Site icon vidhaatha

అవినీతి అధికారుల‌కు రేవంత్ రెడ్డి స‌ర్కార్ వ‌రం.. విజిలెన్స్ విచారిస్తున్నా వీఆర్ఎస్‌ ఇస్తారా?

హైద‌రాబాద్‌, మే 31 (విధాత‌):
రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారింది, నియంతృత్వ పాల‌న అంత‌మైంద‌ని.. గ‌త ప్ర‌భుత్వంలో అంతులేని అవినీతి చేసిన అధికారుల‌పై చర్యలు తీసుకుంటారని గ‌ట్టిగా విశ్వ‌సించిన ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆశ‌ల‌పై ముఖ్య‌మంత్రి, మంత్రులు నీళ్లు చ‌ల్లుతున్నారు. కంచె చేను మేసిన విధంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పెద్ద‌ల తీరు ఉంద‌ని స‌చివాల‌య ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. ఈ ప్ర‌భుత్వంలో త‌ప్పులు చేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవడం లేదని.. ఈ విషయం అసలు ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశంగానే లేదని వారు వాపోతున్నారు.

చెలరేగిన కొందరు అధికారులు
ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌రువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆ ప‌రిపాల‌న వేరుగా ఉండేది. ఇంత ఆర్థిక విధ్వంసం, అరాచ‌కం, అంతూ పోంతూ లేకుండా ప్ర‌జా సంప‌ద కొల్ల‌గొట్ట‌డం జ‌రిగేది కాద‌ని క్ర‌మ‌క్ర‌మంగా తెలంగాణ స‌మాజానికి అవ‌గ‌త‌మ‌వుతోంది. తొమ్మిదిన్న‌ర సంవ‌త్స‌రాల ఏలుబ‌డిలో పాల‌కుల‌తో పోటీప‌డి కొంద‌రు అధికారులు ఇష్టారాజ్యంగా చెల‌రేగిపోయారు. త‌మ‌కు ఎదురే లేద‌నే విధంగా ఐఏఎస్ అధికారుల‌ను మించి, మంత్రుల‌తో పోటీప‌డి స‌మాంత‌ర వ్య‌వ‌స్థ‌ల‌ను న‌డిపారు. స‌చివాల‌యం ఉద్యోగులు, అధికారులు చ‌ర్చించుకుంటున్న దాని ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ర‌వాణా శాఖ‌లో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ క‌మిష‌న‌ర్ (డీటీసీ) కే పాపారావు సాధార‌ణ ఉద్యోగి స్థాయి నుంచి డిప్యూటీ ట్రాన్స్ పోర్టు క‌మిష‌న‌ర్ (డీటీసీ) వ‌ర‌కు ఎదిగారు. త‌న‌కు ఎదురేలేదు అన్నవిధంగా ప‌దేళ్ల పాటు తెలంగాణ ర‌వాణశాఖ‌లో చ‌క్రం తిప్పారు. ఉద్యోగులు, బాధితులు ఎంత మంది ఫిర్యాదు చేసినా అప్ప‌టి ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు, ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌, క‌మిష‌న‌ర్లు బుట్ట దాఖ‌లు చేసేవారు. త‌మ‌పై వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని మ‌హిళా ఉద్యోగులు క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు చేసినా క‌నీసం చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేదు. ఎంతో మంది అర్హులైన ఉద్యోగులు ఉన్నా వారిని కాద‌ని జూనియ‌ర్ అయిన మోట‌ర్ వెహికిల్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎంవీఐ) పాపారావును 