- పెట్టుబడుల పేరుతో ఇజ్జత్ తీశారని సీఎం గుస్సా!
- ఆ ఇద్దరూ పదేళ్లుగా ఒకే శాఖలో తిష్ఠ
IAS Officers Transfer| తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని భారీగా ఆశలు పెట్టుకున్నది. పెట్టుకున్న ఆశలు ఫలించకపోగ, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు రావడం, పారిశ్రామిక వర్గాల నుంచి పెదవి విరుపులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒకింత ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తున్నది. గురువారం చేపట్టిన బదిలీల్లో ఈ అంశానికి సంబంధం ఉన్న కారణంగానే ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటు పడిందనే చర్చ సచివాలయంలో జోరుగా వినిపిస్తున్నది. సీఎం పేషీలో పరిశ్రమలు, పెట్టుబడులు, స్పీడ్ (స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్, ఎఫెక్టివ్ డెలివరీ)ను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, అడిషనల్ సీఈవో ఈ వెంకట నరసింహారెడ్డిని బదిలీ చేశారు. జయేశ్ రంజన్ పర్యవేక్షించిన విభాగాలను ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావుకు పూర్తి అదనపు బాధ్యతలతో అప్పగించారు. ఐటీఈ అండ్ సీ డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా (2015 బ్యాచ్)కు అడిషనల్ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలతో అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే నెల జనవరిలో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పర్యటనకు ముందు ఈ పరిణామం జరగటం గమనార్హం.
పేలవంగా గ్లోబల్ సమ్మిట్ 2025
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నెలల పాటు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 నిర్వహణపై నిరంతరం శ్రమించారు. పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా తెలంగాణను ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో ఉందని చూపించాలని తాపత్రయపడ్డారు. డిసెంబర్ 8, 9 తేదీలలో రంగారెడ్డి జిల్లా కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించగా, కేంద్ర గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం వేయి మంది విదేశీ ప్రతినిధులు, 500 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని ప్రచారం చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేరుకోవాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ప్రచార పత్రాల్లో పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ప్రత్యేక వెబ్ పోర్టల్ కూడా రూపొందించారు. రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నది. ఐటీ, డాటా సెంటర్లు, పర్యాటకం, విద్యుత్, క్రీడలు, అటవి వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మొదటి రోజు రూ.3,97,500 కోట్లు, రెండో రోజు రూ.1,77,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరినట్లు వెల్లడించారు. దీని ద్వారా 13 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు. అయితే సమావేశ ప్రాంగణంలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఐదు వేల కుర్చీలను ఏర్పాటు చేయగా, కేవలం 1500 మంది మాత్రమే హాజరవడం గమనార్హం. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులు ఉండటంతో ఒక విధంగా ప్రభుత్వం పరువు పోయినట్టయింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారిలో రాష్ట్రానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొద్దిమంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. అగ్రిమెంట్లను చూసి ప్రతిపక్ష పార్టీలు నవ్వుకోవడమే కాకుండా ఇవేమీ పెట్టుబడులు అంటూ అపహాస్యం చేశాయి.
రూ.8,10,194 కోట్ల పెట్టుబడుల్లో రూ.18,600 కోట్లు కార్యరూపం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత గత ఏడాది దావోస్‌లో రూ.40,232 కోట్లు, ఈ ఏడాది దావోస్‌లో రూ.1,78,950 కోట్లు, సింగపూర్ పర్యటనలో రూ.3,950 కోట్లు, జపాన్ పర్యటనలో రూ.12,062 కోట్లు, గ్లోబల్ సమ్మిట్ లోరూ.5,75,00 కోట్లు కలిపితే మొతం రూ.8,10,194 కోట్ల విలువైన పెట్టుబడులపై ఎంవోయూలు జరిగాయి. గత రెండు దఫాలు దావోస్ లో జరిగిన ఒప్పందాల్లో ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు టీజీఐఐసీ అనుమతించినవి రూ.18,600 కోట్లు మాత్రమే కార్యరూపంలోకి వచ్చాయని, కనీసం పదిశాతం కూడా పెట్టుబడులు వాస్తవరూపం దాల్చలేదనే విమర్శలొస్తున్నాయి. ఇలా కార్యరూపం దాల్చకపోవడానికి కారణం ఏంటనేది కూడా ముఖ్యమంత్రి సమీక్షించినట్లు తెలిసింది.
