Interesting Video | జంతు ప్రపంచాన్ని మించిన వైవిధ్యాలు మరెక్కడా కనిపించవేమో! ఈ వీడియో చూస్తే మీరూ అదే అనుకుంటారు. సాధారణంగా వన్యజీవులకు, వన్య మృగాలకు మధ్య మనుగడ పోరాటం ఉంటుంది. మేకలు ఆకులు తింటే.. మేకలను పులులు తింటాయి. ఇది సృష్టి ధర్మం. కానీ.. ఈ ధర్మాన్ని ఎడంకాలుతో తన్నేసింది ఒక పులి. తనకు ఆహారంగా పంపిన మేకపోతుతో ఎంచక్కా స్నేహం చేసింది. పులిని చూసి భయపడే ఆ మేక.. తన భయాన్ని పక్కకు నెట్టేసింది. ఆ పులితో కలిసి హాయిగా, సరదాగా ఆటలు ఆడుకుంది.
2015లో రష్యాలోని ప్రిమోరీ సఫారీ పార్క్‌లో అమూర్ అనే పులి నివసించే ప్రాంతంలోకి దాని ఆ వారం ఆహారం కోసం తైమూర్ అనే మేకను వదిలిపెట్టారు. విచిత్రం ఏమంటే తైమూర్ విశ్వసాన్ని చూసిన అమూర్ దాన్ని తినకుండా వదిలేసింది. అంతేకాదు.. దానితో స్నేహం మొదలు పెట్టింది. సాధారణంగా మేకలను చూస్తే పులులు వదిలిపెట్టవు. వెంటాడి మరీ చంపి తింటాయి. కానీ.. దీనికి పూర్తి విరుద్ధంగా అమూర్ వ్యవహరించిన తీరు జంతు శాస్త్రజ్ఞులను సైతం విస్మయానికి గురి చేసింది. ఆనోటా ఈనోటా ఇది బయటకు పొక్కడంతో అనేక మంది ఈ ఇంటర్ స్పీసెస్ స్నేహంపై దృష్టిసారించారు. వాటి కదలికలన్నింటినీ డాక్యుమెంట్ చేశారు.
గతంలో చాలా సందర్భాల్లో ఇలా వేర్వేరు జంతువులు స్నేహంగా మెదిలిన ఘటనలు కెమెరాల్లో రికార్డ్ అయి.. నెట్టింట వైరల్‌గా మారాయి. వాటికి భిన్నంగా అమూర్, తైమూర్ స్నేహం నిలిచింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందటమే కాకుండా.. జంతువుల ప్రవర్తన, ఏకాంతత, అటవీ ప్రాంతాల్లో మానవ జోక్యం ప్రభావం వంటివాటిపై ప్రశ్నలు లేవనెత్తింది.