హైదరాబాద్, విధాత ప్రతినిధి: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నాయకత్వం ఊహించని నిర్ణయం తీసుకున్నదని సమాచారం. రాజభవన్‌లో శుక్రవారం ఉదయం ఉదయం 11 గంటలకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్లను గంపగుత్తగా తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అజార్‌కు మంత్రి పదవి పేరుతో పకడ్బందీ వ్యూహం పన్నిందని అంటున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మంత్రివర్గ విస్తరణకు కోడ్ అడ్డంకి కాదని, హైదరాబాద్ జిల్లా మొత్తం కోడ్ పరిధిలో లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఒక్కరితోనే విస్తరణ ఉంటుందని, తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.
సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 ఉన్నారు. బీసీ కులాల ఓటర్లు 1.34 లక్షలు, కమ్మ ఓటర్లు 22,746, రెడ్డి ఓటర్లు 17,641, లంబాడీ ఓటర్లు 11,364, మాదిగ ఓటర్లు 15,963, మాల ఓటర్లు 12,657 ఉన్నట్లు అంచనా. వీరే కాకుండా ముస్లిం ఓటర్లు 1.20 లక్షల మంది వరకు ఉన్నట్లు తేలడంతో వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. గత మూడు నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతున్న ఇన్‌చార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జీ వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్.. కులాలవారీగా వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. రెండు మూడు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏమాత్రం సానుకూలంగా లేరని సుస్పష్టమైందని సమాచారం. 46 శాతం మంది ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ పాలన బాగుందని, సంక్షేమ పథకాలు ఠంచన్ గా అందాయని అంటున్నారని తెలిసింది. షాదీ ముబారక్, రైతు భరోసా, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు, సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్, పింఛన్ల పంపిణీ సమర్థవంతంగా అమలు చేశారని కితాబునిచ్చారని తెలుస్తున్నది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ అధ్వాన్నంగా మార్చారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్య సగానికి పడిపోయిందని తల్లిదండ్రులు వాపోయారని సమాచారం.
తులం బంగారంతో పాటు ఒక లక్ష రూపాయలు షాదీ ముబారక్ పథకం కింద ఇస్తామని చెప్పి ఢోకా చేశారంటున్నారు. పెంచిన పింఛన్ మొత్తం చెల్లిస్తామని చెప్పి ముఖం చాటేశారని గుర్రుగా ఉన్నట్టు వెల్లడైందని అంటున్నారు. రైతు భరోసా నాలుగు సీజన్లలో ఇవ్వకుండా మూడు సీజన్లలో ఇచ్చారని, అది కూడా చాలా మందికి అందలేదని ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ కింద రెండేళ్ల క్రితం ఎంపికైన వారికి ఇంకా డబ్బులు విడుదల చేయలేదని యువకులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి రెండు సంవత్సరాలు దగ్గరపడుతున్నా ఇంత వరకు ముస్లిం నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశారనే ఆగ్రహం కూడా ఉందని సర్వేలో వెల్లడైందని సమాచారం. బీఆర్ఎస్ హయాంలో ముస్లిం నాయకుడికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విషయంలో కూడా ఓటర్లలో సానుకూలతే ఉన్నట్టు సర్వేలో వెల్లడైందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోల్చితే కేసీఆర్ ప్రభుత్వం వంద రెట్లు భేష్ అంటూ పలువురు సర్వేలో తమ అభిప్రాయాలు తెలిపారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి వీ నవీన్ యాదవ్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అయినప్పటికీ ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారన్న వార్తలు కాంగ్రెస్ నాయకత్వంలో ఆందోళన రేకెత్తించిందని అంటున్నారు. ఈ ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందని, ఈ క్రమంలోనే ప్రధానంగా ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిందని చెబుతున్నారు.
ముస్లిం ప్రాతినిధ్యంపై ఏఐసీసీ నిర్ణయం!
ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు రెండు రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సాధించడం, ముస్లిం ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడంపైనే చర్చించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మాజీ క్రికెటర్, హైదరాబాద్ వాసి మహ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలో తీసుకోవాలని ఈ సందర్భంగానే నిర్ణయించినట్టు తెలుస్తున్నది. మహ్మద్ అజారుద్దీన్‌తోపాటు ప్రొఫెసర్ ఎం కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం రాజభవన్‌కు కొద్ది రోజుల క్రితమే సిఫారసు చేసింది. ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. నేడో రేపో రాజభవన్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నందున, అజారుద్దీన్‌ను మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతున్నది. ఈ నిర్ణయం మూలంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం సాధించడంతో పాటు ముస్లిం నాయకుడికి పదవి ఇచ్చి సముచితంగా గౌరవించారనే నమ్మకం పెరుగుతుందనే భావనతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత ఆరు నెలల వ్యవధిలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. గతంలో కూడా పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే మంత్రులుగా ప్రమాణం చేసి, ఆ తరువాత ఎన్నికయ్యారు.
జూబ్లీహిల్స్ వరకే కోడ్
భారత ఎన్నికల సంఘం (సీఈసీ) ఎన్నికల కోడ్ విషయంలో ఇటీవల కొన్ని మార్పులు చేసింది. ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగే సమయంలో జిల్లా మొత్తం కోడ్ అమలు చేయడం మూలంగా అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని గుర్తించింది. ఉప ఎన్నికల సమయంలో జిల్లా మొత్తం కాకుండా నియోజకవర్గం పరిధి వరకే ఎన్నికల కోడ్ అమల్లో ఉండేలా నిబంధనలు సవరించినట్లు తెలిసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్నది. నియోజకవర్గం వరకే కోడ్ ఉందని, మిగతా ప్రాంతాల్లో లేదని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. అయినప్పటికీ మిగిలిన ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి, ప్రారంభించడానికి అధికారులు సంశయిస్తున్నారు. కోడ్ పూర్తిగా అమల్లో లేనందున రాజ భవన్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అడ్డు ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రమాణ స్వీకారంపై ముందస్తుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలియచేయనున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజభవన్‌లో మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో మూడు ఖాళీలు ఉండగా, అజారుద్దీన్‌తో ఒకటి భర్తీ కానున్నది. మున్ముందు జరిగే విస్తరణలో మిగతా రెండు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.
