Site icon vidhaatha

ఏకాకిలా కవిత!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (విధాత): రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కవిత టాపిక్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం సాధించాలని కవిత ఇన్ని నిప్పులు కురిపించారో కానీ.. అవేవీ కవితకు కనీస సానుకూలతను ఇవ్వలేకపోయాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరీశ్‌రావు, సంతోష్‌పై ప్రధానంగా ఆరోపణలు చేసినందుకు బీఆరెస్‌లో మంత్రులు మొదలుకుని, కిందిస్థాయి నేతల వరకూ పోటీలు పడి ఖండనలు ఇచ్చారు. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ.. కారు పార్టీని కకావికలు చేసేందుకు ఒక అవకాశంగా భావించాయి. అదే సమయంలో వాటి నుంచి కవితకు ఎదురు ప్రశ్నలు వడగండ్లలా వచ్చి పడ్డాయి. ఇదంతా డ్రామాయేనని కొట్టిపారేశాయి. కానీ.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా నిలువలేదు.. ఒక్క ఊరట వచనమూ పలుకలేదు.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తప్ప!

కవితకు దక్కని మద్దతు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం పాజిటిట్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ మీడియాకు లీక్ కావడంతో గులాబీ పార్టీలో ఏదో జరుగుతోందనే చర్చ తెరమీదికి వచ్చింది. కేటీఆర్, తనకు మధ్య గ్యాప్ ఉందనే రీతిలో గతంలో కవిత వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా చేశారనే భావనతో ఆమె ఉన్నారనే ప్రచారం గట్టిగా సాగింది. అది నిజమేననిపించేలా కవిత కూడా స్వంతంగా జాగృతి ద్వారా కార్యకలాపాలు సాగించారు. ఈ సమయంలో పార్టీ వైపు నుంచి కానీ, కుటుంబం వైపు నుంచి కూడా ఆమెకు పెద్దగా మద్దతు లభించలేదు. పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరయ్యే రోజున ఆయనతో భేటీ అయ్యారు.

ఆ తర్వాత తన రెండో కొడుకును అమెరికాలోని కాలేజీలో చేర్పించేందుకు వెళ్లే సమయంలో ఆశీర్వాదం కోసం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. కవితతో కేసీఆర్ సరిగా మాట్లాడలేదని ప్రచారం సాగింది. అయితే దీని వెనుక సంతోష్, హరీశ్ ఉన్నారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ బహిష్కరించిన మరునాడే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కుటుంబ గొడవగా ఇతర పార్టీలు చూశాయి. తొలుత కేటీఆర్ ఆ తర్వాత హరీశ్ రావు, సంతోష్ ‌ లక్ష్యంగా చేసిన ఆరోపణలు ఫ్యామిలీ నుంచి కూడా ఆమెకు సపోర్ట్ రాకుండా చేశాయనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

కవిత ఎపిసోడ్ ను పరిశీలిస్తున్న ప్రత్యర్థి పార్టీలు
రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఏదైనా కారణంతో దెబ్బతినే పరిస్థితులు వస్తే దాన్నిరాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. బీఆర్ఎస్, కవిత ఎపిసోడ్ ను కూడా కాంగ్రెస్, బీజేపీలు అలానే చూస్తున్నాయి. కవిత కార్యక్రమాలకు, ఆమె పర్యటనలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు గతంలోనే ఆ పార్టీ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. కవిత వైపు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లకుండా కట్టడి చేయడానికి కారణమైంది.

హరీశ్ రావు, సంతోష్‌ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ ఉందని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. హుస్నాబాద్‌లో కవిత ఫ్లెక్సీని దగ్ధం చేశారు. మెట్‌పల్లిలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలో కవిత ఫోటో తీసివేశారు. బీఆర్ఎస్‌ను చీల్చి ఒకవర్గంతో బయటకు వచ్చే పరిస్థితిలో కవిత ఉంటే అప్పుడు ఆమెను చేర్చుకోవడానికి పార్టీలు ఆసక్తి చూపేవి. అయితే అదే సందర్భంలో రాజకీయంగా తమకు లాభనష్టాలు బేరీజు వేసుకొనేవి. కానీ, ప్రస్తుతం కవిత వెంట జాగృతి శ్రేణులు మినహా బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికైతే లేరు. వచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. అందుకే ప్రత్యర్థి పార్టీలు కూడా ఆమె విషయంలో లైట్‌గా తీసుకుంటున్నారనే చర్చ నడుస్తున్నది.

ఈ క్రమంలోనే తమ పార్టీల్లోకి కవితకు ఆహ్వానం లేదని కాంగ్రెస్, బీజేపీ ముందే ప్రకటించాయి. బీఆర్ఎస్‌ నుంచీ గెంటేశారు. కేఏపాల్ మాత్రం కవితను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ఆహ్వానం పంపారు. వెరసి.. కవిత రాజకీయంగా ఏకాకిగా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కవిత వెల్లడించిన అంశాలు పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాలను ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు కాళేశ్వరంలో కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఇది రాజకీయంగా బీఆర్ఎస్ కు నష్టం చేసే అవకాశం లేకపోలేదు.

Exit mobile version