Site icon vidhaatha

Jalasoudha | ఫైటర్‌ మినిస్టర్‌ శాఖలో ఏం జరుగుతున్నది?

Jalasoudha | ఢిఫెన్స్‌లో 16 ఏళ్ల‌కే చేరాను… 20 ఏళ్ల‌కే ఫైట‌ర్ పైలట్‌గా ప‌నిచేశాను అని చెప్పుకొనే నీటి పారుద‌ల శాఖ మంత్రి ఎన్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న శాఖ‌లో ఏం జ‌రుగుతుందో మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయి యుద్ధం జ‌రిగి, తన అవ‌స‌రం ఉందనిపిస్తే పాకిస్థాన్‌పై పోరాడుతానంటున్నఉత్త‌మ్ రెడ్డి మాట‌లు హర్షించతగినవే. కానీ ఆయన శాఖ‌లో సంబంధం లేని విభాగాల్లో ఏళ్ల‌కు ఏళ్లుగా తిష్ఠవేసిన ఇంజినీర్ల‌ను బ‌దిలీ చేయ‌డంలో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికైనా త‌న శాఖ‌లో ఎంత మంది ప‌నిచేస్తున్నారు, ఎక్క‌డ చేస్తున్నారు, ఏ ప‌ని కోసం నియ‌మితుల‌య్యారు, విధుల‌తో సంబంధం లేకుండా ఎంత మంది ఉన్నార‌నేది స‌మీక్షించుకుంటే ప్రభుత్వ సొమ్ము దుబారాను త‌గ్గించ‌న‌వారు అవుతార‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు.

పలుకుబడి.. సిఫారసులు చాలు

నీటి పారుద‌ల శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం జ‌ల‌సౌధ‌లో(Jalasoudha) ఇంజినీర్ల‌ లీల‌లు అన్నీ ఇన్నీ కావని అక్కడ చర్చలు సాగుతున్నాయి ప‌లుకుబ‌డి, సిఫార‌సులు ఉంటే చాలు రాష్ట్రంలో ఏ మూల‌కు వేసినా ఇక్క‌డ‌కు వ‌చ్చి హాయిగా ప‌నిచేసుకోవ‌చ్చు. అదేమంటే డెప్యూటేష‌న్ అంటారు. ఆరోగ్యం బాగా లేద‌ని చెబుతారు. కానీ ఎలాంటి అనారోగ్యాలూ ఉండవు.. దీర్ఘ‌కాలిక రోగాలు అంత‌క‌న్నా ఉండ‌వు. ప్ర‌త్యేక తెలంగాణ ఆవిర్భావం త‌రువాత నీటి పారుద‌ల శాఖ ప‌రిపాల‌నా (అడ్మినిస్ట్రేష‌న్‌) విభాగంలో ఇంజినీర్లు తిష్ఠ వేశారు. మినిస్టీరియల్‌ స్టాఫ్ చేయాల్సిన ప‌నులు, డీటీపీ ఆప‌రేట‌ర్లు చేసే టైపిస్టు ప‌నుల‌ను చేస్తూ ల‌క్ష‌ల జీతాలు తీసుకుంటున్నారు. ఇంత జ‌రుగుతున్నా నీటి పారుద‌ల శాఖ మంత్రి ఎన్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి తెలియ‌దా? తెలిసి మిన్న‌కున్నారా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. రాష్ట్రంలో నీటిపారుద‌ల ప్రాజెక్టుల‌ నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌, డిజైన్ల రూప‌క‌ల్ప‌న‌, అనుమ‌తులు మంజూరు, జీతాల చెల్లింపు, ప‌రిపాల‌న కోసం ఎర్ర‌మంజిల్ జ‌ల‌సౌధ (Jalasoudha)లో ప్ర‌ధాన కార్యాల‌యం ఏర్పాటు చేశారు. ఇందులో చిన్న నీటి పారుద‌ల, మ‌ధ్య త‌ర‌హా నీటి పారుద‌ల‌, భారీ నీటి పారుద‌ల విభాగాలు కూడా ప‌నిచేస్తున్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేర్వేరుగా మంత్రులు ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌రువాత ప‌రిధి చిన్నగా ఉండ‌టంతో అన్నింటినీ కలిపి నీటి పారుద‌ల శాఖ‌గా పిలుస్తున్నారు. రాష్ట్రంలో అటెండ‌ర్ స్థాయి నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వ‌ర‌కు బ‌దిలీలు, ప‌దోన్న‌తులు, పాల‌నాప‌ర‌మైన శిక్ష‌లు విధించ‌డం వంటి విధుల‌ కోసం ప‌రిపాల‌నా (అడ్మినిస్ట్రేష‌న్‌) విభాగం ఏర్పాటు చేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ విభాగంలో మినిస్టీరియ‌ల్ స్టాఫ్‌తోపాటు అటెండ‌ర్లు, ఒక‌రిద్ద‌రు ఇంజినీర్లు మాత్ర‌మే విధులు నిర్వ‌ర్తించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ విభాగంలో ఇంజినీర్లు తిష్ఠవేసి కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా వీళ్లు గ‌త ప‌దేళ్ల నుంచి క‌ద‌ల‌కుండా మెదల‌కుండా ప‌నిచేసుకుంటున్నారు. ఏఈఈగా వ‌చ్చి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వ‌ర‌కు ప‌దోన్న‌తులు పొంది కూడా ఇక్క‌డే కొన‌సాగుతుండ‌టం విశేషం. ప‌దోన్న‌తి ఇచ్చిన త‌రువాత బ‌దిలీ చేస్తారు. అయినా ఇక్క‌డే ప‌నిచేస్తున్నారంటే ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ ఎంత నిర్ల‌క్ష్యంగా ఉందో అర్థ‌మ‌వుతున్నదని అక్కడి ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మినిస్టీరియ‌ల్ స్టాఫ్ 44 మంది

