Site icon vidhaatha

Telangana Cabinet Expansion | తెలంగాణ క్యాబినెట్‌ విస్త‌ర‌ణ‌పై ఉలుకూ ప‌లుకూ ఎందుకు లేదు?

(విధాత ప్ర‌త్యేకం)
Telangana Cabinet Expansion | రాష్ట్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ రోజుకో ములుపు తిరుగుతున్న‌ది. గ‌త వారం రోజులుగా జ‌రిగిన ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టుగా ఉలుకూ ప‌లుకూ లేక‌పోవ‌డం ఆశావ‌హుల‌ను నిరుత్సాహ‌పరుస్తున్న‌ది. త్వ‌ర‌లో త‌న‌కు మంత్రివ‌ర్గంలో చోటు ల‌భిస్తుంద‌ని ఒక‌రిద్ద‌రు ఆశావ‌హులు సంబురాలు కూడా చేసుకున్నారట! కానీ.. ముహూర్తంగా చెప్పిన తేదీలు ఒక్కోటీ దాటిపోతూ ఉంటే.. ఉసూరుమంటున్నారట! ఊహాగానాల‌కు తెర‌దించేలా ఒక‌టి రెండు రోజుల్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుందా? ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌లు అనుమ‌తించ‌క‌పోతే మళ్లీ అట‌కెక్కుతుందా? అనే ఆందోళ‌న‌లో ఆశావ‌హులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గంలో ముఖ్య‌మంత్రితో క‌లుపుకొని మొత్తం 12 మంది ఉండ‌గా, మ‌రో ఆరు మంత్రి ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2023 డిసెంబ‌ర్‌లో కొలువుతీరింది. త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని అధిష్ఠానం పెద్ద‌ల‌తో పాటు ముఖ్య‌మంత్రి చెబుతూ వ‌చ్చారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడూ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న‌ది. ప్ర‌భుత్వం ఏర్పాటు అయి ప‌ద‌హారు నెల‌లు అవుతున్నా విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు కాలేదు. ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి, పార్టీ పెద్ద‌ల‌తో భేటీ అయిన సంద‌ర్భంలో విస్త‌ర‌ణ ఉంటుంద‌ని వార్త‌లు గుప్పుమన్నాయి. చివ‌ర‌కు ప‌ది రోజుల క్రితం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ఒక స్ప‌ష్ట‌మైన సంకేతం వ‌చ్చింది. పార్టీ పెద్ద‌లు పీసీసీ అధ్య‌క్షుడు బీ మ‌హేశ్‌ కుమార్ గౌడ్‌, ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఎన్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో భేటీ అయి చ‌ర్చించారు. న‌లుగురిని మంత్రివ‌ర్గంలో తీసుకునేందుకు అనుమ‌తి ల‌భించింద‌ని వార్త‌లొచ్చాయి. త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని చెప్పిన పీసీసీ అధ్యక్షుడు.. ఎంత‌మందిని తీసుకుంటున్నార‌నేది మాత్రం వివ‌రించ‌లేదు.

తెలుగు నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది పండుగ, ఆ మ‌రుస‌టి రోజు రంజాన్ ప‌ర్వ‌దినం ఉన్నందున విస్త‌ర‌ణ ఏప్రిల్ మొద‌టి వారంలో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. నాలుగో తేదీ లోపు ఎప్పుడైనా జ‌ర‌గొచ్చ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాజ్ భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ తో భేటీ సంద‌ర్భంగా వార్త గుప్పుమున్న‌ది. పావుగంట పాటు ముఖ్య‌మంత్రి, గ‌వ‌ర్న‌ర్‌తో ఏకాంత చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో ఇక మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సంబుర‌ప‌డ్డారు. ఏమైందో ఏమో కానీ మంగ‌ళ‌వారం సీనియ‌ర్ నాయ‌కుడు కే జానారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కోరుతూ అధిష్ఠానానికి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్ద‌ల‌ను క‌లిసి త్వ‌ర‌లో జ‌రిగే విస్త‌ర‌ణ‌లో త‌మ జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాల‌ని కోరారు. అయితే కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా ఉండేందుకు జానారెడ్డి.. రంగారెడ్డి జిల్లా అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చార‌నే వాద‌న మొద‌లైంది. న‌ల్ల‌గొండ జిల్లా నుంచి ఇప్ప‌టికే ఇద్ద‌రు ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా, మ‌రొక‌రికి ఇవ్వ‌డం స‌రికాద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అది కూడా ఒకే కుటుంబంలో అన్న‌ద‌మ్ముల‌కు ఇవ్వ‌డం మూలంగా పార్టీ బ‌ద‌నాం అవుతుంద‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జానారెడ్డి స్వ‌యంగా రంగంలోకి దిగి, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం క‌ల్పించాల‌నే అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చారంటున్నారు. జానారెడ్డి లేఖ‌తో రాజ‌గోపాల్ కు ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని, ఈ నెల 4వ తేదీ లోపు విస్త‌ర‌ణ క‌ష్ట‌మేన‌ని సీనియ‌ర్ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version