Rythu Bharosa | రైతు భరోసా ఆలస్యంపై రగిలిపోతున్న రైతాంగం!

రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యంపై రైతుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. యాసంగి సాగు మధ్యలో సాయం ఆలస్యం కావడంతో ప్రభుత్వం పై ఆగ్రహం పెరుగుతోంది.

Rythu Bharosa

విధాత : యాసంగి పంటల సాగులో నిమగ్నమైన రైతాంగానికి ఇప్పటికే ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం నిధుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇదిగో అదిగో అంటూ చేస్తున్న కాలయాపన పట్ల లబ్ధిదారులైన రైతుల్లో తీవ్ర అసహనం పెల్లుబికుతుంది. క్షేత్ర స్థాయిలో ఎక్కడ రైతులు కలిసినా..రైతు భరోసా నిధుల విడుదల ఎప్పుడంటూ చర్చించుకోవడం చూస్తుంటే..రైతు భరోసా సాయం కోసం వారు పడుతున్న ఎదురుచూపులకు నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏడాదికి ఎకరానికి రూ. 12వేలు చొప్పున రెండు పర్యాయాలుగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.

డిసెంబర్ లో ఇవ్వాల్సిన రైతు భరోసా…జనవరి మొదటి వారంలో అని ఒకసారి, సంక్రాంతికి అని మరోసారి..మున్సిపల్ ఎన్నికల ముందు, తర్వాతా అని మరోసారి ప్రభుత్వం లీక్ లు ఇచ్చేసి వాయిదా మంత్రాన్నే పఠించింది. చివరకు మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిశాక రైతుల ఖాతాల్లో నిధులు వేస్తామంటూ ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసిపోయినా…ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల విడుదల జరుగపోవడంతో రైతాంగంలో అసహనం తీవ్రమైంది. గత వానాకాలం సీజన్ లో 69,39,548 రైతులకు ఒక ఎకరాకు ₹6,000 చొప్పున బదిలీ చేశారు. మొత్తం ₹8,744.13 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సుమారు 1 కోటి 45 లక్షల 73వేల ఎకరాల కు సాయం అందింది. పంటల సాగు విస్తీర్ణం సర్వే లెక్కలపై జాప్యం నెలకొనడంతో ఈ యాసంగి లో కూడా అంతే మొత్తం బదిలీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. అయితే అనూహ్యంగా రైతు భరోసా నిధుల పంపిణీపై ప్రభుత్వం వాయిదా పర్వాన్ని కొనసాగిస్తుండటం ఇప్పుడు రైతాంగం సహనానికి పరీక్ష పెడుతుంది.

రైతుల ఆగ్రహానికి ఆజ్యం పోసిన కేబినెట్ భేటీ

ప్రభుత్వం పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో కేబినెట్ భేటీలు నిర్వహిస్తుండటం సాధారణంగా కొనసాగే ప్రక్రియ. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముందెన్నడు లేని రీతిలో ప్రజల్లో..ముఖ్యంగా రైతాంగంలో చర్చనీయాంశమైంది. ఓ కేబినెట్ భేటీపై క్షేత్ర స్థాయిలో ఇంతటి చర్చ ముందెన్నడు కనిపించకపోవడం విశేషం. ఇందుకు రైతు భరోసా ప్రధాన కారణంగా నిలిచింది. ఆ కేబినెట్ భేటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటారని..భేటీ తర్వాత రైతు భరోసా నిధులు విడుదలవుతాయని ఆసక్తిగా ఎదురుచూసిన రైతు కుటుంబాలకు ఆశాభంగం ఎదురైంది. వాయిదాలు పడుతూ వస్తున్న రైతు భరోసా పై కేబినెట్ భేటీలో చర్చించకపోవడం చూసిన రైతాంగం రేవంత్ సర్కార్ తీరుపై భగ్గుమంటుంది. పైపెచ్చు ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా కాంట్రాక్టులు, కమిషన్లు, రియల్ ఎస్టేట్ లతో ముడిపడిన అంశాలపైన కేబినెట్ ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవడం కూడా రైతాంగంలో మరింత ఆగ్రహాన్ని రగిలించింది. యాసంగి పంటల సాగుకు ఇప్పటికే తాము అప్పులు చేశామని, రైతు భరోసా నిధులు ఇస్తే వాటిని తీర్చవచ్చని భావించామని..తీరా కేబినెట్ భేటీలో రైతు భరోసా ఊసుకూడా లేకపోవడం విస్మయపరిచిందని రైతులు అసహనం వెళ్లగక్కుతున్నారు. రేవంత్ సర్కార్ తీరు చూస్తుంటే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల దాక రైతు భరోసా వేసేటట్లుగా లేదని కొందరు..అసలు పరిషత్ వ్యవస్థను రద్దు చేస్తే ఇక రైతు భరోసా ఇస్తాడా అని మరికొందరు రైతులు రచ్చబండ వేదికగా చర్చోపచర్చల్తో మునిగి తేలుతూ ప్రభుత్వంపై అసహనం పెంచుకుంటున్నారు.

పార్లమెంటు ఎన్నికల వేళ కూడా రైతు భరోసాపై కప్పదాట్లు

పార్లమెంటు ఎన్నికల సందర్బంగా కూడా రేవంత్ రెడ్డి రైతు భరోసాపై ఇదే రకంగా మభ్య పెట్టే మాటలతో కాలయాపన చేశారని.. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూడా రైతు భరోసాపై అవకాశవాదంగానే మాట్లాడారన్న భావన రైతుల్లో వినిపిస్తుంది. ఓ వైపు ఎరువుల కోసం యూరియా యాప్ అంటూ ఇబ్బందులు సృష్టించారని, సన్న ధాన్యం బోనస్ లకు ఎదురుచూపులు పెట్టారని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నెలల తరబడి కొనుగోలు సాగించారని, ఇప్పుడు మరోసారి రైతు భరోసాపై కప్పదాట్లు వేసిందంటూ రైతులు రేవంత్ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు రైతు భరోసా కోసమే అంటూ కొత్తగా ఆర్బీఐ వద్ద రూ.9వేల కోట్ల మేరకు నిధుల సమీకరణ చేసిన ప్రభుత్వం…చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా వేయకుండా జాప్యం చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తుందంటూ రైతులు రచ్చబండల వద్ద బాహటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరిమితులు లేకుండా సమయానికి ఏడాదికి రెండు పంటల చొప్పున రైతు భరోసా పొందిన రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా పంపిణీ తీరు మింగుడుపడటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రచారం మాటున.. గత వాన కాలంలో మూడు ఎకరాల వరకే రైతు భరోసా సాయాన్ని పరిమితం చేయడం కూడా రైతులను అసహనానాకి గురి చేసింది. ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ఉన్నతాదాయ వర్గాల భూములను మినహాయించి మిగతా చిన్న, సన్నకారు రైతులకు రైతు భరోసా యధావిధిగా కనీసం ఒక కుటుంబానికి 5 ఎకరాల వరకు అందించాలన్న వాదన రైతాంగం నుంచి వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

Nani | ‘జడల్ జమానా’ సోషల్ మీడియాలో దుమారం… నాని సాంగ్ త‌ర్వాత మ‌న హీరోలంద‌రికి జ‌డ‌ల్ త‌గిలించారుగా..!
పొగొట్టుకున్న చోటే బీఆర్ఎస్ వెదుకులాటా! రెండు జిల్లాలపై గురిపెట్టిన గులాబీ ముఖ్యులు

Latest News