ప్ర‌భుత్వం అనుమ‌తించిన ప్ర‌కారం ఇక్క‌డ 44 మంది మినిస్టీరియ‌ల్ స్టాఫ్ ప‌నిచేస్తున్నారు. ఇందులో 9 మంది సూప‌రింటెండెంట్లు, 22 మంది సీనియ‌ర్ అసిస్టెంట్లు, 12 మంది జూనియ‌ర్ అసిస్టెంట్లతో మొత్తం 44 మంది విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. వీరిపై ఒక డిప్యూటీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఉన్నారు. బ‌దిలీ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం, ప్ర‌తి నెలా ఉద్యోగుల జీతాల బిల్లుల‌ను అక్కౌంట్స్ విభాగానికి పంపించ‌డం, శాఖాప‌ర‌మైన శిక్షలు, ఇంజినీర్ల ప‌నితీరు మ‌దింపు, ప‌దోన్న‌తులు వంటి అంశాల‌ను చూస్తుంటారు. ఒక ఇంజినీర్‌ను ఒక జిల్లా నుంచి మ‌రో జిల్లాకు బ‌దిలీ చేసేందుకు ఫైళ్ల‌ను సిద్ధం చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ప‌నిచేస్తున్న సిబ్బంది, అధికారులు, ఇంజినీర్ల కోసం సుమారు 44 మంది మినిస్టీరియ‌ల్ స్టాఫ్ ప‌నిచేస్తున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. అయితే ఈ విభాగంతో ఏమాత్రం సంబంధం లేని టెక్నిక‌ల్ ఆఫీస‌ర్లు అయిన‌ ఇంజినీర్లు ప‌దుల కొద్దీ వ‌చ్చి చేరిపోవడం చర్చనీయాంశమవుతున్నది.

