హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Civil Supplies Corporation | తెలంగాణ పౌర సరఫరాల కమిషనరేట్ పరిధిలో రిటైర్డు ఉద్యోగులు తిష్ఠవేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 82 మంది రిటైర్డు ఉద్యోగులు పనిచేస్తున్నారని సమాచారం. ఒక్కొక్కరి వయస్సు 70 సంవత్సరాలకు పైబడి ఉంటుందని, ఈ వయస్సులో ఏం పనిచేస్తారని ప్రభుత్వ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో రిటైర్డు ఉద్యోగులను తొలగించగా, ఇక్కడ మాత్రం కొనసాగించడం వెనకాల ఉన్న మతలబు ఏంటో అర్థం కావడం లేదని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. వీరి మూలంగా పౌర సరఫరాల కార్పొరేషన్ కు ప్రతి నెలా రూ.40 లక్షలు బొక్క తప్పితే ప్రయోజనం లేదని అంటున్నారు.
ఎర్ర మంజిల్‌లో పౌర సరఫరాల భవన్ ఉంది. ఈ భవనంలో పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయం దశాబ్ధాల నుంచి కొనసాగుతున్నది. దీనికి ఆనుకుని ఉన్న భవనంలో మొన్నటి వరకు పౌర సరఫరాల కార్పొరేషన్ కార్యాలయం ఉండేది. విభజన తరువాత ఏపీకి భవనం కేటాయించడంతో ఖాళీగా ఉన్నది. ఈ భవనానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా ఏపీ ప్రభుత్వానికి అద్దె చెల్లిస్తున్నది. కాని వినియోగించుకోవడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదంటున్నారు. అయితే విజిలెన్స్ విభాగం కోసం అమీర్ పేట మైత్రివనం భవనంలోని ఆరో అంతస్తులో అద్దెకు తీసుకున్నారు. కమిషనర్‌గా డీఎస్ చౌహాన్ ఉన్న సమయంలో అద్దెకు తీసుకుని అలాగే కొనసాగిస్తున్నారు. ప్రధాన కార్యాలయం పక్కనే భవనం ఖాళీగా ఉన్నా వినియోగించుకోకుండా మైత్రివనంలో అద్దెకు తీసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే ఆవరణలో విజిలెన్స్ విభాగంతో పాటు ఇతర విభాగాలు కొనసాగుతున్నాయి. విజిలెన్స్ విభాగం అధిపతి ఆధీనంలో కేవలం పదిహేను మంది వరకు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా వారు జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్నారు. విజిలెన్స్ విభాగంలో సాధారణంగా సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు లేదా పోలీసు విభాగం నుంచి డిప్యూటేషన్ పై నియమించుకుంటారు. దీనికి విరుద్ధంగా ఎప్పుడో పది సంవత్సరాల క్రితం రిటైర్ అయిన పోలీసులను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డెబ్బై సంవత్సరాలకు పైబడిన వారు విజిలెన్స్ విభాగంలో చురుగ్గా పనిచేస్తారని అనుకోవడం అసాధ్యమని పౌర సరఫరాల ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఒక్కరికి రూ.50వేలకు తక్కువ కాకుండా వేతనాలు చెల్లిస్తున్నారని, ఇలా ప్రతి నెలా రూ.40 లక్షల వరకు జీతాల రూపేణా దుబారా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పదవీ విరమణ పొందిన వారిని (రిటైర్డు) ఇంటికి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అప్పటి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ చేశారు. దాదాపు 90 శాతం వరకు పదవీ విరమణ పొందిన వారిని ఇంటికి పంపించారు. కొన్ని కార్యాలయాల్లో మాత్రం కొద్ది మందిని మాత్రమే కొనసాగిస్తున్నారు. పౌర సరఫరాల కార్పొరేషన్ వరి ధాన్యం సేకరించే సమయంలో 2 శాతం నిధులను కార్పొరేషన్ ఖాతాలో నిర్వహణ వ్యయం కింద జమ చేస్తున్నారు. ఈ 2 శాతం ద్వారా సమకూరిన సొమ్ముతో విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న 82 మంది రిటైర్డు ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని అప్పటి కమిషనర్ చౌహాన్ సచివాలయంలోని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించారు.
ప్రభుత్వం నుంచి నయా పైసా తీసుకోవడం లేదని చెప్పడంతో, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా గుడ్డిగా ఆమోదించారని పౌర సరఫరాల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వీరి వల్ల తమకు ఆదాయం లేకపోగా నష్టం వాటిల్లుతోందని గగ్గోలు పెడుతున్నారు. సర్వీసులో ఉన్నవారిని లేదా ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగులను తీసుకుంటే సంస్థకు లాభం జరుగుతుందంటున్నారు. రేషన్ బియ్యం నల్ల బజార్ కు వెళ్లకుండా అడ్డుకుంటారని, సీఎంఆర్ ను మిల్లర్లు తిరిగి అప్పగించేలా పనిచేస్తారని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారితో పనిచేయించుకోవడం మూలంగా బాధ్యత లేకపోగా, ఎక్కడ వీలైతే అక్కడ అవినీతికి పాల్పడతారని అంటున్నారు.
ఇలాంటి వారి మూలంగానే రాష్ట్రంలో రైస్ మిల్ యాజమాన్యాలు ధాన్యం తీసుకుని తిరిగి బియ్యం వెనక్కి ఇవ్వడం లేదని, తద్వారా పౌర సరఫరాల కార్పొరేషన్ వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. కార్పొరేషన్ పూర్తిగా అప్పుల ఊబీలో కూరుకుపోయిందని, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
Read Also |
Brain Weaponization | ఇక మెదడే మారణాయుధం! చదవితేనే మైండ్ బ్లాక్ అయ్యే న్యూరోటెక్నాలజీ అప్‌డేట్!
Back From Death | అంత్యక్రియలకు సిద్ధం చేసిన శవపేటికలో చప్పుళ్లు.. కట్ చేస్తే!
AP Cyclone Seriyan| ఏపీకి ‘సెరియాన్’ తుపాన్ హెచ్చరిక
