Site icon vidhaatha

Telangana Government Internal Struggle |  రేవంత్‌ వర్సెస్‌ ఉత్తమ్‌? మంత్రికి తెలియకుండా ‘ఇరిగేషన్‌’ కార్యక్రమం!

హైదరాబాద్, సెప్టెంబర్‌ 10 (విధాత):

Telangana Government Internal Struggle |  తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పైకి అందరూ కలిసి పనిచేస్తున్నట్లు కన్పించినప్పటికీ అంతర్గతంగా ఆధిపత్య పోరు రసవత్తరంగా నడుస్తోందని కాంగ్రెస్ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. ఇందుక ఉదాహరణగా సోమవారం గండిపేట, హిమాయత్‌ సాగర్‌లను నింపే ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొంటున్నాయి. గోదావరి జలాల అంశం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిధిలో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ నాయకుడు అని ఎవరిని అడిగినా చెబుతారు. కానీ.. సదరు ఇరిగేషన్‌ మంత్రి పేరు, ఫొటో లేకుండానే ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపనం చేయడం ప్రభుత్వంలో సాగుతున్న అధిపత్య పోరుకు నిదర్శనమా? అన్న చర్చలు సాగుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా గండిపేట లో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ రెండు, మూడు తో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపే అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించే 20 టీఎంసీల నీటితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడమే కాకుండా మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు. ఇది పోగా మిగిలిన 17.5 టీఎంసీల నీటితో మార్గ మధ్యంలో ఉన్న ఏడు చెరువులను నింపడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. సుమారు రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ బృహ‌త్త‌ర కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, గౌరవ అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డీ శ్రీధర్ బాబు, జీ వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీ దామోదర రాజ నరసింహా హాజరవుతారని మూడు తెలుగు పత్రికల్లో భారీగా అడ్వర్టయిజ్‌మెంట్స్‌ కూడా ఇచ్చారు. కానీ.. గోదావరి జలాలతో పాటు నదీ జలాల శాఖను పర్యవేక్షిస్తున్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోను ప్రచురించకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇది ముమ్మాటికీ ప్రొటోకాల్ ఉల్లంఘనే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అధికారులు బాధ్యత వహిస్తారా, ప్రభుత్వం పొరపాటును అంగీకరిస్తుందా అనేది తేలాల్సి ఉందని కాంగ్రెస్ నాయకులు నలుగురు కలిసిన చోట మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన పనులపై ఉత్తమ్‌కు అధికారిక సమాచారం లేదని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు పనులను ఖరారు చేశారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని వింటున్నాం. మెదక్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో వేదికల పైనే మంత్రుల ముందు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు గొడవకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. సోమవారం గండిపేటలో జరిగిన కార్యక్రమం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగిందని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి గా, పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. సోమవారం మూడు ప్రధాన తెలుగు పత్రికల్లో శంకుస్థాపన కార్యక్రమంపై మొదటి పేజీలో ప్రకటనలు ఇచ్చారు. ఒకటి కాంట్రాక్టు కంపెనీ ఇవ్వగా, మిగతా రెండూ స్థానిక ఎమ్మెల్యే వీ ప్రకాశ్ గౌడ్ పేరుతో వచ్చాయి. ప్రొటోకాల్ ప్రకారం నీటి వనరుల శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రిని తప్పకుండా శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడంతో పాటు అడ్వర్టైజ్‌మెంట్‌లోనూ ఆయన ఫొటో ప్రచురించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు.

ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయనున్న ఉత్తమ్‌?

త‌న‌కు తెలియ‌కుండా త‌న శాఖ‌కు చెందిన ప్రాజెక్టుల‌కు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేశార‌ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇదే అంశంలో అధిష్ఠానానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే.. హైద‌రాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప‌నులు కాబ‌ట్టి.. ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి ఈ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశార‌ని, నీటిపారుద‌ల మంత్రిని త‌ప్ప‌నిస‌రిగా సంప్ర‌దించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని రేవంత్‌రెడ్డి అనుచ‌రులు వాదిస్తున్నారు. అయితే మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నుంచి నీటిని త‌ర‌లించి గండిపేట‌ను, హిమాయ‌త్‌సాగ‌ర్‌ను నింపే ప‌నులు క‌చ్చితంగా నీటిపారుద‌ల శాఖ ప‌రిధిలోకే వ‌స్తాయ‌ని, ముఖ్య‌మంత్రి ఉద్దేశ‌పూర్వ‌కంగా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల తెలిపాయి. కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ నుంచి 1100 కోట్ల‌తో నీటిని త‌ర‌లించ‌డానికి గ‌తంలోనే ప్ర‌ణాళిక‌లు వేశామ‌ని, దానిని ప‌క్క‌న‌బెట్టి ఇప్పుడు అమాంతంగా 7360 కోట్ల అంచ‌నాతో ప‌నులు చేప‌ట్టార‌ని ఒక‌వైపు బీఆరెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అసంతృప్తి దీనికి తోడైంది.

గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు వివరిస్తున్నారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి. పైకి సఖ్యతగా ఉన్నట్లు కన్పించినా లోపల మాత్రం ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారంటున్నారు. ఉత్త‌మ్‌ను ఇరిగేష‌న్ మంత్రిగా కొన‌సాగించ‌డం ముఖ్య‌మంత్రికి ఇష్టం లేద‌ని కాంగ్రెస్‌ పార్టీలోని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగిన‌ప్పుడు ఆయ‌న శాఖ‌ను మార్చాల‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌య‌త్నించార‌ని, అయితే అధిష్ఠానం ఆయ‌న ప్ర‌య‌త్నాల‌ను సాగ‌నివ్వ‌లేద‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు ఒక‌రు తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును పున‌రుద్ధ‌రించే విష‌యంలో కూడా మంత్రివ‌ర్గంలో స‌ఖ్య‌త లేద‌ని తెలుస్తున్న‌ది. వేల‌కోట్లు ప్ర‌జాధ‌నంతో నిర్మించిన ఆ ప్రాజెక్టును పున‌రుద్ధ‌రించి, వినియోగంలోకి తేవాల‌ని కొంద‌రు మంత్రులు కోరుతుండ‌గా, వీలైనంత‌కాలం ఆ ప్రాజెక్టు పంచాయ‌తీని సాగ‌దీయాల‌ని ముఖ్య‌మంత్రి అనుకూల వ‌ర్గం ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల అంచనాల వ్యయం సవరణ, నిధుల మంజూరు, కనీసం సమాచారం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి సీబీఐ విచారణ ప్రకటన వంటి అంశాల్లో ఉత్తమ్ కీనుకగా ఉన్నట్లు సచివాలయంలో అధికారులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతోనే ఉత్తమ్ పేరును పక్కకు పెట్టారా లేదా ప్రభుత్వ ఉన్నతాధికారులు చేసిన తప్పిదమా? అనేది విచారిస్తే కాని అసలు విషయాలు వెలుగులోకి రావని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version