Site icon vidhaatha

న్యాయపోరాటాన్ని ఎంచుకున్న ఎబీ వెంకటేశ్వరరావు

విధాత,అమరావతి: సీనియర్ ఐపీయస్ అధికారి ఎబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటాన్ని ఎంచుకున్నారు. గత నెల 19న ఎంపీ విజయసాయిరెడ్డికి ఏబీవీ లీగల్ నోటీసులు ఇచ్చారు. యుద్ధం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచే నరుక్కొస్తానని ఆయన హెచ్చరించారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేసి ఇంటెలిజెన్స్ పోస్టు నుంచి తొలగించారని ఆరోపించారు.విజయసాయిరెడ్డితో పాటు సాక్షి మీడియా, అప్పట్లో ఆ వ్యవహారాలు చూసిన.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తితో సహా ఏడుగురికి పరువునష్టం నోటీసులిచ్చారు.

ఈ కారణంగానే తన డిస్మిసల్‌కు ప్రతిపాదనలు పంపారని వెంకటేశ్వరరావు భావిస్తున్నారు.ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదనలు పంపింది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయనపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. నిఘా పరికరాల కొనుగోలు ఆరోపణలతోపాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు నమోదు చేశారు.

ఆయన సస్పెన్షన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. శాఖాపరమైన విచారణలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవలే ఆయన కేసులకు సంబంధించి ప్రజెంటింగ్‌ ఆఫీసర్‌ను కూడా నియమించారు. ఇంతలోనే ఆయన్ను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Exit mobile version