2016 సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రిలో రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారి (ఆర్టీఓ) గా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14, 16ను ఉల్లంఘించి ప‌దోన్న‌తి ఇచ్చారంటూ భార‌త రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేసినా చ‌ర్య‌లు తీసుకోలేదు. మ‌ళ్లీ కొద్ది నెల‌ల‌కే డిప్యూటీ ట్రాన్స్ పోర్టు క‌మిష‌న‌ర్ గా ప‌దోన్న‌తి క‌ల్పించి, ఖైర‌తాబాద్ లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో నియ‌మించారు. గ్రూప్ వ‌న్ లో ఇంట‌ర్వూకు ఎంపికైన వారిలో మార్కులు, ఇంట‌ర్వూ మార్కుల ఆధారంగా రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారిగా ఎంపిక‌వుతార‌ని, అలాంటి పోస్టును అర్హ‌త‌లేని పాపారావుకు కేటాయించ‌డంపై నిరుద్యోగులు మండిప‌డ్డారు. తమ పొట్ట‌కొడుతున్నార‌ని, ఇలాంటి వారితో స‌మాజానికి న‌ష్టం అంటూ విమ‌ర్శించారు. అడ్మినిస్ట్రేటివ్ విభాగం నుంచి ఖాళీల‌ను బ‌ట్టి ప‌దోన్న‌తులు ఇవ్వ‌డం విధానంగా వ‌స్తున్న‌ది. ఈ విధానాన్ని ర‌వాణా శాఖ‌లో రద్దు చేయించారు. రాష్ట్రంలో జ‌రిగే బ‌దిలీల‌పై ఆజ‌మాయిషీ చెలాయించారు. ఏ బ‌దిలీ జ‌ర‌గాల‌న్నా త‌న క‌నుస‌న్న‌ల్లో చేయాల‌ని, త‌ను చెప్పిన‌ట్లు న‌డ‌చుకోవాల‌ని క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించేవారని.. విన‌క‌పోతే అప్పటి సీఎం ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి. కరీంన‌గ‌ర్ లో అనుమ‌తి లేకుండా పార్క్ స్థ‌లంలో ట్రాక్ ఏర్పాటు చేసి త‌న తండ్రి పేరు పెట్టార‌ని ర‌వాణాశాఖ గుర్తించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో పాపారావుపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని, విజిలెన్స్ విచార‌ణ జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఆశించారు. స‌చివాల‌యంలోని రవాణాశాఖ‌ అధికారులు సైతం పాపారావు పాపాల‌కు సంబంధించిన ఫైలును సిద్ధం చేశారు. కానీ ఉద్యోగుల ఆశ‌లు అడియాస‌లు చేసేలా ర‌వాణా శాఖ పెద్ద‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు వీఆర్ఎస్ పెట్టుకోవ‌డం, వెంట‌వెంట‌నే నిర్ణ‌యాలు జ‌ర‌గ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు, అక్ర‌మాలు చేసిన ఆయ‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించ‌కుండా, చ‌ర్య‌లు తీసుకోకుండా రాజీనామాను ఆమోదించ‌డం వెన‌కాలా కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌ని రవాణా శాఖ ఉద్యోగులు బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆశీస్సుల‌తో ఆయ‌న సునాయ‌సంగా రాజీనామాను ఆమోదింప చేయించుకున్నార‌ని అంటున్నారు.

