Chandrababu Naidu | ప్రాజెక్టుల విషయమై తెలంగాణతో పోరాటం చేయబోనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణతో తానెప్పుడైనా గొడవ పడ్డానా? అని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం.. మిగిలిన నీటినే వాడుకుంటాం.. ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదు.. అని అన్నారు. బనకచర్లపై పోరాటం అవసరం లేదని.. అవసరమైతే ఢిల్లీలో కూర్చుని మాట్లాడుకుందామని చెప్పారు. మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం ఉండదన్నారు. కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదని.. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలని సూచించారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని.. కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువగా ఉన్నాయన్నారు. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు ’’అని చంద్రబాబు తెలిపారు.
క్రిమినల్ రాజకీయాల తాట తీస్తా
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తే సమాధానం చెబుతామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయం కోసం వైసీపీ వాళ్లు ప్రశ్నిస్తే తాట తీస్తామని స్పష్టం చేశారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శ చేసిన జగన్.. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్ లను, రౌడీ మూకలను పరామర్శిస్తూ విగ్రహాలు పెడుతూ రాజకీయాల కోసం శాంతిభద్రతల సమస్యల సృష్టిస్తామంటే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. పల్నాడు పర్యటన అనుమతులను జగన్ ఉల్లంఘించారని.. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా? అని ప్రశ్నించారు. చంపండంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తన కాన్వాయ్ వాహనం ఢీకొని చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించని జగన్.. క్రిమినల్స్ ను మాత్రం పరామర్శిస్తాడని ఎద్దేవా చేశారు. జగన్ పుష్ప 2 సినిమాలోని రపా రపా కోసేస్తా డైలాగ్ పై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రమంతా ఓ పాజిటివ్ వేవ్ వస్తుంటే.. క్రిమినల్స్ మాత్రం తమ ధోరణిలోనే వెళుతుంటారని జగన్ తీరును తప్పబట్టారు. వారికి క్రైం అలవాటైపోయిందని..వారిని ఎవరూ మార్చలేరని విమర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. ప్రతిరోజూ ప్రతి ఒక్కరు 10 నిమిషాలు మెడిటేషన్ చేయాలన్నారు.