Kuno National Park |
విధాత: వేసవి ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన మూగజీవాలు చీతాలకు తాగునీరు అందించినందుకు ఓ అటవీ ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోయిన ఘటన వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కులో దేశంలో అంతరించిపోయిన చీతాల జాతిని తిరిగి అభివృద్ధి చేసే ప్రాజెక్టు అమలవుతున్న సంగతి తెలిసిందే. పలు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చీతాలను ఈ నేషనల్ పార్కులో సంరక్షిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చీతాలు తొలుత ఇక్కడి వాతవరణానికి అలవాటు పడలేక చనిపోయినప్పటికి క్రమంగా వాటి సంతతి పెరుగుతూ వస్తుంది.
నేషనల్ పార్కు సరిహద్దు గ్రామాల్లో చీతాలు సంచరిస్తూ అక్కడి గ్రామ ప్రజలకు తారసపడుతుంటాయి. అయితే చీతాలు చిరుత పులుల వలే సాధారణంగా మనుషులపై దాడి చేయడం అరుదు. కాగా నేషనల్ పార్కు సమీపంలోని ఓ గ్రామంలో ఎండల వేడికి నీరసించిన జ్వాల(చీతా), దాని 4 కూనలు సేదతీరుతుండగా స్థానిక అటవీ శాఖ డ్రైవర్ సత్యనారాయణ గుర్జర్ వాటిని గమనించాడు. ఓ క్యాన్ లో నీరు తీసుకొచ్చి వాటికి సేద తీర్చాడు. ఎంత దాహంతో ఉన్నాయోమోగాని తల్లి, నాలుగు చీతాలు గబగబ నీటిని తాగి తమ దప్పిక తీర్చుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా..చీతాల దాహం తీర్చిన సత్యనారాయణను నెటిజన్లు అభినందించారు.
అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ ఘటనపై భిన్నంగా స్పందించారు. డ్రైవర్ సత్యానారాయణ చేసిన పనిపై మండిపడుతూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అయ్యో అతను చేసింది మంచిపనే కదా..మరి ఎందుకు సస్పెండ్ చేశారన్నదానిపై అటవీ శాఖ వివరణ ఇచ్చింది. నేషనల్ పార్కు పరిధిలోని సహజ పర్యావరణ వ్యవస్థలో అక్కడి ప్రాంత గ్రామీణులు భాగమైనప్పటికి చీతాలకు దగ్గరగా వెళ్లి వాటిని మచ్చిక చేసుకోవడం అనేది నిబంధనలకు విరుద్ధమని అటవీ శాఖ అధికారలు తమ ప్రకటనలో తెలిపారు.
చీతాలు తమ సహజ జీవన శైలీలోనే వేట, జీవనం సాగించాలని.. అందుకు విరుద్ధంగా వాటిని మచ్చిక చేసుకోవడమంటే వాటి సహజ జీవన లక్షణాలను దెబ్బతీయడమే అవుతుందని అటవీ శాఖ అధికారులు వివరించారు. ఇదంతా తెలియని డ్రైవర్ సత్యనారాయణ తానేదో జీవకారుణ్య కోణంలో మంచి పని చేస్తున్నానుకుని చీతాలకు తాగునీళ్లు అందించి ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడం పట్ల నెటిజన్లు తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.