Infosys Canteen Viral Clip | గంటల తరబడి కూర్చొని పనిచేయడంతో అబ్బాయిల్లో పెరిగిన పొట్టలు! అధునాతన జీవన శైలి పేరుతో అమ్మాయిల చేతుల్లో పొగలు చిమ్ముతున్న సిగరెట్లు! ఇక ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్! హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల వద్ద అయినా నిత్యం కనిపించే దృశ్యాలు ఇవి! కానీ.. ఈ వీడియోలో బ్రేక్ టైమ్‌లో ముచ్చట్లు పెట్టుకుంటున్న అబ్బాయిలు ఫిట్‌గా ఉన్నారు! అమ్మాయిల చేతిలో ఎవరి వద్దా సిగరెట్లు లేవు! ఇక సెల్ ఫోన్‌లనేవేలేవు! కానీ.. వాళ్లు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇలా ఉంటారా? అని అబ్బుపర్చే వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది 90వ దశకంలో బెంగళూరు ఇన్ఫోసిస్ క్యాంపస్ క్యాంటిన్‌లో చిత్రీకరించినదిగా చెబుతున్నారు. ఈ వీడియో మొబైల్ ఫోన్లు లేకుండా హాయిగా మాట్లాడుకుంటూ ఉన్న దృశ్యాలు ఒక్కసారిగా పాత రోజుల్లోకి తీసుకుపోయాయని సీనియర్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజులు ఎంత బాగుండేవో అని సంతోషపడుతున్నారు.
క్యాపస్ క్యాంటిన్‌లో లంచ్ చేస్తూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, చక్కగా నవ్వుకుంటూ, స్నేహపూర్వకంగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను చూపిస్తుంది. ఈ వీడియోలో సెల్‌ఫోన్లు కనిపించకపోవడమే కాదు.. ఎంప్లాయీస్ అందరూ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా, సంతోషంగా కనిపించడం గమనిస్తాము. ఈ వీడియోను ఇన్ఫోసిస్ పాత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు షేర్ చేసుకుంటూ ఆ సంస్థలో తాము పనిచేసిన తీరు తాము గొప్ప సక్సెస్ సాధించడానికి, జీవితంలో స్థిరపడటానికి ఎలా దోహదం చేసిందో పేర్కొంటున్నారు.
ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ ఫుటేజ్ 1990వ దశకంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటిన్‌లో తీసినది. ఈ వీడియోలో ఉన్న దాదాపు అందరూ ఇప్పుడు లక్షాధికారులు అయి, ఇప్పటికే విదేశాల్లో స్థిరపడి ఉంటారు’ అనే క్యాప్షన్ జోడించారు. ఒక వ్యక్తి భావోద్రేకపూరిత వ్యాఖ్యలు చేస్తూ.. ‘ఇన్ఫోసిస్ తొలి 5000 మంది ఉద్యోగుల్లో ఒకరు నాకు తెలుసు. ఆయన 38 ఏళ్లకు రిటైర్ అయ్యారు. 2006 నాటికి ఆయన దాదాపు 100 కోట్లకు పైగా సంపాదించారు. ఆ తర్వాత ఒక్క రోజు కూడా యనా పనిచేయలేదు. ఇప్పటికీ బెంగళూరులోనే నివసిస్తున్నాడు. ఆయనకేమీ ఫ్యాన్సీ కారు లేదు. మంచి ఫ్లాట్‌లో జీవిస్తున్నారు. మీరు ఆయనను కలిస్తే ఆయన ఈ రోజు 200 నుంచి 300 కోట్ల ఆస్తిపరుడని మీరు నమ్మలేరు’ అని పేర్కొన్నాడు.
మరో యూజర్ ‘అంతా క్లీన్‌షేవ్‌తో ఉన్నారు. మంచి ఆరోగ్యవంతమైన శరీరాలతో ఉన్నారు. ఎవరికీ బొజ్జలు లేవు. చేతులకు ఫోన్‌లు అతుక్కుని లేవు. జాబ్ యాంగ్జైటీతో ఆల్కహాల్‌కు అలవాటు పడినట్టు ఛాయలే లేవు. నిస్వార్థమైన నవ్వులు.. కులమతాలకు అతీతంగా స్నేహాలు. ఆహా.. ఐటీ రంగంలో అద్భుతమైన పని రోజులు అవి’ అని రాశారు.
ఇదీ ఆ వీడియో..
Footage from Infosys canteen, Bangalore in 1990s. Almost everyone in this is probably a multi-millionaire and settled abroad today. pic.twitter.com/nTKDQMiXrJ
— Arjun* (@mxtaverse) October 18, 2025