సమ్మిట్ లో మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌కు అవమానం
రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఏకపక్షంగా వ్యవహరించడం పలువురు మంత్రులు, అధికారులు నొచ్చుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. తన సొంత నిర్ణయాలతో అందరినీ ఇబ్బందులకు గురి చేశారంటున్నారు. సమ్మిట్ బాధ్యతలు ఒక్కరికే అప్పగించి, సహచర బ్యూరోక్రాట్లను పక్కనబెట్టడంపై పలువురు చర్చించుకున్నారు. తమ శాఖలో ఆయన పెత్తనం ఏంటని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుకు ఫిర్యాదులు కూడా చేశారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు, ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆయన ఇదంతా చేస్తున్నారని గుసగుసలు విన్పించాయి. గ్లోబల్ సమ్మిట్‌ను తన ఒంటి చేత్తో నిర్వహించానని చెప్పుకొనే విధంగా వ్యవహరించారంటున్నారు. రెండు రోజులపాటు జరిగిన సమ్మిట్‌లో 15 అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ముగ్గురు మంత్రులకు మాత్రమే అనుమతించడంతో మిగతావారు అలిగి వెళ్ళిపోయారు. ఇదేమి సమ్మిట్ అంటూ సదరు మంత్రులు, ప్రధాన కార్యదర్శి ముందు అక్కసు వెళ్లగక్కినట్లు ప్రచారం జరిగింది. అయితే సదస్సు తరువాత ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లు జయేశ్ రంజన్పై ఫిర్యాదులు చేశారని సచివాలయంలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సమ్మిట్‌లో ఫిజిక్స్ వాలా అనే సంస్థ రాష్ట్రంలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముందుకు వచ్చి ఎంవోయూ కుదుర్చుకున్నది. దేశంలో డిజిటల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విధాన నిర్ణయం ప్రకటించలేదు. ఇలాంటి అంశాలను ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా పరిగణించారని అంటున్నారు.
బీఆర్ఎస్ ఏలుబడిలో కేటీఆర్‌తో సాన్నిహిత్యం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జయేశ్ రంజన్ అప్పటి ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావుతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఐటీ శాఖలో అన్నీ తానై ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రామారావును దేశ విదేశాలకు తిప్పించి బుట్టలో వేసుకున్నారనే గుసగుసలు అప్పట్లో విన్పించాయి. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత కేటీఆర్, జయేశ్ రంజన్ అప్పటి సీఎం కే చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్‌లో కలిశారు. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లారా, మరేదైనా పని కోసం వెళ్తున్నారా అంటూ చురకలు వేశారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇలాంటి పర్యటనలు వద్దు అని కేసీఆర్ ఇద్దరినీ గట్టిగా హెచ్చరించి పంపించినట్లు పరిశ్రమల శాఖలో ఉద్యోగులు చర్చించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి దఫాలో ఐటీ అండ్ కమ్యూనికేషన్ అదనపు ముఖ్య కార్యదర్శిగా, ఆ తరువాత ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన మరుసటి సంవత్సరం 2024 అక్టోబర్ నెలలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. కడప జిల్లా కలెక్టర్ గా 2002 నుంచి 2005 వరకు పని చేశారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సాన్నిహిత్యం పెంపొందించుకుని 2005లో హైదరాబాద్‌లోని హైదరాబాద్ అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా)కు వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. హుడాను ఆ తరువాత పరిధి పెంచి హెఎండీఏగా మార్చారు. ఈయన హయాంలో ప్రభుత్వ భూములను హుడా వేలం వేయడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లలో గోల్‌మాల్ చోటుచేసుకోవడం, దానిపై వైఎస్ఆర్ సీబీఐ విచారణకు ఆదేశించడం అందరికీ తెలిసిందే. జయేశ్ రంజన్ ఆధీనంలోనే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పీ వెంకట్రామ్ రెడ్డి కార్యదర్శిగా పనిచేశారు. ఆ తరువాత ఐఏఎస్ గా పదోన్నతి పొంది సిద్ధిపేట జిల్లా కు కలెక్టర్ గా పనిచేసి, పదవీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.
టాస్క్, వీ హబ్, ఐటీ విభాగంలో తన వర్గానికి చెందిన ఉత్తరాది రాష్ట్రాల వారిని నియమించారనే ఆరోపణలు జయేశ్ రంజన్ పై ఉన్నాయి. టాస్క్ అనగా తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. దీని ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణను అందించడం. భారత దేశంలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ హబ్ ఇంక్యూబేటర్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఐటీ విభాగంలో మొత్తం తన వర్గం వారిని నియమించుకున్నారని పలువురు అప్పట్లో కేటీఆర్ తో పాటు కేసీఆర్ కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదంటున్నారు. గడచిన దశాబ్ధ కాలంగా ఐటీ శాఖ లో కొనసాగుతూ, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని సచివాలయంలో కొందరు ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. పాలకుల వల్లే ఇది సాధ్యమైందని, ఒకే శాఖలో పది సంవత్సరాల పాటు కొనసాగిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయంటున్నారు.
