Beauty of the Beast | ప్రళయ సౌందర్యం : తుపాను ‘కంట్లో’కి దూసుకెళ్లిన విమానం

ఈ ఏటి పెను తుపాను మెలిస్సా కంట్లోకి ప్రవేశించి రికార్డు నెలకొల్పిన అమెరికా వాయుసేన. హరికేన్​ హంటర్స్​గా పేరొందిన వీరు చిత్రీకరించిన అద్భుత దృశ్యాలను చూసిన ప్రపంచం మైమరచిపోయింది. ప్రళయంలో కూడా సౌందర్యాన్ని చూపించిన వీరి సాహసానికి లోకం జేజేలు పలికింది. కానీ, ఆ తుపాను సృష్టించిన బీభత్సానికి జమైకా దీవి భారీ నష్టాన్ని చవిచూసింది.

US Air Force ‘Hurricane Hunters’ Fly Into The Eye Of Category 5 Hurricane Melissa

US Air Force ‘Hurricane Hunters’ Fly Into The Eye Of Hurricane Melissa | Inside Nature’s Deadliest Arena

Hurricane Melissa Hunters | జమైకాపై విరుచుకుపడిన కేటగిరీ–5 తుపాను ‘మెలిస్సా’ను ప్రపంచం భయంభయంగా చూస్తుండగా, అమెరికా వాయుసేన ‘హరికేన్ హంటర్స్’ బృందం మాత్రం ఈ తుపాను ‘కంట్లో’కి దూసుకుపోయింది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 53వ వాతావరణ పర్యవేక్షణ స్క్వాడ్రన్‌కు చెందిన ఈ విమానం, తుపాను కేంద్రంలోకి ప్రవేశించి అద్భుత దృశ్యాలను చిత్రీకరించింది.

ఈఏటి మేటి పెను తుపాను ‘మెలిస్సా’ — ఆకాశాన్నే ఆక్రమించిన ప్రళయ శక్తి. అయితే ఈ ప్రళయచక్ర నేత్రంలోకి ధైర్యంగా దూసుకెళ్ళింది అమెరికా వాయుసేన ప్రసిద్ధ బృందం హరికేన్ హంటర్స్’.

ఈ బృందం యుఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 53వ వాతావరణ పరిశోధన స్క్వాడ్రన్లో భాగం. వీరు సాధారణ విమానయానానికి భిన్నంగా, తుపానులలోకి ప్రవేశించి, వాతావరణ సమాచారం సేకరించే ప్రత్యేక విభాగం. ఈసారి మాత్రం వారు నేరుగా ప్రవేశించింది 2025లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుపాను ‘మెలిస్సా’ కంట్లోకి!

“ఆ క్షణం మేం ఆకాశాన్ని కాదు… భూమిని చూస్తున్నాం”

ఈ మిషన్‌లో పాల్గొన్న బృందం,   ఆన్‌లైన్‌లో “Tropical Cowboy of Danger” పేరుతో ప్రసిద్ధి. వారు తుపాను కంట్లోకి ప్రవేశించినప్పటి దృశ్యాలను చూస్తూ మైమరచిపోయారు.  “మేం తుపాను కంట్లోకి ప్రవేశించినప్పుడు ఆకాశం కాదు, కింద కదులుతున్న సముద్రం మాత్రమే కనబడింది. చుట్టూ మేఘాల గోడలు(Eye Wall), భయంకర నిశ్శబ్దం, గోడల్లో పుడుతున్న మెరుపుల కాంతిలో ప్రకాశించిన ప్రళయ సౌందర్యం.”అంటూ వర్ణించారు.

ఈ కంట్లోనుంచి తీసిన వీడియోలో ‘స్టేడియం ఎఫెక్ట్(Stadium Effect)’ అనే అరుదైన దృశ్యం కనిపించింది — తుపాను గోడలు వంకరగా పైకి వంగి, మధ్యలో ఒక ప్రశాంత వృత్తాకార ఖాళీ స్థలం. అది ప్రకృతి సృష్టించిన ఓ ఆకాశ క్రీడామైదానం లా కనిపించింది. “మేం తుపాను కంట్లోకి ప్రవేశించినప్పుడు, చుట్టూ ఉన్న మేఘాల గోడలతో, కింద ఎక్కడో అడుగున కనిపిస్తున్న సముద్రంతో, ఒక ఆకాశ బావిలో ఉన్నట్లుంది. లోపల నిశ్శబ్దం, కానీ బయట మాత్రం పెనుగాలుల గర్జన భూమిని వణికిస్తున్నట్టనిపించింది.” వీడియోలో కంట్లో మెరుపులు మెరుస్తూ, మేఘాల మధ్యలో కాంతి సుడులు తిరుగుతున్నట్లు కనిపించింది. సూర్యరశ్మి తుపాను గోడపై నుంచి లోపలికి వంగి, ఒక అలౌకిక కాంతి వలయాన్ని సృష్టించింది.

అమెరికా వాయుసేన ఈ మిషన్‌ ద్వారా తుపాను నుండి సేకరించిన పీడనం, గాలివేగం, ఉష్ణోగ్రత సమాచారం ప్రపంచంలోని వాతావరణ కేంద్రాలకు చేరింది.  తుపానులు ఏర్పడే ముందు, తర్వాత వాటిలో ఎలాంటి వాతావరణముంటుందనే విషయంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఈ విమానయానాన్ని  “మానవ ధైర్యానికి ప్రతీక”గా అభివర్ణించారు.