అడ్మినిస్ట్రేష‌న్‌లో 39 మంది ఇంజినీర్లు

ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌, డిజైన్ల రూప‌క‌ల్ప‌న కోసం ఇంజినీర్ల‌ను నియ‌మించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. ప్ర‌తి రెండు మూడు సంవ‌త్స‌రాలు లేదా, అవ‌స‌రాల‌ను బ‌ట్టి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్‌ క‌మిష‌న్ (టీజీపీఎస్సీ) నియామ‌కాల‌ను చేప‌డుతుంది. ఏ మేర‌కు నీటి పారుద‌ల శాఖ నుంచి ఏ స్థాయి ఇంజినీర్లు అవ‌స‌రం ఉంద‌నే వివ‌రాల‌ను ప‌బ్లిక్ స‌ర్వీస్‌ క‌మిష‌న్‌కు పంపించ‌డం, ప‌రిశీలించి నియామ‌కాలు పూర్తి చేస్తుంటారు. ఆ త‌రువాత వారిని నీటి పారుద‌ల శాఖ ఉన్న‌తాధికారులు అవ‌స‌రం ఉన్న ప్రాజెక్టు కార్యాల‌యాలు, జిల్లా కేంద్రాల‌లో నియ‌మిస్తారు. అయితే ఇందులో కొంద‌రు క్షేత్ర‌స్థాయికి వెళ్ల‌కుండా ఎర్ర‌మంజిల్ లోని జ‌ల‌సౌధ అడ్మినిస్ట్రేష‌న్ విభాగాన్ని షెల్ట‌ర్ గా ఎంచుకున్నారని అంటున్నారు. యుక్త వ‌య‌స్సులో నియామ‌కం అయిన ఇంజినీర్లు కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయ‌కుండా కుంటి సాకుల‌తో హైద‌రాబాద్ లో ప‌నిచేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ప్రస్తుతం అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలో ఏఈఈలు 24 మంది, డీఈలు 9, ఈఈలు నలుగురు, సూప‌రింటెండెంట్ ఇంజినీర్‌, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఒక్కొక్క‌రు చొప్పున మొత్తం 39 మంది ఉన్నారు. విచిత్ర‌మేమంటే డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు చేయాల్సిన ప‌నులను ఇంజినీర్లు చేస్తున్నా ఉన్న‌తాధికారులు ఏనాడు ప‌నితీరును మ‌దింపు చేసిన దాఖ‌లాలు లేవు. ప‌రిపాల‌నా విభాగంలో ఇంజ‌నీర్ల ప‌నేంటి అనేది ఏనాడు సమీక్షించిన పాపాన పోలేదు.

ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం

నెల‌కు రూ.20 వేల జీతంలో ప‌నిచేసే డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల విధుల‌ను ఇంజినీర్లు నిర్వ‌ర్తిస్తూ ప్ర‌భుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఇంజినీరు క‌నీసం రూ.1 ల‌క్ష‌కు త‌క్కువ కాకుండా ప్ర‌తి నెలా వేత‌నం పొందుతున్నారని సమాచారం. ఈ లెక్కన ప్ర‌తి నెలా రూ.50 ల‌క్షల‌ దాకా ప్ర‌భుత్వ సొమ్ము దుబారా అవుతున్నది. జీతాల‌కు తోడు వాహ‌నాల అల‌వెన్సులు అద‌నం. వాస్త‌వానికి ఒక‌రిద్ద‌రు ఇంజినీర్ల‌ను ఇక్క‌డ నియ‌మించ‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ప‌నిచేస్తున్న ఇంజినీర్లు క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్న‌తోటి ఇంజినీర్ల‌కు ‘సాయం’ చేస్తుంటారని వినికిడి. ఉన్న‌తాధికారులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించే క్ర‌మంలో ఆ విష‌యాల‌ను సంబంధిత ఇంజినీర్ల‌కు ముందే చేర‌వేయ‌డం, బ‌దిలీలు చేస్తే ఆ విష‌యాల‌ను లీక్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప‌రిపాల‌నా విభాగంలో మినిస్టీరియ‌ల్ స్టాఫ్ ను నియంత్రించే స్థాయికి ఇంజినీర్లు చేరుకున్నారంటే ఏ స్థాయిలో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయో ఊహించుకోవ‌చ్చని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ చీఫ్ ఇంజినీర్ గా ప‌నిచేసి బ‌దిలీపై వెళ్ళిపోయిన అధికారి ఇప్పుడు రాజేంద్ర న‌గ‌ర్ లోని వాలంట‌రీ డైరెక్ట‌ర్ జ‌న‌రల్ గా ప‌ని చేస్తున్నారు. అక్క‌డ కూర్చుని జ‌ల‌సౌధ లోని అడ్మినిస్ట్రేష‌న్ విభాగాన్ని త‌న కనుస‌న్న‌ల్లో న‌డిపిస్తున్నట్టు ఉద్యోగులు గుస‌గుస‌లాడుతున్నారు. బ‌దిలీ పై వెళ్లిన అధికారికి ఈ విభాగంతో ప‌ని ఏంట‌నేది వారు ప్ర‌శ్నిస్తున్నారు.

Exit mobile version