Site icon vidhaatha

BRS Defecting MLAs: ఆ ప‌ది మంది ఎమ్మెల్యేలు మ‌ళ్లీ కారెక్కుతారా? బీఆరెస్ ఎల్పీ ఆఫీసులో ఏం జ‌రిగింది?

BRS defecting MLAs : పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతున్న క్రమంలో వారు తిరిగి గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇందుకు తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం మరింత ఊతమిస్తున్న‌ది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన కేసీఆర్‌ను బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గూడెం మహిపాల్ రెడ్డి కలవడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ సైతం తనను కలిసిన గూడెం మహిపాల్ రెడ్డితో ఆప్యాయంగా మాట్లాడారు. ఇదంతా రాజకీయ వర్గాల్లో వైరల్‌గా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేతో కేసీఆర్ వ్యవహరించిన తీరు చూసిన వారంతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి సొంతగూటికి వచ్చేందుకు గులాబీ కార్పెట్ పరుస్తున్నారా? అన్న చర్చలను రేకెత్తించింది. మహిపాల్ రెడ్డి ఇటీవల తన నియోజకవర్గంలోని డంపింగ్ యార్డు సమస్యపై తనను కలిసిన కాంగ్రెస్ కార్యకర్తలతో తాను కాంగ్రెస్ కాదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇటీవల దానం నాగేందర్ సైతం హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. అదీగాక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులకు మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు కూడా వారిని తిరిగి సొంత గూటివైపు చూసేలా చేస్తున్న‌ద‌న్న‌ చర్చ సాగుతున్న‌ది.

టెన్షన్ పెడుతున్న సుప్రీం కోర్టు

ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మందిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత కేసు విచారణలో సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందిస్తుండటం కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతోంద‌ని స‌మాచారం. పదేపదే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని.. ఉప ఎన్నికలు తథ్య‌మ‌ని బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలు వారికి కునుకు లేకుండా చేస్తున్నాయి. అటు కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేందుకు తగినంత సమయమంటే ఐదేళ్ల కాలమా? అని ప్రశ్నించడం కూడా కేసు తీవ్రతకు నిదర్శనంగా మారింది. జస్టిస్ గవాయ్.. ‘తగినంత సమయం అంటే ఎంత? వాయిదా వేస్తూ ఐదేండ్ల పదవి పూర్తయ్యే వరకు ఉంటారా? తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా? మనం ప్రజా స్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్ధం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదు’ అని కీలక కామెంట్లు చేశారు.

ఈ నెల 25న కౌంటర్ దాఖలు చేయాలి : సుప్రీం కోర్టు

ఇది ఇలా ఉండగానే తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన రోజునే సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణపై కీలక ఆదేశాలు వెలువడటం వారిని మరింత కలవరపెడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం పిటిషన్‌పై మరోసారి విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు పంపింది. ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీకి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

25న సుప్రీంకోర్టులో విచారణ

కాంగ్రెస్‌లో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జనవరి 15న బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌‌‌‌ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్‌‌‌‌ లీవ్‌‌‌‌ పిటిషన్‌ (ఎస్‌‌‌‌ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఎం సంజయ్‌‌‌‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌‌‌‌ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్‌‌‌‌ రెడ్డి, అరికెపూడి గాంధీపై కేటీఆర్ రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్న‌ది. ఈకేసులో సుప్రీంకోర్టు దూకుడు చూస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎక్కడ తమపై అనర్హత వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నార‌ని అంటున్నారు. అయితే వారిని అనర్హత ముప్పు నుంచి రక్షించుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చేరినప్పుడు పడని అనర్హత వేటు ఇప్పుడెందుకు పడుతుందంటూ ధైర్యం వచనాలు వినిపిస్తున్నారు. కేసు సుప్రీంకోర్టులో వేగంగా విచారణ సాగుతుండటంతో ఈ నెల 25న అనర్హత వ్యవహారం మరే మలుపు తీసుకుంటుందోనన్న గుబులు ఫిరాయింపు ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న‌ది.

Exit mobile version