అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో వాయు గుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19న వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో అవసరమున్న చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఏపీకి భారీ వర్ష సూచన : ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
