APSPDCL | ఆర్టీఐ దరఖాస్తుపై విచిత్ర సమాధానం! ట్రాన్స్ ఫార్మర్ అంశం ప్రజాసంబంధం కాదట!

ఏపీలో గత ఐదారు సంవత్సరాలుగా అధిక ధరకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు విచ్చల విడిగా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపై నిగ్గు తేల్చేందుకు ఆర్టీఐ కార్యకర్త ఒకరు చేసిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంలో అవినీతి బయటపడుతుందనే ఈ విషయాలు చెప్పడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

APSPDCL | సమాచార హక్కు చట్టానికి (ఆర్టీఐ యాక్ట్‌) ప్రభుత్వ అధికారులు తూట్లు పొడుస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తున్నది. పౌరుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రక్షణ రంగంతో పాటు హోం మంత్రిత్వ శాఖలో కొన్నింటిని ఆర్టీఐ చట్టం నుంచి మినహాయింపు నిచ్చారు. కానీ.. ప్రజలతో సంబంధం ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లపై వివరాలు ఇచ్చేందుకు నిరాకరించడం ఆశ్చర్యాన్ని, అనుమానాలను కలిగిస్తున్నది. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు (అగ్రికల్చర్ డీటీఆర్) ఎన్ని కొనుగోలు చేశారు? ఎంత మొత్తం వెచ్చించి తీసుకున్నారు? అనే వివరాలపై ఒక వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. దరఖాస్తును పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు విచిత్రమైన సమాధానం ఇచ్చారు. వారిచ్చిన సమాధానం చూసిన దరఖాస్తుదారుడు విస్తుపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌) పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్) కొనుగోలు చేస్తున్నాయి. వోల్టేజీలో హెచ్చు తగ్గులను నియంత్రించి, నిరంతర విద్యుత్ సరఫరా కోసం వీటిని ఏర్పాటు చేస్తుంటారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్టు) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్సీడీసీఎల్)లో దరఖాస్తు సమర్పించారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ఎన్ని కొనుగోలు చేశారు? ఏ ధర కు కొనుగోలు చేశారు? అనే వివరాలు తెలియచేయలని ఆయన దరఖాస్తులో కోరారు. దరఖాస్తును పరిశీలించిన ఏపీ ఎస్పీడీసీఎల్ జనరల్ మేనేజర్ (కొనుగోళ్లు) విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ఆర్టీఐ చట్టం 2005, సెక్షన్ 8(డీ) అండ్ ఈ ప్రకారం సమాచారం ఇవ్వడం మినహాయించినట్లు సమాధానమిచ్చారు. ఇది ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన విషయం కానందున సమాధానం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

ఏపీలో గత ఐదారు సంవత్సరాలుగా అధిక ధరకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు విచ్చల విడిగా కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ రూ.75వేలకు లభ్యమవుతుండగా, విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం రూ.1.40 లక్షలకు ఒకటి చొప్పున కొనుగోలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ పై అదనంగా రూ.65వేలు చెల్లిస్తున్నారంటున్నారు. అదనంగా చెల్లించిన మొత్తం నుంచి విద్యుత్ శాఖలో పై నుంచి కింది స్థాయి వరకు వాటాలు అందుతున్నాయని, అందుకే సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు రెట్టింపు మొత్తంతో కొనుగోలు చేస్తూ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారనే చర్చ జరుగుతుండడంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి దరఖాస్తు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

Read Also |

Civil Supplies Corporation | పౌర సరఫరాల్లో రిటైర్డ్‌ ఉద్యోగుల తిష్ఠ! ప్రతి నెలా రూ.40 లక్షల దుబారా!
Brain Weaponization | ఇక మెదడే మారణాయుధం! చదవితేనే మైండ్‌ బ్లాక్‌ అయ్యే న్యూరోటెక్నాలజీ అప్‌డేట్‌!
local Body Elections | రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్
Repo Rate | రెపోరేటు లోన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? 

Latest News