Site icon vidhaatha

Viral: ఇంజినీరింగ్‌ అద్భుతం.. ప్రపంచంలో ఎత్తైన వంతెన! మ‌రో నెల‌లో ప్రారంభం..ఎక్క‌డ ఉందంటే?

Viral:

విధాత: వింత నిర్మాణాలు.. వినూత్న ఆవిష్కరణలు చేయడంలో చైనా (China) దేశీయులు ముందుంటుంటారు. ఇప్పటికే అనేక ఇంజనీరింగ్ అద్బతాలను చేసి చూపిన చైనా తాజాగా ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెన (World Highest Bridge). నిర్మాణాన్ని పూర్తి చేసి దేశ వాసులకు అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించింది. గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన చైనా మరోసారి ఇంజినీరింగ్‌ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించింది. ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్‌గా నిలవనుంది. ఈ వంతెన నిర్మాణంతో గంట పట్టే ప్రయాణాన్ని నిమిషంలోనే పూర్తి చేయొచ్చని అధికారులు వెల్లడించారు.

గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్‌ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ హువాజియాంగ్‌ గ్రాండ్ కెన్యాన్‌ బ్రిడ్జిని నిర్మించారు. 2022లో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా.. కేవలం మూడేళ్లలోపే పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ కోసం 280 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2400 కోట్లు) ఖర్చు చేశారు. ఈఫిల్‌ టవర్‌ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్ల(22వేల టన్నులు) బరువుతో దీన్ని నిర్మించారు. వంతెన మధ్య ఎలాంటి సపోర్టు లేకుండా పూర్తి సస్పెన్షన్ పద్ధతిలో నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ ఏడాది జూన్‌లో ఈ అద్భుత వంతెనను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో రాకపోకలకు లోయ చుట్టూ తిరిగి అవతలి వైపునకు చేరుకునేందుకు గంట సమయం పట్టేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్‌పై నుంచి కేవలం నిమిషం వ్యవధిలో అవతలి వైపునకు వెళ్లొచ్చని చైనీస్‌ అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యటక ప్రాంతంగానూ ఈ వంతెన నిలవనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఇలాంటి భారీ వంతెన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే 100 అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం ఈ గుయ్‌ఝౌ ప్రావిన్స్ లోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటిదాక ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తయిన వంతెన బెయ్పాన్ జియాంగ్ వంతెన(1,854అడుగులు) కూడా ఇక్కడే ఉండటం గమనార్హం.

Exit mobile version