నరేందర్ రావు వీఆర్ఎస్ ఆమోదం
స‌చివాల‌యంలోని రెవెన్యూశాఖ‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దిగిపోయే వ‌ర‌కు ఒక వెలుగు వెలిగిన ఎం.న‌రేంద‌ర్ రావు వీఆర్ఎస్ ఆమోదం కూడా ప్ర‌స్తుతం స‌చివాల‌యంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో ఆరోప‌ణ‌లు ఉన్నా, వాట‌న్నింటి బుట్ట‌దాఖ‌లు చేస్తూ వీఆర్ఎస్ కు ఆమోదం చేసి బారాఖుల్లా మాఫీ చేశార‌ని అంటున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికి న‌రేందర్ రావు సాధార‌ణ సెక్ష‌న్ ఆఫీస‌ర్ మాత్ర‌మే. ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ఎవ‌రికీ ల‌భించ‌ని ప‌దోన్న‌తులు ఈయ‌న‌కు ల‌భించాయ‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అసిస్టెంట్ సెక్రెట‌రీ, డిప్యూటీ సెక్రెట‌రీ, జాయింట్ సెక్రెట‌రీ, ఆ త‌రువాత అడిష‌న‌ల్ సెక్రెట‌రీ గా ప‌దోన్న‌తి పొందారు. ఈ ప‌దోన్న‌తుల‌పై అప్ప‌ట్లో పెద్ద ర‌గ‌డ జ‌రిగినా ప్ర‌భుత్వ పెద్ద‌లు ఏమాత్రం ఖాత‌ర్ చేయ‌లేదు. స‌చివాల‌యం నిర్మాణం ఇలా ఉండ‌డానికి కార‌ణం ఈయ‌నే అంటారు. అధికారుల గ‌దులను చిన్న‌గా చేయ‌డం, ఎవ‌రైనా వ‌స్తే కూర్చోవ‌డానికి స్థ‌లం లేకుండా ఇరుకుగా క‌ట్టించడంలో ప్ర‌ధాన భూమిక పోషించార‌ని అంటున్నారు. అడిష‌న‌ల్ సెక్రెట‌రీ స్థాయి అధికారి కూడా సీనియ‌ర్ అసిస్టెంట్ మాదిరి దిగ‌జార్చిన ఘ‌న‌త ద‌క్కిందంటున్నారు. ఫైళ్లు దాచుకునేందుకు కూడా స్థ‌లం లేకుండా చేయ‌డం, సెల్లార్ లో డిప్యూటీ సెక్రెట‌రీ స్థాయి అధికారుల‌ను కూర్చొనెలా చేశారంటున్నారు. రాష్ట్రంలో స‌చివాల‌యంలో ప‌నిచేసే అధికారుల‌కు ఉన్న హోదా, గౌర‌వం లేకుండా చేయ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు. స‌చివాల‌యం ఉద్యోగుల మాక్స్ హౌసింగ్ సొసైటీలో అక్ర‌మాల‌పై ఇప్ప‌టికే న‌రేంద‌ర్ రావుపై విజిలెన్స్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతోంది. త‌న అక్ర‌మ ప‌దోన్న‌తుల‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ విచార‌ణ జ‌రుగుతుండ‌గానే వీఆర్ఎస్ ఫైలును ఎలా ఆమోదిస్తార‌ని న‌లుగురు స‌చివాల‌యం ఉద్యోగులు చ‌ర్చించుకుంటున్నారు.

ఆ మంత్రి ఆశిస్సులతోనే..
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స‌హాయంతోనే చ‌ర్య‌ల నుంచి త‌ప్పించుకున్నార‌న్నా. ఆయ‌న ఆశీస్సుల‌తోనే తెలంగాణ పుడ్ క‌మిష‌న్ లో మెంబ‌ర్ సెక్రెట‌రీ గా బ‌దిలీ చేయించుకుని, అక్క‌డ కొద్ది నెల‌లు కొన‌సాగారు. ఉద్యోగం చేస్తే మున్ముందు ఇబ్బందులు వ‌స్తాయ‌ని గ‌మ‌నించిన న‌రేంద‌ర్ రావు ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో వీఆర్ఎస్ కు ద‌ర‌ఖాస్తు చేశారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా త‌న ప‌ని కానిచ్చేశారు. ఏప్రిల్ నెల‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సీఎస్ శాంతి కుమారి వీఆర్ఎస్ కు ఆమోద ముద్ర వేసి వెళ్లిపోయారు. ఈ విష‌యం ఎక్క‌డ కూడా లీక్ కాలేదు. రెండు రోజుల క్రితం వీఆర్ఎస్ కు ఆమోద తెలుపుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో స‌చివాల‌యంలోని ఉద్యోగులు షాక్ కు గుర‌య్యారు. ఇన్నాళ్లు ఆయన మీద చర్యలు తీసుకుంటారనుకున్న ఉద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి.

Exit mobile version