Site icon vidhaatha

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో తన ప్రసంగాన్ని చేశారు. కొవిడ్ మృతులకు గవర్నర్ సంతాపం తెలిపారు.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సెల్యూట్ చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు గవర్నర్. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మందికి టెస్టులు నిర్వహించారని.. ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ తెప్పించామన్నారు. కొత్తగా కొవిడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఆరోగ్యశ్రీలో కొవిడ్ చికిత్సను చేర్చి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లు కేటాయించామన్నారు.

దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతోందని.. కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉందన్నారు హరిచందన్. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ప్రభావం పడినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని.. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయన్నారు. వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. రైతులకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని.. అమూల్‌తో ఒప్పందంతో పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. విద్యార్థులకు విద్యా కానుక, అమ్మఒడి, గోరు ముద్ద పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పేదలకు రెండు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు గవర్నర్. మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారని.. స్పందన ద్వారా ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నామన్నారు. విద్యాశాఖకు రూ.25, 714కోట్లు.. జగనన్న వసతి దీవెన కింద రూ.1049 కోట్లు.. జగనన్న విద్యా దీవెన కోసం రూ.4,879కోట్లు.. 44.5 లక్షలమంది తల్లులకు జగనన్న అమ్మఒడి అందిస్తున్నామన్నారు. మనబడి నాడు నేడు కింద 15,717 స్కూళ్ల ఆధునీకరణకు రూ.3,948 కోట్లు కేటాయించామన్నారు.

Exit mobile version