM IST

Amba Prasad : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 33 ఏళ్ల యువ నాయకురాలు, జార్ఖండ్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారించింది. మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబా ప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ దాదాపు 6 గంటలపాటు ఎంక్వయిరీ చేసింది. అయితే ఈడీ విచారణకు కొన్ని గంటల ముందు ఆమె.. తాను స్వయంగా ఆడిపాడిన ఓ పాటకు సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేశారు.

సోమవారం ఉదయం రాంచిలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి తన తొలి పాట అయిన ‘జియా హర్షాయే’ను అంబా ప్రసాద్‌ లాంచ్‌ చేశారు. నూతన సంవత్సరం ప్రారంభానికి సూచికగా జార్ఖండ్‌లో జరుపుకునే సర్హోల్‌ పండుగ ముందు రోజు ఆమె పాట లాంచింగ్‌ జరిగింది. పాట లాంచి తర్వాత కొన్ని గంటలకే ఆమెన ఈడీ విచారించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈడీ కార్యాలయంలో అధికారులు ఆమెను ప్రశ్నించారు.

కాగా, వీడియో సాంగ్‌పై అంబాదాస్‌ మాట్లాడుతూ.. ‘ఏదో చిన్న ప్రయత్నం చేశాను. చిన్నప్పటి నుంచే నాకు పాటలు, డ్యాన్స్‌లు అంటే ఇష్టం. కాబట్టి సర్హోల్‌ పండుగ సందర్భంగా నా తొలి సాంగ్‌ చేశాను’ అని చెప్పారు. ‘సంగీతం నా జీవితంలో భాగం. ఎప్పుడు అవకాశం వచ్చినా వినియోగించుకునేదాన్ని. సంగీతం మనసును కుదుటపరుస్తుంది. సంగీతం మానసిక ఒత్తిని తగ్గిస్తుందని శాస్త్రీయంగా కూడా రుజువైంది’ అని ఆమె అన్నారు.

ఈడీ విచారణ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని అంబా ప్రసాద్‌ చెప్పారు. న్యాయమే గెలుస్తుందని తాను నమ్ముతున్నానని తెలిపారు. కాగా అంబా ప్రసాద్‌ పాట ప్రస్తుతం వైరల్‌గా మారింది. కింద ఉన్న ఆ పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి..

Latest News